అనంతపురం: అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) 16వ రాష్ట్ర మహాసభల అనంతపురం కేంద్రంగా అక్టోబర్ 13, 14, 15వ తేదీల్లో జరగనున్నాయి. ఇందులో భాగంగా శనివారం అనంతపురం ఎన్‌జిఒ హోంలో ఐద్వా రాష్ట్ర మహాసభల ఆహ్వాన సంఘం సమావేశం నిర్వహించారు. ఆ సంఘం రాష్ట్ర కోశాధికారి వి సావిత్రి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డి రమాదేవి మాట్లాడుతూ సమాజంలో మహిళలపై హింస పెరిగిపోతోందన్నారు. ఈ క్రమంలో ఐద్వా రాష్ట్ర మహాసభ అక్టోబర్ 13, 14, 15వ తేదీల్లో అనంతపురం నగరంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మహాసభల్లో మూడు సంవత్సరాల ఉద్యమ సమీక్ష చేసుకోవడంతో పాటు నేడు ముందుకొచ్చిన పలు అంశాలపై చర్చిస్తామన్నారు. మహాసభ గొంతుకగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో మైక్రో ఫైనాన్స్ సమస్యలు, మద్యం సమస్యలు, కులాంతర వివాహితుల సమస్యలు, పసి బిడ్డలపై జరుగుతున్న దాడులు, ప్రభుత్వాలు ఇచ్చిన వాగ్దానాల అమలులో జాప్యం తదితర వాటిపై చర్చిస్తామన్నారు. మహాసభల విజయవంతానికి అందరూ సహాయ సహకారాలు అందించి జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆహ్వాన సంఘం గౌరవాధ్యక్షులు, స్నేహలత నర్సింగ్ హోమ్ డాక్టర్ అరుణ, అధ్యక్షులు, లలితకళాపరిషత్ కార్యదర్శి పద్మజ, ఫ్యాట్రన్స్ గేట్స్ ఇంజనీరింగ్ కళాశాల చైౖర్మన్ వికె పద్మావతమ్మ, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత రాచపాళెం చంద్రశేఖర్‌రెడ్డి, ఫ్యాట్రన్స్ ఎస్‌వి సూపర్‌మార్కెట్ చైర్మన్ ప్రతాప్‌రెడ్డి, రవికాంత్ రమణ, ప్రముఖ వైద్యులు ఎండ్లూరి ప్రభాకర్, బాలాకుమారి, ప్రసూన, మాధవి, మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ప్రగతి తదితరులు పాల్గొన్నారు.