నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్ : అసమానతలు లేని సమాజమే లక్ష్యంగా డాక్టర్ బీఆర్.అంబేద్కర్ చివరి వరకు పోరాడారని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్.గవాయ్ అన్నారు. శనివారం ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని ఠాగుర్ ఆడిటోరియంలో ”భారత రాజ్యాంగం…. అంబేద్కర్ కంట్రిబ్యూషన్” అనే అంశంపై ఆయన కీలకోపన్యాసం చేశారు. రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు నుంచి దాని అమలు వరకు సుదీర్ఘంగా సాగిన ప్రక్రియలో అంబేద్కర్ క్రీయాశీల పాత్ర పోషించారని గుర్తు చేశారు. రాజ్యాంగ రక్షణ కవచంలా ఆర్టికల్ 32 పౌరహక్కులకు భంగం కలగకుండా కాపాడుతోం దన్నారు. పరిష్కార మార్గాలు లేని హక్కులున్నా ఉపయోగం లేదని అంబేద్కర్ చెప్పేవారని గుర్తు చేశారు. పౌరుల ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లితే నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించే వెసులుబాటును రాజ్యాంగం కల్పించిందని జస్టిస్ గవాయ్ వివరించారు.
అమెరికాలో ద్వంద్వ పౌరసత్వం అమల్లో ఉన్నప్పటికీ…. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంతో పాటు సమాఖ్య పౌరసత్వం ఉందని అన్నారు. అందుకు భిన్నంగా రాష్ట్రాలన్నింటినీ ఏకతాటిపైకి తెచ్చేలా బలమైన ప్రజాస్వామ్య దేశంగా పటిష్టపరిచేలా.. ఒకే దేశం ఒకే రాజ్యాంగాన్ని అంబేద్కర్ అమల్లోకి తీసుకురావటం గర్వించదగ్గ విషయమని అన్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నర్సింహ మాట్లాడుతూ అంబేద్కర్‌కు, హైదరాబాద్‌కు విడదీయలేని అనుబంధం ఉందని చెప్పారు. హైదరాబాద్ స్టేట్ చీఫ్ జస్టిస్ పదవి చేపట్టాల్సిందిగా నాటి నిజాం అభ్యర్థనను అంబేద్కర్ తిరస్కరించిన విషయాన్ని గుర్తు చేశారు. హైదరాబా ద్‌లో జరిగిన అనేక సామాజిక ఉద్యమాలకు మద్దతు ప్రకటించారని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజయ్ పాల్, అడ్వకేట్ జనరల్ ఎ. సుదర్శన్ రెడ్డి ఉస్మానియా విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య కుమార్ మొలుగరం, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ నరేష్ రెడ్డి, ఓఎస్డీ జితెందర్‌కుమార్ నాయక్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ హైకోర్టుల న్యాయమూర్తులు, న్యాయవాదులు, ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధి కారులు, అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థులు, ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.