నవతెలంగాణ-హైదరాబాద్ : అమెరికాలోని మిచిగన్ రాష్ట్రంలో ఓ మహిళా ఉద్యోగి తన మేనేజర్‌పై కత్తితో 15సార్లు దాడి చేసి హత్య చేసిన ఘటన కలకలం రేపుతోంది. ఉద్యోగస్థలంలో ఒత్తిడి, మానసిక వేధింపులు ఎంత ప్రమాదకరంగా మారుతాయన్నదానికి ఇది ఉదాహరణగా మారింది.
26 ఏళ్ల మహిళా ఉద్యోగి అఫెని ముహమ్మద్ మెక్‌డొనాల్డ్స్ ఔట్‌లెట్‌లో పని చేస్తోంది. అదే సంస్థలో మేనేజర్‌గా పనిచేస్తున్న జెన్నిఫర్ హ్యారిస్ (39) తరచూ ఆమెను పని సరిగ్గా చేయడం లేదంటూ విమర్శిస్తూ, ఇంటికి పంపించేవారు. దీనిని మానసిక వేధింపుగా భావించిన అఫెని, మేనేజర్‌పై ఆగ్రహంతో నిండిపోయింది.
ఘటనకు ముందు రోజే అఫెని తన ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్ ఖాతాల్లో “నా మేనేజర్ నన్ను ఎంతగా అవమానిస్తుందో మీకు తెలుసా… ఇక తట్టుకోలేను” అంటూ కొన్ని స్టోరీలు పోస్టు చేసింది. మళ్లీ జూలై 12న ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగి, మేనేజర్ మళ్లీ ఆమెను ఇంటికి పంపించడంతో ఆమె ఆగ్రహంతో ఊగిపోయింది.
ఆ సమయంలో అఫెని తన కారు వద్దకు వెళ్లి అందులో ఉన్న కత్తిని తీసుకుని వచ్చి, మేనేజర్ జెన్నిఫర్‌పై 15సార్లు కత్తితో దాడి చేసింది. దాంతో మేనేజర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ దృశ్యం చూసిన ఇంకొక ఉద్యోగి వారిద్దరిని విడదీయడానికి వచ్చినప్పటికీ అప్పటికే జెన్నిఫర్ మరణించారు. అనంతరం అఫెని పారిపోవడానికి ప్రయత్నించినా, అక్కడే ఉన్న సిబ్బంది ఆమెను అడ్డుకుని పోలీసులకు అప్పగించారు.
జెన్నిఫర్ తరఫు న్యాయవాది ఈ దాడిని ముందే ప్రణాళిక ప్రకారం చేసిందని, ఇది సాధారణ కోపంతో చేసిన చర్య కాదని కోర్టులో వాదిస్తున్నారు. ప్రస్తుతం అఫెని ముహమ్మద్ కస్టడీలో ఉంది. ఆమెపై హత్యారోపణలు నమోదయ్యాయి.