- Advertisement -
- – రామాయంపేటలో కుక్కల నియంత్రణకు చర్యలు
- నవతెలంగాణ-రామాయంపేట
- రామాయంపేట పట్టణ ప్రజలను చాలా కాలంగా పట్టిపీడిస్తున్న వీధి కుక్కల బెడదకు ఎట్టకేలకు మున్సిపల్ అధికారులు చర్యలకు పూనుకున్నారు. “నవతెలంగాణ” పత్రికలో “బాబాయ్ కుక్కలు” శీర్షికన ప్రచురితమైన కథనం, అలాగే దుర్గమ్మబస్తి వాసులు మున్సిపల్ కార్యాలయంలో చేసిన ఫిర్యాదులకు మున్సిపల్ యంత్రాంగం స్పందించింది. మున్సిపల్ కమిషనర్ దేవేందర్ ఆదేశాల మేరకు, పట్టణంలో కుక్కలను పట్టుకునే బృందం మంగళవారం తమ కార్యకలాపాలను ప్రారంభించింది.
- కుక్కలు పట్టేందుకు ఆంధ్ర నుండి ప్రత్యేక బృందం
- పట్టణంలో కుక్కల సంఖ్య విపరీతంగా పెరిగిపోవడం, అవి ప్రజలపై దాడి చేయడం, రాత్రి సమయాల్లో భయంకరంగా అరుస్తూ నిద్రకు దూరం చేయడం వంటి ఫిర్యాదులు పెద్ద ఎత్తున వెల్లువెత్తాయి. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, మహిళలు వీధి కుక్కల కారణంగా బయటకు వెళ్లాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. ఇప్పటికే పలుమార్లు మహిళలపై కుక్కలు దాడి చేశాయి. ఈ సమస్య తీవ్రతపై నవ తెలంగాణలో వచ్చిన కథనంతో పాటు, స్థానికంగా వచ్చిన పిర్యాదుల మేరకు, మున్సిపల్ కమిషనర్ దేవేందర్, చర్యలు చేపట్టాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో, కుక్కలను పట్టుకోవడంలో ప్రత్యేక నైపుణ్యం కలిగిన బృందాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రాంతం నుండి రప్పించారు.
- విస్తృత ఆపరేషన్, సురక్షిత తరలింపు
- మంగళవారం ఉదయం నుండే ఈ ప్రత్యేక బృందం తమ కార్యకలాపాలను ప్రారంభించింది. పట్టణంలోని ప్రధాన వీధులైన దుర్గమ్మబస్తి, అంబేద్కర్ నగర్, అక్కల బస్తీ, బస్టాండ్ ఏరియా, మెయిన్ రోడ్ తో సహా పలు నివాసిత ప్రాంతాల్లో పర్యటిస్తూ కుక్కలను పట్టుకుంది. పగటిపూట నివాసాల మధ్య, చెత్తకుప్పల వద్ద గుంపులుగా తిరుగుతున్న కుక్కలను గుర్తించి, వాటిని సురక్షితంగా పట్టుకుని ప్రత్యేక వాహనాల్లో తరలించనున్నారు. పట్టుకున్న కుక్కలను పట్టణానికి దూరంగా ఉన్న అటవీ ప్రాంతంలో వదిలివేస్తామని, తద్వారా తిరిగి పట్టణంలోకి ప్రవేశించే అవకాశం ఉండదని మున్సిపల్ అధికారులు స్పష్టం చేశారు. ఈ చర్యతో రామాయంపేట ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా చిన్నారులు పాఠశాలలకు వెళ్లే సమయంలో, పెద్దలు ఉదయం నడకకు వెళ్లే సమయంలో, ఉదయం పూట వాకిళ్ళు ఊడ్చే మహిళలకు కుక్కల భయం నుండి విముక్తి లభించనుందని స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -