అది పార్లమెంటు సభ్యులే చేయాలి : కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్
న్యూఢిల్లీ : సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తిని తొలగించే రాజ్యాంగ అధికారం పార్లమెంటుకు ఉన్నప్పటికీ, అటువంటి తీర్మానాన్ని ప్రారంభించే ప్రక్రియ ఎంపిల చేతుల్లో ఉందని కేంద్ర న్యాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ స్పష్టం చేశారు. నగదు సంబంధిత వివాదంలో దుష్ప్రవర్తనకు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న జస్టిస్ యశ్వంత్ వర్మపై అభిశంసనకు గురయ్యే అవకాశం ఉందని చర్చ నేపథ్యంలో శుక్రవారం ఆయన స్పందించారు. అభిశంసన తీర్మానం తీసుకురావడంలో ప్రభుత్వానికి ఎటువంటి పాత్ర లేదని, అలాంటి ఏదైనా చర్యను ఎంపిలు స్వతంత్రంగా నడిపించాలని నొక్కి చెప్పారు. ”ఇది పూర్తిగా ఎంపిల విషయం. ప్రభుత్వం చేతుల్లో లేదు” అని ఆయన అన్నారు.
ఢిల్లీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి , ప్రస్తుతం అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ యశ్వంత్ వర్మ చుట్టూ వివాదం నెలకొన్న నేపథ్యంలో ఆయనను అభిశంసించేవీలుందా అని చర్చ జరుగుతున్న వేళ అర్జున్ మేఘ్వాల్ పై విధంగా స్పందించారు. కాగా రాజ్యాంగం ప్రకారం ఒక న్యాయమూర్తిని అభిశంసించే తీర్మానానికి కనీసం 100 మంది లోక్‌సభ సభ్యులు లేదా 50 మంది రాజ్యసభ సభ్యుల మద్దతు అవసరం. ఈ ప్రక్రియ పూర్తిగా చట్టబద్ధమైన ప్రక్రియ అని మేఘ్వాల్ పునరుద్ఘాటించినప్పటికీ, కొంతమంది ఎంపీలు ఈ తీర్మానాన్ని ప్రారంభించడానికి ఆసక్తి చూపారని ఆయన తెలిపారు.21న ప్రారంభమయ్యే పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఈ అంశం ఊపందుకునే అవకాశం ఉంది. కాంగ్రెస్ నాయకుడు జైరాం రమేశ్.. ఇప్పటికే తమ పార్టీ ఎంపీలు ఈ తీర్మానానికి మద్దతు ఇస్తారని ప్రకటించారు.
‘అభిశంసన’ ప్రక్రియ ప్రభుత్వం చేతుల్లో లేదు
- Advertisement -
- Advertisement -