- 500 ఎకరాల ప్రభుత్వ స్థలాలను పరిరక్షించాం
నవతెలంగాణ-హైదరాబాద్: ఏడాదిలో హైడ్రాకు ఎన్నో మంచి, చెడు అనుభవాలు ఎదురయ్యాయని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అన్నారు. ఏడాదిలో 500 ఎకరాల ప్రభుత్వ స్థలాలను పరిరక్షించామన్నారు. హైడ్రా పరిరక్షించిన స్థలాల విలువ దాదాపు రూ.30 వేల కోట్లపైనే ఉంటుందని తెలిపారు.
హైడ్రా తొలి వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని హైదరాబాద్ అంబర్‌పేటలోని బతుకమ్మకుంట వద్ద విద్యార్థులు, స్థానికులతో కలిసి పెద్దఎత్తున మానవహారం నిర్వహించారు. హైదరాబాద్ కలెక్టర్ హరిచందన, కాంగ్రెస్ నేత వి.హనుమంతరావుతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. వారందరితో నీటి వనరుల పరిరక్షణపై హైడ్రా ప్రతిజ్ఞ చేయించింది. ఈ సందర్భంగా ఆయన మీడియా మాట్లాడారు. కూల్చడమే కాదు నిర్మాణం చేయాలనేది సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్ష. రాబోయే రోజుల్లో పెద్ద సంఖ్యలో చెరువులను హైడ్రా అభివృద్ధి చేస్తుంది. చెరువులు, ప్రభుత్వ స్థలాలను ఆక్రమించాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తున్నారు.
ఒవైసీ కళాశాల విషయంలో మా నిర్ణయాన్ని స్పష్టంగా చెప్పాం. హైడ్రా ఒక సామాజిక కోణంలో పనిచేస్తుంది. ఒవైసీ కళాశాల 2015-16లో నిర్మించారు. కళాశాల ఉన్న చెరువు ప్రాంతానికి 2016లో ప్రాథమిక నోటిఫికేషన్ ఇచ్చారు. సల్కం చెరువుకు తుది నోటిఫికేషన్ ఇంకా ఇవ్వలేదు. నగరంలోని 80 శాతం చెరువులకు తుది నోటిఫికేషన్ ఇంకా జారీ చేయలేదు. 140 చెరువులకు మాత్రమే తుది నోటిఫికేషన్ ఇచ్చారు. 540 చెరువులకు పదేళ్ల కిందట ప్రాథమిక నోటిఫికేషన్ మాత్రమే ఇచ్చారు.
సుప్రీంకోర్టు ఉత్తర్వులకు అనుగుణంగానే హైడ్రా పనిచేస్తుంది. ఆక్రమణల వెనుక చాలా మంది పెద్దవాళ్లు ఉంటారు. వాళ్లు తప్పించుకోవడానికి పేదలను బుల్డోజర్ల ముందు పెడుతున్నారు. పేదవాళ్ల మీద హైడ్రా పగబట్టిందని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేయిస్తున్నారు. రూ.30-40 కోట్ల పార్క్ స్థలాన్ని ఆక్రమించే ధైర్యం పేదవాళ్లకు ఉంటుందా. హైడ్రాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మూసీకి సంబంధం లేకున్నా హైడ్రాకు ముడిపెట్టారు.