– ఎక్సైజ్ అధికారులు నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు :
ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు
– వికారాబాద్‌లో ఎక్సైజ్ స్టేషన్ ప్రారంభం
నవతెలంగాణ-వికారాబాద్ : డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపి నివారించాలని ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఈ విషయంలో ఎక్సైజ్ అధికారులు నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శనివారం వికారాబాద్ జిల్లా పట్టణ కేంద్రంలో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్‌ను స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, శాసనమండలి చీఫ్ విప్ పట్నం మహేందర్‌రెడ్డి, ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డితో కలిసి మంత్రి ప్రారంభించారు. అనంతరం సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. గంజాయితోపాటు ఇతర మాదకద్రవ్యాలను సరఫరా చేస్తున్న వారిని గుర్తించి కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉందన్నారు. మాదక ద్రవ్యాలు ఎక్కడి నుంచి సరఫరా అవుతున్నాయో పోలీస్, ఎక్సైజ్ శాఖ అధికారులు ఉమ్మడిగా నిఘా పెట్టాలని సూచించారు. అవసరం అనుకుంటే ఇతర రాష్ట్రాల సహకారం కూడా తీసుకోవాలన్నారు. దొరికిన వారిపై కేసులు పెట్టి చేతులు దులుపుకోవడం కాదని.. వారికి ఉన్న లింకును కనిపెట్టాలని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారులు నిర్లక్ష్యంగా ఉండొద్దని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా చెరువు కట్టల కింద, గుట్టలపైన, కాలువల పక్కన ఈత, తాటి, ఖర్జూర వంటి మొక్కలను పెంచాలన్నారు. ప్రతి గ్రామంలోనూ కనీసం 5 ఎకరాల్లో మొక్కలు నాటేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో చెట్లను పెంచాలని, ఆ చెట్ల నుంచి గీసిన కల్లును నగరానికి సరఫరా చేయాలని అన్నారు. ఈత నీరా, తాటి నీరా, ఖర్జూర నీరాలను ప్రోత్సహించాలని, కల్లును ఎగుమతి చేసే విధంగా కృషి చేయాలని వివరించారు. ఈ విషయంపై ముఖ్యమంత్రితో చర్చించి మరిన్ని నిధులు కేటాయించే విధంగా చర్యలు తీసుకుంటానని తెలిపారు. కల్తీ కల్లు తాగి అస్వస్థతకు గురవ్వడం, మృతిచెందడం లాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కల్తీ కల్లు మూలంగా కూలి చేసుకుని పొట్ట నింపుకుంటున్న పేదలు బలి కాకూడదన్నారు. కల్తీ కల్లును విక్రయిస్తున్న వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని సూచించారు.
స్పీకర్ ప్రసాద్‌కుమార్ మాట్లాడుతూ.. గౌడన్నల ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తోందన్నారు. ప్రభుత్వ భూముల్లో ఈత, తాటి వనాలను పెంచాలని యోచిస్తున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా తాటి, ఈత మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కాలే యాదయ్య, జిల్లా కలెక్టర్ ప్రతీక్‌జైన్, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ దశరథ్, సూపరింటెండెంట్ విజయ భాస్కర్, అదనపు కలెక్టర్ ఎం.సుధీర్ పాల్గొన్నారు.
డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES