రాయ్‌పూర్ : అసెంబ్లీ సమావేశాల మొదటి రోజునే ఛత్తీస్‌గఢ్ స్పీకర్ 30మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు వేశారు. అసెంబ్లీ ప్రతిపక్ష నేత చరణ్‌దాస్ మహంత్, మాజీ సిఎం భూపేశ్ బఘేల్ సహా 30మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఒకరోజు పాటు సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ రమణ్‌సింగ్ గురువారం ప్రక టించారు. వారిని సభ నుండి బయటకు వెళ్లాలని ఆదేశించారు. ఛత్తీస్‌గఢ్ వర్షాకాల సమావేశాలు జులై 17 నుండి ప్రారంభమయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం డైఅమ్మోనియం ఫాస్పేట్ (డిఎపి) ఎరువులను తగినంతగా సరఫరా చేయడంలో విఫలమయ్యారని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆందోళన చేపట్టారు. చర్చ సమయంలో స్పీకర్ సభను రెండు సార్లు వాయిదా వేశారు. ప్రశ్నోత్తరాల సమయంలో ఈ అంశాన్ని లేవనెత్తుతూ .. కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే ఉమేష్ పటేల్ రాష్ట్రంలో డిఎపి డిమాండ్, సరఫరా గురించి ప్రశ్నించారు. ఎరువుల కొరత ఉందా అని అడిగారు. ఈ ప్రశ్నకు రాష్ట్రవ్యవసాయ శాఖ మంత్రి రాంవిచార్ నేతమ్ సమాధానమిస్తూ.. 2025 ఖరీఫ్ పంట సీజన్‌లో కేంద్రం రాష్ట్రం కోసం 3,10,000 మెట్రిక్ టన్నుల డిఎపిని కేటాయించిందని అన్నారు. కేంద్ర రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ ఏప్రిల్ నుండి జూన్ వరకు 2,19,100 మెట్రిక్ టన్నుల సరఫరా చేయాలని ప్రణాళికను జారీ చేసిందని, దీనికి వ్యతిరేకంగా జూన్ 30 వరకు 1,08,155 టన్నుల సరఫరా జరిగిందని అన్నారు. గత సీజన్ (2024-25 రబీ)పొదుపు స్టాక్ 40,746 మెట్రిక్ టన్నులతో సహా మొత్తం 1,48,900 మెట్రిక్ టన్నులు నిల్వ చేయబడిందని అన్నారు. దీంతో ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో జూన్ 30 వరకు జారీ చేసిన సరఫరా ప్రణాళికకు వ్యతిరేకంగా డిఎపి సరఫరాలో కొతర ఏర్పడిందని అన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని రైతుల కోసం ప్రత్యామ్నాయ ఫాస్ఫేటిక్ ఎరువులను నిల్వ చేస్తున్నామని, వారిని వినియోగించాలని ప్రోత్సహిస్తున్నామని మంత్రి తెలిపారు. అయితే మొత్తం డిమాండ్‌లో ఇప్పటివరకు 50శాతం కూడా సరఫరా కాలేదని పటేల్ మండపడ్డారు. సహకార సంఘాలకు, ప్రైవేట్ రంగానికి కేటాయించిన డిఎపి వివరాల గురించి ప్ర శ్నించారు. జులై 20 వరకు మొత్తం 18,885 మెట్రిక్ టన్నుల ఎరువులు తిరిగి రాష్ట్రానికి సరఫరా అవుతాయని, గురువారం దానిలో 718 మెట్రిక్ టన్నులు (కాంగ్రెస్ ఎమ్మెల్యే పటేల్ నియోజకవర్గం ) కర్సియా చేరుకుంటాయని అన్నారు. మొత్తం డిఎపిలో 64శాతం సహకార రంగానికి, మిగిలిన 36శాతం ప్రైవేట్ రంగానికి ఇచ్చామని అన్నారు.
రాష్ట్రంలో డిఎపి కొరత ఉందనేది నిజమేనని, ప్రపంచవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొందని అన్నారు. దీని దృష్ట్యా నానో డిఎపి ఎరువులను ప్రోత్సహిస్తున్నామని అన్నారు. అయితే ఎరువులు ప్రైవేట్ రంగంలో అందుబాటులో ఉన్నాయని, సహకార సంఘాల్లో కొరతను ఆసరాగా చేసుకుని దుకాణాదారులు బ్లాక్ మార్కెటింగ్ చేసి అధిక ధరలకు విక్రయిస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి సమాధానంతో అసంతృప్తి చెందిన ప్రతిపక్ష కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సభలో నినాదాలు చేపట్టారు. వెల్‌లోకి దూసుకువెళ్లారు. దీంతో స్పీకర్ 30మంది ఎమ్మెల్యేలపై ఒక రోజు పాటు సస్పెన్షన్ విధించారు. 90మంది సభ్యులు గల ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీలో కాంగ్రెస్ సభ్యుల బలం 35గా ఉంది.
సమావేశాల మొదటి రోజే 30 కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు
- Advertisement -
- Advertisement -