Wednesday, July 16, 2025
E-PAPER
Homeతాజా వార్తలుఏసీబీ అదుపులో నీటి పారుదల శాఖ మాజీ ఈఎన్‌సీ మురళీధర్ రావు

ఏసీబీ అదుపులో నీటి పారుదల శాఖ మాజీ ఈఎన్‌సీ మురళీధర్ రావు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణ నీటి పారుదల శాఖ ఇంజినీరింగ్ ఇన్ చీఫ్ (ఈఎన్‌సీ)గా బాధ్యతలు నిర్వహించిన విశ్రాంత ఇంజినీరింగ్ అధికారి మురళీధర్‌రావును ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఆయనపై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలోనే హైదరాబాద్, కరీంనగర్, జహీరాబాద్‌తో పాటు మురళీధర్‌ రావు బంధువులు, సన్నిహితుల నివాసాల్లో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మురళీధర్‌ రావు ఇరిగేషన్ శాఖలో చక్రం తిప్పి పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఉన్నాయి.

కాళేశ్వరం, మేడిగడ్డ అవినీతి, అవకతవకల్లో కూడా మురళీధర్‌ రావుది కీలక పాత్ర అని ప్రస్తుత ప్రభుత్వం అనుమానిస్తోంది. ఇరిగేషన్ శాఖలో అవినీతిపై ఇప్పటికే విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్ అనేక మందిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే. విజిలెన్స్ శాఖ క్రిమినల్ చర్యలకు సిఫార్సు చేసిన 17 మందిలో మురళీధర్ రావు కూడా ఉన్నారు. కాళేశ్వరం, మేడిగడ్డ అవినీతి అక్రమాలపై విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ముందు మురళీధర్ రావు ఇంతకు ముందు విచారణకు హాజరయ్యారు. వాస్తవానికి ఈఎన్‌సీ జనరల్‌గా కీలకంగా వ్యవహరించిన మురళీధర్ రావు ఉమ్మడి రాష్ట్రంలోనే పదవీ విరమణ పొందారు. ఆ తర్వాత మురళీధర్ రావు పదవీ కాలాన్ని 13 ఏళ్ల పాటు పొడిగించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఆయన కొన్నాళ్లు పదవిలో ఉన్నారు. మేడిగడ్డపై విజిలెన్స్ నివేదిక వచ్చిన తర్వాత మురళీధర్ రావును రేవంత్ సర్కార్ తొలగించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -