లోక్‌సభలో ప్రవేశపెట్టనున్న కీలక బిల్లులు
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈనెల 21 నుంచి ప్రారంభంకానున్నాయి. ఆగస్టు 21తో ముగియనున్న ఈ సమావేశాల్లో లోక్‌సభలో అనేక ముఖ్యమైన బిల్లులను ప్రవేశపెట్టి ఆమోదించే అవకాశం ఉంది. జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాం ఉగ్రదాడిలో 26 మంది మృతి, ఆపరేషన్ సిందూర్ తరువాత జరుగుతున్న మొదటి సెషన్ కావటంతో ప్రాధాన్యత సంతరించుకోనున్నది.. పన్నులు, క్రీడలు, విద్య, మైనింగ్, షిప్పింగ్ వంటి రంగాలలో సవరణలు, కొత్త చట్టాల ప్రతిపాదనలను తీసుకురావడానికి మోడీ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ సమావేశంలో ఎంపీల కోసం కొత్త హాజరు వ్యవస్థను కూడా ప్రవేశపెడతారు. దీంతో వారు నిర్ణయించిన సీట్ల వద్ద డిజిటల్ పరికరంతో తమ హాజరును గుర్తించాల్సి ఉంటుంది. ఇది పారదర్శకతను పెంచడం, జీతా భత్యాల దుర్వినియోగాన్ని తగ్గించడం లక్ష్యంగా పెట్టుకున్నట్టు కేంద్రం తెలిపింది. అయితే దీనిపై సభ్యులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో కీలక బిల్లులు
1. మణిపూర్ వస్తువులు, సేవల పన్ను సవరణ బిల్లు
2. జన్ విశ్వాస్ నిబంధనల సవరణ బిల్లు
3. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ మేనేజ్‌మెంట్ సవరణ బిల్లు
4. పన్ను చట్టాల సవరణ బిల్లు
5. జియోహెరిటేజ్ సైట్స్, జియో రెలిక్స్ సంరక్షణ, నిర్వహణ బిల్లు
6. గనులు, ఖనిజాల అభివృద్ధి, నియంత్రణ సవరణ బిల్లు
7. జాతీయ క్రీడా పాలన బిల్లు
8. జాతీయ డోపింగ్ నిరోధక సవరణ బిల్లు
9. గోవా రాష్ట్ర అసెంబ్లీ నియోజకవర్గాలలో షెడ్యూల్డ్ తెగల ప్రాతినిధ్య పునర్వ్యవస్థీకరణ బిల్లు
10. మర్చంట్ షిప్పింగ్ బిల్లు
11. ఇండియన్ పోర్ట్స్ బిల్లు
12. ఆదాయపు పన్నుబిల్లు