హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌కు నీటివిడుదలలో ఏపీ సీిఎం ప్రకటన
కేంద్రం ఇచ్చినప్పుడే ‘అన్నదాతా సుఖీభవ’
లోకేష్ ‘సీమ డిక్లరేషన్’ను అమలు చేస్తాం
ఆగస్టు 20లోగా మెగా డిఎస్‌సి నియామకాలు
కర్నూలు : హంద్రీనీవా నీటిని వచ్చే ఏడాది చిత్తూరుకు అందిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించారు. గురువారం ఆయన నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలం మల్యాల ఎత్తిపోతల పథకం నుండి హంద్రీనీవా ప్రధాన కాలువకు సాగు నీటిని విడుదల చేశారు. తొలుత ఢిల్లీ నుండి విమానంలో ఓర్వకల్లు విమానాశ్రయానికి చేరుకున్న ముఖ్యమంత్రి… అక్కడి నుండి హెలికాప్టర్‌లో అల్లూరు హెలిప్యాడ్ వద్దకు చేరుకున్నారు. అనంతరం మల్యాల లిఫ్ట్ ఇరిగేషన్ వద్దకు వెళ్లి జలహారతి ఇచ్చి మూడు పంపుల ద్వారా హంద్రీనీవా ప్రధాన కాలువకు నీటిని విడుదల చేశారు. అనంతరం జరిగిన సభలో మాట్లాడుతూ అడవిపల్లి రిజర్వాయర్‌ను సాధ్యమైనంత త్వరగా పూర్తిచేసి చిత్తూరుకు నీటిని తరలిస్తామని చెప్పారు. హంద్రీనీవా కాలువ వెడల్పు చేయకపోతే చివరి ఆయకట్టు వరకూ నీళ్లు వెళ్లవని, అందుకే విస్తరణ పనులు చేపట్టామని తెలిపారు. సామర్థ్యాన్ని రెట్టింపు చేశామని, ఆరు లక్షల ఎకరాలకు, 33 లక్షల మంది రైతులకు నీరిచ్చే సౌకర్యం కల్పించామని వివరించారు. ఎనిమిది నెలల్లో గొల్లపల్లి రిజర్వాయర్ పూర్తి చేసి కియా పరిశ్రమను తీసుకొచ్చామన్నారు. అన్నదాతా సుఖీభవ పథకంపై మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నిదులు జమ చేసిన వెంటనే రైతుల ఖాతాల్లో డబ్బులు వేస్తామని చెప్పారు. యువగళం పాదయాత్రలో లోకేష్ ప్రకటించిన రాయలసీమ డిక్లరేషన్‌ను అమలు చేస్తామన్నారు. ఆ డిక్లరేషన్‌లో భాగంగా లోకేష్ చేసిన హామీలన్నింటిని అమలు చేస్తామన్నారు. ఆగస్టు 20లోపు మెగా డిఎస్‌సి టీచర్ల నియామకాలు పూర్తి చేస్తామని తెలిపారు. శ్రీశైలం ఫ్లంజ్ పూల్‌ను రాష్ట్ర ప్రభుత్వమే రిపేరు చేస్తుందని ఢిల్లీ సమావేశంలో చెప్పినట్లు తెలిపారు. 2014-19 మధ్య టిడిపి హయాంలో రాయలసీమ ప్రాజెక్టులకు రూ.12,500 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. ఆ తర్వాత వచ్చిన వైసిపి ప్రభుత్వం రూ.2 వేల కోట్లు కూడా ఖర్చు పెట్టలేదన్నారు. 2018లో హంద్రీనీవా వెడల్పునకు టెండర్లు పిలిచామని, ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం పట్టించుకోలేదని తెలిపారు. నదుల అనుసంధానం తన జీవిత ఆశయమన్నారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి నదులను అనుసంధానం చేస్తే రాష్ట్రంలో కరువు అనే మాట రాదని పేర్కొన్నారు. పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు 120 టిఎంసిల నీళ్లు ఇచ్చామని తెలిపారు. వర్షాకాలం కంటే ముందే జలాశయాల్లో 50 శాతం నీళ్లు ఉండే పరిస్థితి ఏర్పడిందన్నారు. రాయలసీమను కొందరు ఓట్ల రాజకీయాలకు వాడుకున్నారని విమర్శించారు. రాయలసీమను రాష్ట్రానికి మణిహారంగా తయారు చేస్తామన్నారు. ఓర్వకల్లు డ్రోన్ సిటీలో దేశానికి కావాల్సిన డ్రోన్లను తయారు చేస్తామని తెలిపారు. హైదరాబాద్‌తో సమానంగా అమరావతిని తయారు చేసి అందరికీ గర్వకారణంగా చేస్తామన్నారు. కార్యక్రమంలో మంత్రులు నిమ్మల రామానాయుడు, పయ్యావుల కేశవ్, బిసి జనార్థన్ రెడ్డి, ఎన్‌ఎండి ఫరూక్, నంద్యాల ఎంపి డాక్టర్ బైరెడ్డి శబరి, నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్తా జయసూర్య, నంద్యాల జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి, టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి మాండ్ర శివానంద రెడ్డి తదితరులు పాల్గొన్నారు.