హైకోర్టు
నవతెలంగాణ-హైదరాబాద్
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారంలోని భూదాన్ భూములకు సంబంధించి జరిగిన అక్రమాలపై విచారణ కమిషన్ ఏర్పాటు ఏమైంది? ఏర్పాటు చేస్తారా? లేదా? దానిపై ఏం నిర్ణయం తీసుకున్నారు? తదుపరి విచారణలో వివరాలు చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. నాగారంలోని సర్వే నెం.194, 195లో తండ్రి ద్వారా వచ్చిన పదెకరాలను ప్రయివేటు వ్యక్తులకు బదలాయిం చడంపై విచారణ జరిపించాలని వినతిపత్రం ఇస్తే అధికారులు చర్యలు తీసుకోలేదంటూ వి.రాములు అనే వ్యక్తి వేసిన పిటిషన్‌ను జస్టిస్ కె.లక్ష్మణ్ శుక్రవారం విచారించారు. ప్రయివేటు పార్టీలైన అబ్దుల్ జావీద్, అర్షియా సుల్తానాల సాయంతో అధికారులు పిటిషనర్ భూములను మూడో పార్టీలకు కేటాయించారన్నారు. అనంతరం వీటిని మధ్యవర్తుల సాయంతో సబ్‌డివిజన్లు చేసి ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు విక్రయించారని తెలిపారు. దీనిపై విచారణ జరిపి సహకరించిన అధికారులు, ప్రయివేటు వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ జూన్ 28న వినతి పత్రం సమర్పించినా చర్యలు తీసుకోలేదన్నారు. ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు ఈ భూములను కొనుగోలు చేసినందున విచారణ చేపట్టాలన్న వినతిని బేఖాతరు చేశారన్నారు. ప్రభుత్వ వివరణపై విచారణ ఈనెల 28న జరుపుతామని హైకోర్టు తెలిపింది.
కోర్టు ఉత్తర్వులున్నా ఎలా కూలుస్తారు?
హైడ్రా కమిషనర్, రంగారెడ్డి కలెక్టర్, జీహెచ్‌ఎంసీ అధికారులకు
హైకోర్టు నోటీసులు
కోర్టు ఉత్తర్వులున్నప్పటికీ తన ఇంటిని కూల్చేశారనే కోర్టుధిక్కరణ పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి, హైడ్రా కమిషనర్ ఎ.వి.రంగనాథ్, శేరిలింగంపల్లి జీహెచ్‌ఎంసీ డిప్యూటీ కమిషనర్ ప్రశాంతిలకు నోటీసులు జారీ చేసింది. కోర్టు ధిక్కరణకు సంబంధించి పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గుట్టల బేగంపేటలో సున్నంచెరువు ఎఫ్‌టీఎల్‌ను నిర్ధారించి చట్టప్రకారం చర్యలు తీసుకోవాలన్న హైకోర్టు ఉత్తర్వులకు విరుద్ధంగా 200 చదరపు గజాల్లోని ఇంటిని కూల్చివేయడంపై వడ్డే తార కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ కె.లక్ష్మణ్ విచారణ జరిపి ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చారు. తదుపరి విచారణను ఆగస్టు 22వ తేదీకి వాయిదా వేశారు.
సీఐపై విచారణ జరపండి : హైకోర్టు
దాంపత్య వివాదంలో కౌన్సెలింగ్ పేరుతో పిటిషనర్‌ను వేధించారనే కేసులో సిద్దిపేట-2 పోలీసులపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సీఐ ఎం.శ్రీనివాస్ తీరుపై నిష్పాక్షిక విచారణ జరపాలనీ, తప్పు చేశారని తేలితే సర్వీసు రికార్డులో నమోదు చేయాలని ఎస్పీని ఆదేశించింది. దాంపత్య వివాదంలో కౌన్సెలింగ్ పేరుతో పోలీసు స్టేషన్‌కు పిలిచి బెదిరింపులకు గురిచేయడంపై జి.సుమన్ వేసిన పిటిషన్‌లో జస్టిస్ టి.వినోద్‌కుమార్ ఈ ఉత్తర్వులను జారీ చేశారు.
శ్రీలక్ష్మి వ్యాజ్యంపై తీర్పు వాయిదా
ఓఎంసీ కేసులో నిందితురాలు, ఐఏఎస్ శ్రీలక్ష్మి దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు తీర్పు రిజర్వు చేసింది. శుక్రవారం వాదనలు పూర్తయ్యాయి. తీర్పును జస్టిస్ లక్ష్మణ్ వాయిదా వేశారు. ఆ కేసులో డిశ్ఛార్జి పిటిషన్‌ను కొట్టివేస్తూ సీబీఐ కోర్టు తీర్పు చెప్పింది. దీనిపై శ్రీలక్ష్మి రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు. ఇదే కేసులో మరో అధికారి కృపానందం, ఆనాటి మంత్రి సబితా ఇంద్రారెడ్డిలను సీబీఐ కోర్టు నిర్దోషులుగా ప్రకటించిందని ఆమె లాయర్ చెప్పారు. అంతమాత్రాన అవే ఉత్తర్వులు ఇక్కడ శ్రీలక్ష్మికి వర్తించవని సీబీఐ వాదించింది. ఇరుపక్షాల వాదనలను విన్న న్యాయమూర్తి తీర్పును వాయిదా వేశారు.
భూదాన్ భూముల అక్రమాలపై విచారణ కమిషన్ ఏమైంది?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES