నవతెలంగాణ – హైదరాబాద్: కోల్ కతాలోని ప్రఖ్యాత ఐఐఎం బాయ్స్ హాస్టల్ లో ఓ విద్యార్థి తనపై లైంగికదాడి చేశాడంటూ ఓ విద్యార్థిని సంచలన ఆరోపణలు చేయడం తెలిసిందే. తాను మానసిక సమస్యలతో బాధపడుతున్నానని, దాంతో ఆ విద్యార్థి కౌన్సెలింగ్ ఇస్తానని హాస్టల్ కు పిలిచి తనకు మత్తుమందు కలిపిన కూల్ డ్రింక్ ఇచ్చాని ఆ అమ్మాయి తెలిపింది. తాను స్పృహ కోల్పోగా, తనపై లైంగికదాడి జరిగిందని పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే ఈ వ్యవహారం ఆసక్తికర మలుపు తిరిగింది. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ కలకత్తా విద్యార్థినిపై లైంగికదాడి జరిగిందన్న వార్తలను ఆమె తండ్రి ఖండించారు. తన కుమార్తె ఆటో-రిక్షాలో నుంచి పడిపోయిందని, అపస్మారక స్థితిలోకి వెళ్ళిందని ఆయన తెలిపారు. శుక్రవారం రాత్రి 9:34 గంటలకు తనకు ఫోన్ వచ్చిందని, తన కుమార్తెను పోలీసులు రక్షించి ఎస్‌ఎస్‌కేఎం ఆసుపత్రిలోని న్యూరాలజీ విభాగానికి తరలించారని ఆయన పేర్కొన్నారు.
తన కుమార్తెపై ఎటువంటి లైంగిక దాడి జరగలేదని, ఆమెను హింసించలేదని లేదా దురుసుగా ప్రవర్తించలేదని తండ్రి పేర్కొన్నారు. పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదులో భాగంగా తన కుమార్తె ఏదో వ్రాయమని అడిగారని, దాంతో ఆమె ఆ పత్రంలో వివిధ అంశాలను రాసిందని ఆయన వెల్లడించారు. ఆమె చెప్పిన ప్రకారం ఓ వ్యక్తిని అరెస్ట్ చేశామని పోలీసులు చెప్పారని ఆయన పేర్కొన్నారు.అయితే, తాను తన కుమార్తెతో మాట్లాడానని, తనపై ఎలాంటి లైంగికదాడి జరగలేదని ఆమె తనతో చెప్పిందని ఆయన వివరించారు. పోలీసులు చెప్పినట్టే ఫిర్యాదు పత్రంలో రాశానని పేర్కొందని కూడా ఆయన వెల్లడించారు.