నవతెలంగాణ-హైదరాబాద్: అమర్‌నాథ్ యాత్రకు వెళుతున్న ఒక మహిళ జమ్మూ కాశ్మీర్‌లో కొండచరియలు విరిగిపడి మరణించింది. రాజస్థాన్‌కు చెందిన సోనా భాయ్ గా గుర్తించారు. ఈ ప్రమాదంలో ముగ్గురు గాయపడ్డగా, కొందరు కొట్టుకుపోయి గల్లంతైనట్లు కూడా నివేదికలు ఉన్నాయి. గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పహల్గామ్ మరియు బాల్తాల్ బేస్ క్యాంపుల నుండి అమర్‌నాథ్ యాత్రను 24 గంటల పాటు నిలిపివేసినట్లు జమ్మూ కాశ్మీర్ సమాచార శాఖ తెలియజేసింది.
“గత రెండు రోజులుగా నిరంతరం భారీ వర్షాలు కురుస్తున్నందున, రెండు మార్గాల్లోని ట్రాక్‌లపై పునరుద్ధరణ పనులు చేయాల్సి వచ్చింది. యాత్ర రెండు బేస్ క్యాంపుల నుండి శుక్రవారం బయలుదేరే ముందు పనిని పూర్తి చేయడమే లక్ష్యం. దీని కోసం బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (బ్రో) తన సిబ్బందిని, యంత్రాలను ట్రాక్‌లపై పెద్ద సంఖ్యలో మోహరించింది” అని జమ్మూ కాశ్మీర్ ప్రజా సంబంధాల విభాగం ఒక ప్రకటనలో తెలిపింది. కాశ్మీర్ డివిజనల్ కమిషనర్ విజయ్ కుమార్ బిధురి కూడా యాత్రను తాత్కాలికంగా నిలిపివేసినట్లు ధృవీకరించారు. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉంటే జూలై 18న యాత్ర తిరిగి ప్రారంభమవుతుందని ఆయన అన్నారు.