Sunday, July 13, 2025
E-PAPER
Homeరాష్ట్రీయం'పూర్‌' ఫార్మర్‌ ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌

‘పూర్‌’ ఫార్మర్‌ ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌

- Advertisement -

– వ్యవసాయ పనుల్లో అన్నదాత నిమగం
– పనిభారంతో అవగాహన కల్పించని అధికారులు
– సంక్షేమ పథకాలకు దూరమయ్యే అవకాశం
నవతెలంగాణ-ఆదిలాబాద్‌ ప్రాంతీయ ప్రతినిధి
: వ్యవసాయ రంగంలో రైతుల వివరాలను డిజిటలైజేషన్‌ చేయడం ద్వారా సంక్షేమ పథకాలను వర్తింపజేసేందుకు తీసుకొచ్చిన ‘ఫార్మర్‌ రిజిస్ట్రీ’ నత్తనడకన సాగుతోంది. రైతుకు సంబంధించిన భూమితోపాటు వ్యక్తిగత వివరాలు నమోదు చేయాల్సి ఉంది. ఆధార్‌ కార్డు మాదిరిగా 11 అంకెలతో ఐడీ కేటాయించడానికి వివరాలను ఆన్‌లైన్‌ చేస్తున్నారు. ప్రధాన మంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి పథకంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలు రైతులకు వర్తింపజేసేందుకు ఈ రిజిస్ట్రేషన్‌ ఉపయోగపడుతుందని అధికారులు పేర్కొంటున్నారు. మే 6న ఆన్‌లైన్‌ నమోదు ప్రక్రియ ఆరంభమైంది. అయితే, ప్రస్తుతం రైతులు వ్యవసాయ పనుల్లో బిజీ కావడంతో ఈ ప్రక్రియ నెమ్మదించింది. అధికారులు సైతం ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభం కావడం, ఇతర పనుల్లో నిమగమయ్యారు. దీంతో ఈ నమోదు ప్రక్రియ వెనుకపట్టు పట్టింది. మొత్తంగా 50 శాతం కూడా పూర్తి కానట్టు తెలుస్తోంది.
ప్రధాన మంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి పథకానికి సంబంధించి 20వ విడత డబ్బులు ‘ఫార్మర్‌ రిజిస్ట్రీ’ ఆధారంగా అందజేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో నమోదు ప్రక్రియ పూర్తి కావడానికి ఇంకా సమయం పట్టే అవకాశముంది. రిజిస్ట్రేషన్‌ చేసుకోని రైతులు ఈ పథకానికి దూరమయ్యే ప్రమాదముంది. రైతులకు అవగాహన కల్పించకపోవడంతో ఫార్మర్‌ రిజిస్ట్రేషన్‌పై ఆసక్తి చూపించడం లేదు. ఇప్పటి వరకు ఆదిలాబాద్‌ జిల్లాలో ఆన్‌లైన్‌ నమోదు కేవలం 42.83 శాతమే పూర్తయింది. జిల్లా వ్యాప్తంగా 1,42,462 మంది రైతుల రిజిస్ట్రేషన్‌ చేయాల్సి ఉండగా, 61071 మంది మాత్రమే నమోదు చేసుకున్నారు. మండలాల వారీగా పరిశీలిస్తే.. నార్నూర్‌ మండలంలో 58.53 శాతం నమోదుతో మొదటి స్థానంలో ఉంది.
అవగాహన లేకపోవడమే కారణమా?
రైతులకు ఈ ఫార్మర్‌ రిజిస్ట్రేషన్‌పై అవగాహన లేకపోవడంతోనే నమోదు ప్రక్రియ నెమ్మదిగా సాగుతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆదిలాబాద్‌ జిల్లాలో మూడు వ్యవసాయ డివిజన్లలో డీఏఓలు ముగ్గురు, 18 మంది ఏఓలు, 101 క్లస్టర్లలో 101 మంది ఏఈఓలు పనిచేస్తున్నారు. వీరు రైతు బీమా, రైతు భరోసా, పంటసాగుపై రైతులను చైతన్యపరుస్తూ అండగా నిలవాల్సి ఉంటుంది. ప్రతి మంగళవారం రైతు వేదికల ద్వారా రైతులకు అవగాహన కార్యక్రమాలు చేపట్టే వ్యవసాయ అధికారులు ఫార్మర్‌ రిజిస్ట్రేషన్‌ విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏఈఓలు రైతులకు క్షేత్ర స్థాయిలో అవగాహన కార్యక్రమాలు చేపడుతూనే వారికందే సంక్షేమ పథకాలపై చైతన్యపర్చాల్సి ఉంటుంది. ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభం కావడంతో వారు వారికి కేటాయించిన ఫెర్టిలైజర్‌ షాపులకే పరిమితమైనట్టు తెలుస్తోంది. మొత్తంగా చూస్తే జిల్లాలో ఆరు మండలాల్లో రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ 25 శాతం కూడా పూర్తి కాలేదని లెక్కలు చెబుతున్నాయి.
నిరంతరం ప్రక్రియ
జిల్లా ఫార్మర్‌ రిజిస్ట్రీ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుంది. ప్రారంభంలో వేగవంతంగా అయినప్పటికీ రైతులు, ఏఈఓలు వ్యవసాయ సంబంధిత పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ ప్రక్రియకు చివరి గడువు అంటూ లేదు. రైతులు ఐడీ పొందితే మేలు చేకూరుతుంది. ప్రతి రైతూ ఏఈఓలను సంప్రదించి రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. అధికారులు కూడా ఆ దిశగా పనిచేయాలి.

  • శ్రీధర్‌స్వామి, జిల్లా వ్యవసాయ అధికారి
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -