– పెండింగ్‌లో ఏప్రిల్, మే కేంద్రం వాటా
– డు నెలల బియ్యం పంచినా ఇవ్వని ప్రభుత్వాలు
– హమాలీ, లేబర్, అద్దె ఖర్చులకు అప్పులు
– ఆర్థిక ఇబ్బందుల్లో 17200 మంది రేషన్ డీలర్లు
– రాష్ట్రంలో 9 లక్షలు దాటిన ఆహార భద్రత కార్డులు
– అమలు కాని రూ.300 కమీషన్ పెంపు, రూ.5 వేల గౌరవ వేతనం హామీలు
– ఐదు నెలల బకాయిలివ్వాలని డిమాండ్
– అప్పులు చేసి బియ్యం పంపిణీ చేసినం : రేషన్ డీలర్ల సంఘం నాయకులు పాండురెడ్డి
నవతెలంగాణ-మెదక్ ప్రాంతీయ ప్రతినిధి : ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ఆహార భద్రతా కార్డుదారులందరికీ ప్రతి నెలా బియ్యం పంపిణీ చేస్తున్న రేషన్ డీలర్లకు అందాల్సిన కమీషన్ పెండింగ్‌లో ఉంది. గతంలో డీలర్లకు ఒకేసారి కమీషన్ డబ్బులు వచ్చేవి. తాజాగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ వాటా డబ్బుల్ని వేర్వేరుగా వేస్తుండటంతో డీలర్లు రెండు ప్రభుత్వాల దయాదాక్షిణ్యాలపై ఆధారపడాల్సి వస్తోంది. ఇచ్చే అరకొర కమీషన్ కూడా నెల నెలా చేతికందకపోవడంతో హమాలీలు, లేబర్, అద్దెలు ఇతర ఖర్చుల కోసం డీలర్లు అప్పులు చేస్తున్నారు. ఏప్రిల్, మే నెల కమీషన్‌లో కేంద్ర ప్రభుత్వం వాటా విడుదల కాలేదు. జూన్, జులై, ఆగస్టు మాసాలకు సంబంధించి మూడు నెలల బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేసినందుకు డీలర్లకు అందాల్సిన కమీషన్‌ను కేంద్రంతోపాటు రాష్ట్ర ప్రభుత్వమూ విడుదల చేయలేదు. పైగా డీలర్ల కమీషన్‌ను డబుల్ చేస్తామని, నెలకు రూ.5 వేల గౌరవ వేతనం చెల్లిస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు కాలేదు.
దారిద్య్రరేఖకు దిగువన ఉన్న పేద ప్రజలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో ఆహార భద్రతా కార్డుల ద్వారా ఉచితంగా రేషన్ బియ్యం పంపిణీ చేస్తున్నారు. రాష్ట్రంలో 9 లక్షల కుటుంబాలకు రేషన్ కార్డులున్నాయి. ఇటీవల పాత కార్డుల్లో కొత్తగా నమోదైన వారికి కూడా బియ్యం పంపిణీ చేస్తున్నారు. కొత్తగా మంజూరైన రేషన్‌కార్డుల్ని ఈ నెలలో పంపిణీ చేసే అవకాశముంది. ఆహార భద్రతా కార్డుల్లో నమోదైన సభ్యులకు ఒక్కొక్కరికి నెలకు 6 కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేస్తున్నారు. రాష్ట్రంలో సివిల్ సప్లరు శాఖ పరిధిలో రేషన్ డీలర్ల ద్వారా బియ్యాన్ని పంపిణీ చేస్తున్నారు. మొత్తం 17200మంది రేషన్ డీలర్ల ద్వారా ప్రతి నెలా 1.7 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని కార్డుదారులకు పంపిణీ చేస్తున్నారు. బియ్యం పంపిణీ చేసినందుకు క్వింటాల్‌కు రూ.140 చొప్పున డీలర్లకు కమీషన్ చెల్లిస్తారు. ఈ లెక్కన రాష్ట్రంలో ఉన్న డీలర్లందరికీ నెలకు రూ.24 కోట్ల మేర కమీషన్ రూపంలో చెల్లిస్తారు. అయితే, ఏప్రిల్, మే నెలతోపాటు జూన్, జులై, ఆగస్టు నెలల బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేసినందున మొత్తం ఐదు నెలల కమీషన్ డబ్బులు డీలర్లకు రావాల్సి ఉంది.
ఐదు నెలల బకాయిలు పెండింగ్
రేషన్ డీలర్లకు ఐదు నెలలకు సంబంధించి సుమారు రూ.92 కోట్ల మేరకు కమీషన్ బకాయిలు పెండింగ్‌లో ఉండటంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏప్రిల్, మే నెలల కమీషన్‌లో రాష్ట్ర ప్రభుత్వం వాటా మాత్రమే ఇటీవల చెల్లించింది. కేంద్ర ప్రభుత్వం వాటా ఇంతవరకు విడుదల కాలేదు. క్వింటాల్‌కు ఇచ్చే రూ.140 కమీషన్‌లో కేంద్రం రూ.55 వరకు చెల్లిస్తోంది. డీలర్లకు నెలకు రూ.24 కోట్ల కమీషన్ ఇవ్వాల్సి ఉండగా.. అందులో కేంద్రం వాటా రూ.10 కోట్ల వరకు ఉంటుంది. ఈ లెక్కన ఏప్రిల్, మే నెలలకు సంబంధించి రూ.20 కోట్లు కేంద్రం నుంచి విడుదల కావాల్సి ఉంది. అదేవిధంగా జూన్, జులై, ఆగస్టుకు సంబంధించి బియ్యాన్ని ఒకేసారి కార్డుదారులకు పంపిణీ చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఆ మేరకు రాష్ట్రంలో కార్డుదారులందరికీ డీలర్లు రాత్రింబవళ్లు కష్టపడి మూడు నెలల బియ్యం కోటాను పంపిణీ చేశారు. ఈ మూడు నెలల మొత్తం కమీషన్ రూ.72 కోట్లు, కేంద్రం నుంచి రావాల్సిన ఏప్రిల్, మే నెలల వాటా రూ.20 కోట్లు కలిపితే సుమారు రూ.92 కోట్ల వరకు డీలర్లకు కమీషన్ బకాయిలు రావాలి.
అప్పులతో డీలర్ల తిప్పలు
రేషన్ బియ్యాన్ని నిర్ణీత కాలంలో పంపిణీ చేసేందుకు డీలర్లు అప్పులు చేయాల్సి వస్తోంది. బియ్యం పంపిణీ చేసిన తర్వాతే సివిల్ సప్లరు శాఖ ద్వారా ప్రభుత్వం కమీషన్ డబ్బుల్ని చెల్లిస్తుంది. బియ్యం రవాణా, దిగుమతి కోసం హమాలీలు, పంపిణీలో వర్కర్లు, దుకాణం అద్దెలు, కరెంట్ బిల్లుల కోసం అప్పులు చేస్తున్నారు. కమీషన్ డబ్బులు రాగానే ఖర్చులు పోగా మిగతా సొమ్ముతో తమ కుటుంబాల్ని పోషించుకుంటున్నారు. ఐదు నెలలుగా కమీషన్ డబ్బులు రాకపోవడంతో చేసిన అప్పులు తీరక, కుటుంబ పోషణ ఇబ్బందిగా మారి మనోవేదనకు గురవుతున్నారు. చాలా మంది డీలర్లు ప్రభుత్వం ఇచ్చే కమీషన్ మీదనే ఆధారపడి బతుకుతున్నారు. ఈ ఏడాది మార్చిలో మెదక్ జిల్లా రెడ్డిపల్లికి చెందిన రేషన్ డీలర్ ప్రభాకర్ అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నాడు.
ఉమ్మడి మెదక్ జిల్లాలో 2051 మంది డీలర్లు
ఉమ్మడి మెదక్ జిల్లాలో 2051 మంది రేషన్ దుకాణాలున్నాయి. సంగారెడ్డి జిల్లాలో 846 రేషన్ షాపులున్నాయి. జిల్లాలో 381017 రేషన్ కార్డులుండగా, ఇటీవల కొత్తగా 13450 కార్డులు మంజూరయ్యాయి. వీరందరికీ ప్రతి నెలా 7998 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పంపిణీ చేస్తున్నారు. సిద్దిపేట జిల్లాలో 685 రేషన్ దుకాణాలుండగా 29895 ఆహారభద్రత కార్డులుండగా, కొత్తగా 27648 కార్డులు మంజూరయ్యాయి. పాత కార్డుల్లో 74551 మంది నమోదయ్యారు. మెదక్ జిల్లాలో 520 రేషన్ దుకాణాలుండగా 216716 ఆహార భద్రత కార్డులున్నాయి. 731890 మంది వయోజనులకు నెలకు 4522 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పంపిణీ చేస్తున్నారు. ఒక్కో రేషన్ దుకాణం ద్వారా సగటున 150 క్వింటాళ్లకు తగ్గకుండా పంపిణీ చేస్తున్నారు.
అమలుకాని ఎన్నికల హామీలు
రేషన్ డీలర్లను ఆకర్షించడం కోసం ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలేవీ అమలు చేయలేదని డీలర్ల సంఘం నేతలు పేర్కొంటున్నారు. క్వింటాల్ బియ్యానికి ఇస్తున్న రూ.140 కమీషన్‌ను రూ.300కు పెంచుతామని హామీ ఇచ్చారు. ప్రతి నెలా డీలర్‌కు రూ.5 వేల గౌరవ వేతనం కూడా చెల్లిస్తామని ప్రకటించారు. ఈ రెండు హామీలు అమలు కాలేదు. కనీసం కమీషన్ డబ్బులైనా క్రమం తప్పకుండా ఇవ్వాలని డీలర్లు కోరుతున్నారు.
అప్పులు చేసినం..
ఐదు నెలల బకాయిలివ్వాలి
రేషన్ బియ్యాన్ని ప్రతి నెలా క్రమం తప్పకుండా నిర్ణయించిన సమాయానికి పంపిణీ చేస్తున్నాం. అలాట్ చేసిన బియ్యాన్ని కార్డుదారులకు పంపిణీ చేసేందుకు హమాలీలు, వర్కర్లు, దుకాణం అద్దెలు, కరెంట్ బిల్లులు, కుటుంబ పోషణ కోసం అప్పులు చేయాల్సి వస్తోంది. కమీషన్ డబ్బులు వచ్చాక ఖర్చులు పోగా కుటుంబ పోషణ కష్టమవుతోంది. ఎన్నో ఏండ్లుగా పని చేస్తున్నా కమీషన్ పెంచట్లేదు. 5 నెలల బకాయిలు వెంటనే చెల్లించాలి.
పాండు రెడ్డి, రేషన్ డీలర్ల అసోషియేషన్-న్యాల్‌కల్ మండల అధ్యక్షులు
రేషన్ డీలర్లకందని కమీషన్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES