– మేడిగడ్డ నుంచి రోజూ వృధాగా దిగువకు 7టీఎంసీల నీళ్లు
– కుంగిన పిల్లర్ ను మరమ్మత్తు చేయకుండా సర్కార్ కుట్రలు
– కన్నెపల్లి వద్ద ఎత్తిపోసే అవకాశం ఉన్నా ప్రభుత్వ నిర్లక్ష్యం…
– రోజుకు 20 క్యూసెక్కులు ఎత్తిపోసినా 15 రోజుల్లో మిడ్ మానేరు నిండా నీళ్లు…
– ఇప్పటికే ముదిరిపోతున్న నార్లు.. నీళ్లు అందక ఆందోళనలో రైతులు
– కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరిపై మాజీ ఎంపీ వినోద్ కుమార్ ఆవేదన
నవతెలంగాణ – కరీంనగర్ ప్రాంతీయ ప్రతినిధి
“కేసీఆర్ కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు నుంచే నీళ్లు ఎత్తకూడదన్న దుష్పరిణామకరమైన ఆలోచనతో కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ఇది పూర్తిగా రైతు వ్యతిరేకం. ప్రస్తుతం గోదావరిలో మేడిగడ్డ వద్ద 82,230 క్యూసెక్కుల నీరు ప్రవహిస్తోంది. రోజుకు 7 నుంచి 8 టీఎంసీలు వృథాగా కిందకి పోతున్నాయి. కన్నెపల్లి పంప్ హౌజ్ ద్వారా రోజుకు 20వేల క్యూసెక్కుల నీటిని ఎత్తితే 10–15 రోజుల్లో మిడ్ మానేరు నిండి, వేలాది ఎకరాలకు నీరందించవచ్చు,” అని కరీంనగర్ మాజీ ఎంపీ బి ఆర్ ఎస్ సీనియర్ నాయకులు బోయినపల్లి వినోద్ కుమార్ తెలిపారు. కరీంనగర్ జిల్లా శుక్రవారం స్థానిక ప్రతిమ హోటల్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆయన కాళేశ్వరం ప్రాజెక్టు నీటి వినియోగంపై కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా విమర్శించారు. గోదావరిలో భారీ వరద ఉన్నా కూడా మిడ్ మానేరు డ్యామ్‌ను నింపే ప్రయత్నం ప్రభుత్వం చేయకపోవడాన్ని ఆయన ఖండించారు. మేడిగడ్డ బ్యారేజీలో కుంగిన పిల్లర్‌ను ప్రభుత్వం రిపేర్ చేయకుండా పెడుతోందని, కానీ కాళేశ్వరంలో భాగంగా ఉన్న కన్నెపల్లి పంప్ హౌజ్, సుందిల్ల, అన్నారం ప్రాజెక్టుల్లో ఎటువంటి సమస్యా లేదని స్పష్టం చేశారు. “రాజకీయాలు పక్కన పెట్టాలి. ఇగోతో వ్యవహరించకండి. రైతుల భవిష్యత్‌ను దయచేసి పట్టించుకోండి. వెంటనే నీళ్లు ఎత్తండి, మిడ్ మానేరు నింపండి” అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కోరారు. ప్రస్తుతం వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో రైతులు నీటి కొరతతో అల్లాడుతున్నారని, ఇది పంటలపై తీవ్ర ప్రభావం చూపుతోందని ఆయన హెచ్చరించారు. కనీసం ఈ మీడియా సమావేశం ద్వారా అయినా ప్రభుత్వం స్పందించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. సమావేశంలో టిఆర్ఎస్ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు జివి రామకృష్ణారావు, ఆ పార్టీ నేతలు పాల్గొన్నారు.