Saturday, July 19, 2025
E-PAPER
Homeజాతీయంఅమరావతిలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామిక వేత్తలు ముందుకు రావాలి

అమరావతిలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామిక వేత్తలు ముందుకు రావాలి

- Advertisement -

జనాభా పెంచేందుకు ప్రోత్సాహకాలు : సీఐఐ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు
సీఎం చంద్రబాబుకు నివేదిక అందజేసిన టాస్కోఫోర్స్‌
‘స్వర్ణ ఆంధ్రప్రదేశ్‌ ఏ2047’ నివేదిక విడుదల
న్యూఢిల్లీ
: 2047 స్వర్ణాంధ్ర లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్‌. చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రాష్ట్రం స్వర్ణాంధ్ర సాధన దిశగా చేపట్టాల్సిన కార్యాచరణపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన టాటా సంస్థల చైర్మెన్‌ చంద్రశేఖరన్‌ నేతృత్వంలో టాస్కోఫోర్స్‌ తన నివేదికను బుధవారం నాడిక్కడ హౌటల్‌ తాజ్‌ మహల్‌లో జరిగిన సీఐఐ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు అందజేసింది. ఆర్థికాభివృద్ధి, పారిశ్రామిక అభివృద్ధిపై టాస్కోఫోర్స్‌ నివేదిక రూపొందించింది. టాస్క్‌ఫోర్స్‌ అందజేసిన ‘స్వర్ణ ఆంధ్రప్రదేశ్‌ ఏ2047’ నివేదిక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2047 నాటికి దేశం లోనే అంతర్జాతీయ ప్రమాణాలతో అత్యుత్తమ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ అవతరిస్తుందని అన్నారు. దేశానికి ఇప్పుడున్న అద్భుతమైన అవకాశం మోడీ నాయకత్వమని, అతి త్వరలోనే దేశం మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతుందని పేర్కొన్నారు. సంపదను సృష్టించడంలో అనేక దేశాలతో పోలిస్తే భారత్‌ చాలా ముందంజలో ఉందని అన్నారు. అమెరికాకు సిలికాన్‌ వ్యాలీ ఉంటే, ఇండియాకు అమరావతి క్వాంటం వ్యాలి కాబోతోందని అన్నారు. దీన్ని 2026 జనవరి ప్రారంభిస్తామని వెల్లడించారు. అత్యంత ప్రతిభ ఉన్న నైపుణ్యం ఉన్న మానవ వనరులు ఎపిలో ఉన్నాయని, జనాభాను పెంచేందుకు ప్రోత్సాహకాలు ఇవ్వబోతున్నామని తెలిపారు. అమరావతిలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. టాటా సంస్థ చైర్మన్‌ చంద్రశేఖరన్‌ మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడుతో 25 ఏండ్ల నుంచి పని చేస్తున్నానని, ఆయన దూరదృష్టి ఉన్న నాయకుడని పేర్కొన్నారు. ఏపీ ప్రస్తుతం ఉన్న జీడీపీతో పోలిస్తే రాష్ట్రాన్ని 15 శాతం వృద్ధి సాధించే దిశగా అడుగులు వేస్తున్నారని అన్నారు. ఏపీలో విస్తృతమైన వనరులు ఉన్నాయని, ప్రపంచంలో ప్రతి చోటా తెలుగు ఐటీ నిపుణులు ఉన్నారని పేర్కొన్నారు. నిపుణులకి కొదవ లేదని, వారిని ఉపయోగించు కోవడానికి అవసరమైన మౌళిక సదుపాయాలు కల్పించాలని సూచించారు. పర్యాటకం సహా అనేక రంగాల్లో ఏపీలో విస్తృత అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. వ్యవసాయం, ఆహార, గనులు సహా అనేక రంగాల్లో అపారమైన అవకాశం ఉందన్నారు. ఏపీలో నైపుణ్యమున్న మానవ వనరులకు కొదవ లేదని, కొత్త పరిశ్రమలు స్థాపనకు ఉపాధి అవకాశాలకు ఏపీలో అనేక అవకాశాలు ఉన్నాయని అన్నారు. ప్రపంచంలోనే అత్యుత్తమ నగరంగా అమరావతిని నిర్మించబోతున్నారని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -