– వాటికోసం కుటుంబాలను అప్పులపాలు చేయొద్దు
– స్వదేశంలో నాణ్యమైన న్యాయవిద్య ఉంది
– ఏఐ వినియోగంతో కేసులు సత్వర పరిష్కారం
– నల్సార్ లా యూనివర్సిటీ 22వ స్నాతకోత్సవంలో
– సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్…హాజరైన సీఎం రేవంత్‌రెడ్డి
నవతెలంగాణబ్యూరో -హైదరాబాద్ : విదేశీ డిగ్రీల కోసం కుటుంబాలను అప్పులపాలు చేయొద్దని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ అన్నారు. భారతదేశం నాణ్యమైన న్యాయ విద్యను అందిస్తుందనీ, విదేశీ డిగ్రీలు ప్రతిభను పెంచుతాయనేది కేవలం అపోహ మాత్రమే అని స్పష్టంచేశారు. ఎవరి ప్రతిభను వారు తమ పనిద్వారా నిరూపించుకోవాలనీ, న్యాయవాద వృత్తిలో ప్రజాసేవ, అంకితభావం ముఖ్యమని దిశానిర్దేశం చేశారు. ప్రస్తుతం భారతదేశం అనేక న్యాయపరమైన సవాళ్లను ఎదుర్కొంటున్నదనీ, న్యాయపరిధి విస్త్రుతమవుతోందని వివరించారు. న్యాయవాదులు, న్యాయసేవలో ఉన్నవారు అందరి మాటలను జాగ్రత్తగా వినడం చాలా ముఖ్యమని చెప్పారు. న్యాయవ్యవస్థలో కృత్రిమ మేధస్సు (ఏఐ)ని ఉపయోగించాల్సిన అవసరం ఉందనీ, దానివల్ల తీర్పులు మరింత వేగంగా ఇవ్వగలుగుతామని తెలిపారు. శనివారం హైదరాబాద్ శామీర్‌పేటలో జరిగిన నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం 22వ స్నాతకోత్సవానికి ఆయన ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, నల్సార్ యూనివర్సిటీ ఛాన్సలర్ జస్టిస్ సుజరు పాల్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ రేవంత్‌రెడ్డి, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పీఎస్ నరసింహ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జస్టిస్ గవాయ్ న్యాయవిద్యార్థుల నుద్దేశించి మాట్లాడారు. యువ న్యాయవాదులు సామాజిక న్యాయం, వర్ణ వివక్షలపై దష్టి సారించాలని చెప్పారు. అదే సమయంలో చట్టాలు, న్యాయవ్యవస్థ సామర్థ్యాన్ని ప్రజలకు అర్థమయ్యేభాషలో చెప్పాలని సూచించారు. కొన్ని సందర్భాల్లో న్యాయవాద వృత్తి వ్యక్తివాదాన్ని, ఒంటరి స్వభావాన్ని పెంచే ప్రమాదముందని హెచ్చరించారు. న్యాయవాద వృత్తికి సమాజంలోఉన్నత స్థానముందని చెప్పారు. కేవలం నైపుణ్యాల మీదే ఆధారపడకుండా సృజనాత్మకత, నిర్మాణాత్మక పద్ధతులను అనుసరించటం ద్వారా న్యాయవాద వృత్తిలో విజయాలు సాధించొచ్చని తెలిపారు. అంతర్జాతీయంగా వస్తున్న మార్పులు, మనకున్న అర్హతలను బేరీజు వేసుకుని ముందుకు సాగుతూ, దేశ న్యాయ వ్యవస్థ ప్రయోజనాలను రక్షించాల్సిన గురుతరబాధ్యత ఉంటుందనే విషయాన్ని గమనించాలని సూచించారు. న్యాయ విశ్వవిద్యాలయాల్లో ఎల్.ఎల్.ఎమ్.వంటి కోర్సులపై ఎక్కువ పెట్టుబడులు పెట్టాలని కోరారు. అనంతరం న్యాయ విద్యలో డిగ్రీలు, డిప్లొమాలు, పీహెచ్‌డీ (డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ), ఎల్‌ఎల్‌ఎం (మాస్టర్ ఆఫ్ లాస్), మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌తోపాటు ఇతర కోర్సుల్లో పట్టాలు పొందిన పలువురు విద్యార్థులకు జస్టిస్ గవారు, సీఎం బంగారు పతకాలను, జ్ఞాపికలను అందజేశారు.
విదేశీ డిగ్రీల మోజు వద్దు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES