నవతెలంగాణ-హైదరాబాద్: ఈ ఉదయం కన్నుమూసిన ప్రముఖ సినీ నటుడు కోట శ్రీనివాసరావుకు పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. నాలుగు దశాబ్దాలపాటు సినీ, నాటక రంగాలకు ఆయన చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు. ఆయన మృతి తెలుగు సినీ రంగానికి తీరని లోటని పేర్కొన్నారు. ఆయన కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
విలక్షణ నటనతో ప్రేక్షకులను అలరించారు: రేవంత్‌రెడ్డి
కోట శ్రీనివాసరావు మృతి చిత్ర పరిశ్రమకు తీరని లోటని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విచారం వ్యక్తంచేశారు. ఆయన తన విలక్షణ నటనతో ప్రేక్షకులను అలరించారని తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
కోట సినీ ప్రస్థానం స్ఫూర్తిదాయకం: తనికెళ్ల భరణి
కోట శ్రీనివాసరావుతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్న ప్రముఖ నటుడు తనికెళ్ల భరణి.. ఆయన మృతితో సినీ పరిశ్రమ ‘కోట’ కూలిపోయిందని పేర్కొన్నారు. సామాన్య మధ్యతరగతి కుటుంబంలో పుట్టి అంచెలంచెలుగా ఎదిగిన ఆయన సినీ ప్రస్థానం ఎంతో స్ఫూర్తిదాయకమని కొనియాడారు. నాటకాలపై ఉండే ఎనలేని ఆసక్తే ఆయన సినీ రంగ ప్రవేశానికి దారులు వేసిందన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబ సభ్యులకు మనో ధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుడిని కోరారు.
నమ్మలేకపోతున్నా: బ్రహ్మానందం
కోట శ్రీనివాసరావు లేరన్న విషయాన్ని నమ్మలేకపోతున్నానని సీనియర్ నటుడు బ్రహ్మానందం అన్నారు. నటన ఉన్నంతకాలం ఆయన ఉంటారని పేర్కొన్నారు. ఏ విషయాన్ని అయినా నిర్మొహమాటంగా మాట్లాడే వ్యక్తి అని కొనియాడారు. నాలుగు దశాబ్దాలపాటు తాము కలిసి పనిచేశామని బ్రహ్మానందం గుర్తుచేసుకున్నారు. కోట శ్రీనివాసరావును చూస్తూ, ఆయనను ఆరాధిస్తూ, ఆయన నుంచి నేర్చుకుంటూ పెరిగానని ప్రముఖ నటుడు రవితేజ అన్నారు. ఆయనతో కలిసి పనిచేసిన క్షణాలు తనకు మధుర జ్ఞాపకాలన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
‘కోట’ మృతికి పవన్ కల్యాణ్ సంతాపం
ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు మృతికి ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సంతాపం తెలియజేశారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా సంతాప సందేశాన్ని విడుదల చేశారు. ప్రముఖ సీనియర్ సినీ నటులు, మాజీ ఎమ్మెల్యే, పద్మశ్రీ కోట శ్రీనివాసరావు మరణ వార్త తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని ఆయన పేర్కొన్నారు. దాదాపు అనేక భారతీయ భాషల్లో 700 చిత్రాలకు పైగా విభిన్న పాత్రల్లో నటించిన బహుముఖ ప్రజ్ఞాశాలి ‘కోట’ ఇకలేరు అనే వార్త సినీరంగానికి తీరని లోటని అన్నారు.
ముఖ్యంగా అన్నయ్య చిరంజీవితో కలిసి ‘ప్రాణం ఖరీదు’ సినిమాతో ఒకేసారి సినీ ప్రయాణం మొదలుపెట్టారని తెలిపారు. ఆయనతో కలిసి అర డజనుకు పైగా చిత్రాలలో నటించడం ఎప్పటికీ ఒక మధుర జ్ఞాపకంగా నిలిచిపోతుందని పేర్కొన్నారు. ఆయన పవిత్రాత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
కోట శ్రీనివాసరావు మృతి చిత్ర పరిశ్రమకు తీరని లోటు: వైఎస్ జగన్
ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు ఈ ఉదయం కన్నుమూశారు. ఆయన మృతికి సినీ, రాజకీయ ప్రముఖుల నుంచి సంతాపాలు వెల్లువెత్తుతున్నాయి. ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ‘ఎక్స్’ వేదికగా కోట మృతికి సంతాపం తెలిపారు. ఆయన మరణం తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటని అన్నారు. కోట మృతి పట్ల ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
కోట శ్రీనివాసరావు మృతికి ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ సంతాపం
విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు ఈ ఉదయం కన్నుమూశారు. కోట శ్రీనివాసరావు మృతిపై ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ సంతాపం తెలిపారు. ఎక్స్ వేదికగా తమ సంతాపాన్ని తెలియజేశారు.
తెలుగు ప్రేక్షకుల గుండెల్లో కోటకు ప్రత్యేకస్థానం.. నారా లోకేశ్
నాలుగు దశాబ్దాల సినీ ప్రయాణంలో ఎన్నో విలక్షణ పాత్రలు పోషించిన కోట శ్రీనివాసరావు తెలుగు ప్రేక్షకుల గుండెల్లో తనకంటూ ప్రత్యేకస్థానం సంపాదించుకున్నారని నారా లోకేశ్ పేర్కొన్నారు. తన విలక్షణ నటనతో ఎన్నో పాత్రలకు జీవం పోశారని, ఇతర భాషల్లోనూ నటించి మెప్పించిన ఘనత ఆయనకే దక్కుతుందని కొనియాడారు. 1999లో విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయన ప్రజాసేవతోనూ మంచి నాయకుడిగా పేరు సంపాదించుకున్నారని అన్నారు. ఆయన మరణం తెలుగు సినీ రంగానికి తీరని లోటన్నారు. వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని లోకేశ్ పేర్కొన్నారు.
చిరంజీవి : ‘‘లెజెండరీ యాక్టర్, బహుముఖ ప్రజ్ఞాశాలి కోట శ్రీనివాసరావు ఇక లేరనే వార్త ఎంతో కలచివేసింది. ‘ప్రాణం ఖరీదు’ తో ఆయన నేనూ ఒకేసారి సినిమా కెరీర్ ప్రారంభించాం. ఆ తర్వాత వందల కొద్దీ సినిమాల్లో ఎన్నెన్నో విభిన్నమైన పాత్రల్లో నటించి, ప్రతి పాత్రని తన విలక్షణ, ప్రత్యేక శైలితో అలరించి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చిర స్థాయిగా నిలిచిపోయారు. కామెడీ, విలన్, సపోర్టింగ్ క్యారక్టర్ ఇలా ఏ పాత్ర అయినా తను మాత్రమే చేయగలడన్న గొప్పగా నటించారు. ఇటీవల ఆయన కుటుంబంలో జరిగిన వ్యక్తిగత విషాదం ఆయన్ని మరింత మానసికంగా కుంగదీసింది. కోట శ్రీనివాసరావులాంటి నటుడు లేని లోటు చిత్ర పరిశ్రమకి, సినీ ప్రేమికులకి ఎన్నటికీ తీరనిది. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా’’అని అన్నారు.
నందమూరి బాలకృష్ణ : ప్రముఖ సినీ నటులు, పద్మశ్రీ కోట శ్రీనివాసరావు గారి మృతి పట్ల సంతాపం తెలియజేస్తున్నాను. నాలుగు దశాబ్దాల సినీ ప్రయాణంలో ఎన్నో విలక్షణ పాత్రలు పోషించిన కోట శ్రీనివాసరావు గారు తెలుగు ప్రేక్షకుల గుండెల్లో తనకంటూ ప్రత్యేకస్థానం సంపాదించుకున్నారు. తన విలక్షణ నటనతో ఎన్నో పాత్రలకు జీవం పోశారు. ఆయన మరణం తెలుగు సినీ రంగానికి తీరనిలోటు. వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. కోట శ్రీనివాసరావు గారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.
బాబూ మోహన్ భావోద్వేగం : ప్రముఖ నటుడు కోట అకాల మరణ వార్త విన్న బాబూ మోహన్ భావోద్వేగానికి గురయ్యారు. ”కోట శ్రీనివాసరావు మరణం బాధాకరం. నిన్న రాత్రి కూడా కోటతో మాట్లాడాను. కోట మరణ వార్త నన్ను దిగ్భ్రాంతికి గురిచేసింది” అని బాబూమోహన్ ఏడుస్తూ చెప్పుకొచ్చాడు.
బ్రహ్మానందం : కోట మహా నటుడు. రోజుకు 18 గంటలు పని చేసే వాళ్ళం. అరే ఒరే అని పిలుచుకునే వాళ్ళం. కోట లేరంటే నమ్మలేకుండా ఉన్న. నటన ఉన్నత కాలం కోట ఉంటారు
రవితేజ : ఆయనను చూస్తూ, ఆయన ప్రతి పాత్ర నుండి ఎంతో నేర్చుకుంటూ పెరిగాను. కోట బాబారు నాకు కుటుంబం లాంటివాడు, ఆయనతో కలిసి పనిచేసిన మధురమైన జ్ఞాపకాలను ఎప్పటికీ ఓ జ్ఞాపకంగా నాతోనే ఉంటాయి. ఓం శాంతి.
వెంకయ్యనాయడు : ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు మరణం చాలా బాధాకరమని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. కోట భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. ‘‘ఆయన విలక్షణ నటుడు, మానవతావాది. వందలాది సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు. శాసనసభ్యుడిగా ఎన్నికై ప్రజలకు సేవ చేశారు. కుమారుడి అకాల మరణంతో కోట బాగా కుంగిపోయారు. మంచి సంస్కారం కలిగిన నటుడిని కోల్పోయాం. కోట శ్రీనివాసరావు ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నా’’ అని వెంకయ్యనాయుడు తెలిపారు.
కేసీఆర్, కేటీఆర్ సంతాపం : కోట శ్రీనివాసరావు మృతి పట్ల బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ మాజీ మంత్రి కేటీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. విభిన్న పాత్రలను పోషించి, ప్రేక్షక హృదయాల్లో తన స్థానాన్ని పదిలపరుచుకున్న విలక్షణ వెండితెర నటుడు కోట శ్రీనివాసరావు అని కేసీఆర్ అన్నారు. ఆయన మరణంతో సినీమా రంగం ఒక గొప్ప నటున్ని కోల్పోయిందని కేసీఆర్ విచారం వ్యక్తం చేశారు. కోట శ్రీనివాసరావు పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కేసీఆర్ ప్రార్థించారు. శోకతప్తులైన వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.