నవతెలంగాణ-హైదరాబాద్: అభిశంసనను ఎదుర్కోనున్న అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి యశ్వంత్ వర్మ సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. తనపై సుప్రీంకోర్టు కమిటీ ఇచ్చిన దర్యాప్తు నివేదికను సవాలు చేశారు. ఈ ఏడాది మార్చి 14న జస్టిస్ వర్మ నివాసంలో భారీ మొత్తంలో కాలిపోయిన రూ.500 నోట్ల కట్టలు కనిపించిన సంగతి తెలిసిందే.
తనను పూర్తి స్థాయిలో, పారదర్శకంగా విచారించకుండానే సుప్రీంకోర్టు మాజీ సిజెఐ సంజీవ్ ఖన్నా ఏకపక్షంగా విచారణ కమిటీని ఏర్పాటు చేశారని రిట్ పిటిషనలో పేర్కొన్నారు. ముగ్గురు సభ్యుల కమిటీ పూర్తి న్యాయమైన విచారణ జరపకుండా తనకు ప్రతికూలంగా నివేదికను ఇచ్చినట్లు తెలిపారు. నగదు రికవరీపై సమగ్ర దర్యాప్తులో కమిటీ విఫలమైందని అన్నారు. ఈ నివేదికను చెల్లనిదిగా పరిగణించాలని జస్టిస్ యశ్వంత్ వర్మ సుప్రీంకోర్టును కోరారు.
వచ్చే పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో జస్టిస్ యశ్వంత్ వర్మపై అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెడతామని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ప్రకటించారు. ఈ తీర్మానాన్ని అన్ని పార్టీలు సమిష్టిగా ప్రతిపాదించాలని ప్రభుత్వం కోరుకుంటోందని అన్నారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జులై 21 నుండి ప్రారంభం కానున్నాయి. అయితే దేశ చరిత్రలో కొద్ది మంది జడ్జీలు మాత్రమే అభిశంసనను ఎదుర్కొన్నారు. ఈ తీర్మానం ముగింపుకు ముందే చాలామంది రాజీనామా చేశారు.