నవతెలంగాణ-హైదారాబాద్: ఉచిత పథకాలు జాతీయ ప్రయోజనాలను, దేశ అభివృద్ధిని దెబ్బతీస్తున్నాయని మోడీ ప్రభుత్వం గగ్గోలుపెడుతోంది. కానీ ఎన్డీయే కీలక భాగస్వామి నితిష్ కుమార్ మాత్రం అందుకు విరుద్ధంగా ఓ ఫ్రీ పథకాలకు శ్రీకారం చుట్టారు. బీహార్ రాష్ట్రంలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈక్రమంలో 100 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తును అందించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ ప్రతిపాదనను ఆర్థిక శాఖ ఆమోదించింది కానీ.. కేబినెట్ ఆమోదం తెలపాల్సి ఉంది. రాష్ట్రంలోని అన్ని కుటుంబాలకు 100 యూనిట్ల ఉచిత విద్యుత్తును అందించడానికి ఇంధన శాఖ ఓ ప్రతిపాదనను సిద్ధం చేసింది.
ఈ ప్రతిపాదనను మొదట ఆర్థిక శాఖకు పంపగా.. అక్కడ ఆమోదించబడింది. ఈ ప్రతిపాదన ప్రకారం.. వినియోగదారులు 100 యూనిట్ల వరకు ఎటువంటి ఛార్జీ చెల్లించాల్సిన అవసరం లేదు. 100 యూనిట్లు దాటితే.. యూనిట్‌కు ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది. ఇది ఎంత అన్నది ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో వినియోగదారుల నుంచి మొదటి 50 యూనిట్లకు.. ఒక్కో యూనిట్‌కు రూ.7.57 వసూలు చేస్తున్నారు. ఆ తర్వాత రూ.7.96 ఛార్జీ చేస్తున్నారు.
ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ శనివారం సామాజిక భద్రతా పెన్షన్ పథకాన్ని పెంచుతున్నట్లు ప్రకటించారు. పెన్షన్ ఇప్పుడు నెలకు రూ.400కు బదులుగా రూ.1100 అవుతుంది. పెరిగిన పెన్షన్ మొత్తం జూలై నుండి ప్రారంభమవుతుందని సీఎం తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటి 9 లక్షల 69 వేలకు పైగా లబ్ధిదారులు ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 35 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని మంగళవారం ప్రకటించారు. ప్రభుత్వ శ్రామిక శక్తిలో మహిళల ప్రాతినిధ్యాన్ని పెంచడానికి కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.