Thursday, May 1, 2025
Homeఎడిట్ పేజిమేడే స్పూర్తితో పోరాడాలి - హక్కులు నిలబెట్టుకోవాలి

మేడే స్పూర్తితో పోరాడాలి – హక్కులు నిలబెట్టుకోవాలి

కార్మికవర్గానికి ‘మేడే’ పోరాట దినం సందర్భంగా శుభాకాంక్షలు.
మేడే స్పూర్తితో హక్కులు నిలబెట్టుకోవడం కోసం, అదనపు సౌకర్యాల కోసం మరింత ఉధృతంగా ఐక్య పోరా టాలు చేయడమే మన ముందున్న కర్తవ్యం. ఒక కార్మికవర్గ పార్టీగా భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) కార్మిక హక్కుల కోసం నిలబడుతుంది. భారతదేశ కార్మికులు రానున్న కాలంలో క్లిష్ట పరిస్థితులు ఎదుర్కోబోతున్నారు. కేంద్రంలోని బీజేపీ నాయకత్వంలో ప్రభుత్వం పచ్చి కార్మిక వ్యతిరేక, ఫాసిస్టు స్వభావంతో దాడి చేస్తున్నది. ఆరెస్సెస్‌ లాంటి సంస్థలు అన్ని తరగతుల ప్రజల జీవన విధానంలో జోక్యం చేసుకుంటున్నాయి. భారత రాజ్యాంగం కల్పిస్తున్న ప్రాథమిక హక్కులు, ప్రజాస్వామ్యం, లౌకకతత్వం స్పూర్తిని దెబ్బతీస్తున్నది. ప్రధానంగా రాజ్యాంగం కల్పించిన జీవించే హక్కు, పని హక్కు సమిష్టితత్వం నీరుగారుస్తున్నది. మత సామరస్యాన్ని దెబ్బతీసి కార్మికవర్గంలో చీలికలు తీసుకువచ్చి పెట్టుబడిదారులకు ప్రయోజనం కలిగిస్తున్నది.ఈ నేపథ్యంలో మేడే సందర్భంగా పలు అంశాలను పరిశీలించాలి.
‘మేడే’ అంటేనే అందరికీ గుర్తుకువచ్చేది ఎనిమిది గంటల పనిదినం కోసం జరిగిన పోరాటం. ఆనాడు 1886 మే ఒకటి నుండి నాలుగో తేదీ వరకు చికాగో నగరాన ఎనిమిది గంటల పనికోసం కార్మికులు పోరాడుతుంటే, పోలీసు కాల్పులు, బాంబుదాడులు, నాయకుల ఉరితీతలతో ఎరుపెక్కిన ఎర్రజెండా విశ్వవ్యాపితంగా ప్రతిఘటనా పోరాటాలు తీవ్రం చేసింది. ఎనిమిది గంటల పనిదినం సాధించుకున్నది. పనిగంటల తగ్గింపు కోసం చేసే పోరాటం నిజమైన వర్గ పోరాటం అని కారల్‌మార్క్స్‌ నొక్కిచెప్పారు. అందుకే పెట్టుబడిదారీ వర్గం ఆనాటి నుండి ఈనాటి వరకు పని గంటలు పెంచి కార్మికుల శ్రమను దోచుకుని లాభాలు గడించాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఉత్పత్తిలో శాస్త్ర, సాంకేతిక అభివృద్ధితో మానవ శరీరక శ్రమ తీవ్రత తగ్గిన పరిస్థితులు పని గంటలు, పనిదినాలు తగ్గాలి. అభివృద్ధి చెందిన దేశాల్లో వారానికి ఐదు రోజులు పని గంటలు, రోజుకు ఏడు గంటల పని అమలులో ఉంది. దీనికి భిన్నంగా మనదేశంలో పన్నెండు గంటల పనిదినం ఉండాలని డిమాండ్‌ ముందుకు తెస్తున్నారు. బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్‌లో పన్నెండు గంటల పనిదినం చట్టం చేసింది. మేడే స్పూర్తితో కోట్లాది కార్మికవర్గం దీన్ని తిప్పి కొట్టాలి. బీజేపీ కేంద్ర ప్రభుత్వం తెచ్చిన రైతు వ్యతిరేక విధానాలు, నల్ల చట్టాలు ఫలితంగా నేషనల్‌ క్రైం రికార్డ్‌ బ్యూరో గణాంకాల ప్రకారం 2014 నుండి 2022 వరకు 1,0,474 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. కోట్లాది ఉపాధి కూలీలకు పని కల్పించడానికి రూ.2.50లక్షల కోట్లు బడ్జెట్‌లో కేటాయించాల్సింది ఉండగా, కేవలం 86వేల కోట్లకు మాత్రమే కేటా యించి కూలీల కడుపు కొడుతున్నది. అందుకు రైతాంగం మూడు వ్యవసాయ నల్లచట్టాలకు వ్యతిరేకంగా చేసిన పోరాటం ఫలితంగా చట్టాల ఉపసంహరణ స్పూర్తిదాయకం.
ఇటీవల అనేక కార్మిక సంఘాలు ఉద్యోగ భద్రత, కనీస వేతనాలు, పనిగంటలు, తొలగింపులు, ప్రమోషన్లు, పర్మినెంట్‌ సమస్యలపై ప్రభుత్వానికి వినతిపత్రాలు అందజేశాయి. ఇవన్నీ ప్రభుత్వ విధానాలతో ముడిపడి ఉన్నాయి. దేశంలో సరళీకరణ, ప్రయివేటీకరణ విధానాల వల్ల స్వాతంత్య్రం అనంతరం సాధించుకున్న హక్కులన్నీ కాలరాయ బడుతున్నాయి. వీటి ఫలితంగా ఆర్థిక, సామాజిక అసమానతలు పెరిగాయి. ఇరవై శాతం గ్రామీణ ప్రాంత కుటుంబాల చేతుల్లో 82శాతం వ్యవసాయ భూమి ఉన్నది. 2022-23 ప్రపంచ అసమానతల నివేదిక ప్రకారం ఒక్క శాతం సంపన్నుల చేతుల్లో 40.1శాతం సంపద పోగుబడి ఉన్నది. ప్రపంచ ఆకలి సూచికలో 127 దేశాల్లో 105 స్థానానికి చేరింది. దేశ జనాభా సుమారు 146 కోట్లు. శ్రామికులు గ్రామీణ ప్రాంతాల్లో 63.7 శాతం, పట్టణ ప్రాంతాల్లో తొంభై శాతం పైగా ఉన్నది. ఇప్పటికీ దేశంలో రోజు 2.15 డాలర్లతో ఎక్కువ మంది జీవిస్తున్నారు. పేదరికం పెరిగింది. మోడీ ప్రభుత్వం రోజుకు రూ.178లు సరిపోతుందన్నారు. అక్షరాస్యత 64.8 శాతం మాత్రమే ఉంది. రాష్ట్రాల స్థాయిల్లో చాలా తేడాలు ఉన్నాయి. వంద శాతం అక్షరాస్యత సాధించింది కేరళ మాత్రమే. నిరుద్యోగం 4.8 శాతం ఉంది. ఏ పని లేనివారు దాదాపు పదికోట్ల మంది ఉన్నారు. దీని వల్ల నిరుద్యోగ కార్మికుల సంఖ్య పెరుగుతున్నది. అలాగే వివిధ సామాజిక తరగతుల్లో కార్మికులు పూర్తిస్థాయిలో ఉపాధి పొందడం లేదు. ఎస్సీల్లో అర్బన్‌ ఏరియాలో 26.9 శాతం, ఎస్టీల్లో 19.5 శాతం, బీసీల్లో 37.8శాతం మాత్రమే ఉపాధి పొందుతున్నారు. నిరుద్యోగులు కూడా ఎక్కువ సంఖ్యలో ఉన్నారు.
మరో పక్క ప్రభుత్వ విధానాల వల్ల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ చేపట్టడం లేదు. ఎస్సీ, ఎస్టీ బ్యాక్‌లాగ్‌ పోస్టులు అలాగే ఉంటున్నాయి. ప్రభుత్వ కంపెనీలను అమ్ముతున్నారు. దీని వల్ల రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లు నిరుపయోగమ వుతున్నాయి. అట్టడుగు శ్రామికుల ఉద్యోగ భద్రత, ఉపాధి దెబ్బతింటున్నది. అధికంగా వెనకబడిన అగ్రవర్ణాల పేదల్లో కూడా నిరుద్యోగ సమస్య చాలా తీవ్రంగా ఉంది. దేశంలో శ్రామికులంతా ఒక వర్గంగా సంఘటితమైతేనే సమస్యలు పరిష్కారమవుతాయి.
ఆరెస్సెస్‌ భావజాలంతో పనిచేస్తున్న బీజేపీ ప్రభుత్వం ప్రజల మధ్య చీలికలకు పాల్పడుతున్నది. హిందూ, ముస్లిం, క్రిష్టియన్‌, జైన్‌, సిక్కు మతాల మధ్య వైషమ్యాలు సృష్టిస్తున్నది. దీని వల్ల కార్మికుల్లో విభజన వచ్చి ధనంతులకే మేలు జరుగుతుంది. దీన్ని తిప్పకొట్టాలంటే కుల మతాలకతీతంగా కార్మికులు ఏకమై తమ హక్కుల కోసం పోరాడటం ఒక్కటే మార్గం. దేశంలో మొట్టమొదట ఎనిమిది గంటల పనిదినం కోసం పోరాడిన రైల్వే కార్మికులు, మొదట మేడే జరిపి ఎర్రజెండా ఎగురవేసిన మద్రాస్‌లో లేబర్‌ కిసాన్‌ పార్టీ నుండి స్పూర్తి పొందాలి.
తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రజలు, కార్మికులు అనేక కష్టాలు ఎదుర్కొంటున్నారు. రోజుకు పన్నెండు గంటలు పనిచేస్తున్నారు. జీత భత్యాలు పెంచడం లేదు. కేసీఆర్‌ ప్రభుత్వకాలంలో కార్మికుల సమస్యలు పరిష్కారం కాలేదు. ప్రస్తుతం కాంగ్రెస్‌ ప్రభుత్వం కూడా అదే బాటలో నడుస్తోంది. విదేశీ పర్యటనలు, పెట్టుబడుల ఆకర్షణ కోసం తాపత్రయ పడుతున్నది. పెట్టుబడిదారులకు పెద్దఎత్తున రాయితీలు ఇవ్వడానికి ప్రభుత్వం పోటీ పడుతున్నది. కానీ ఇక్కడి కార్మికులకు వేతనాలు పెంచడం లేదు. రాష్ట్రంలోని 1.20 కోట్ల మంది కార్మికులు తీవ్రంగా నష్టపోయారు. ప్రపంచవ్యాపితంగా కూడా కార్మికవర్గం సవాళ్లు ఎదుర్కొంటున్నది. అమెరికా సామాజ్య్రవాద దేశం తన ప్రయోజనాల కోసం యుద్ధాలు చేస్తున్నది. ఉక్రెయిన్‌-రష్యా యుద్ధం, ఇజ్రాయిల్‌-పాలస్తీనాపై యుద్ధ్దం, అనేక దేశాల్లో జోక్యం, ఆర్థిక అంతరాలు, సుంకాలు పెంపుదల పేరిట కార్మికుల ఉపాధిని దెబ్బతీస్తున్నది. ఎన్నిచేసినా పెట్టుబడిదారీ దేశాలన్నీ ఆర్థిక సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్నాయి. ఎన్ని సవాళ్లు ఎదురైనా కార్మిక హక్కులు కాపాడుతూ సోషలిస్టు ఆర్థిక వ్యవస్థలోని చైనా మరింత అభివృద్ధి సాధిస్తున్నది. వియత్నాం, ఉత్తర కొరియా, క్యూబాలు వీటిని నిలదొక్కుకుని ముం దుకు సాగుతున్నాయి. పెట్టుబడిదారీ వ్యవస్థకు సోషలిజం మాత్రమే ప్రత్యామ్నాయం. రెండో ప్రపంచ యుద్ధం తర్వాతనే సోషలిస్టు దేశాల విధానాల వల్లనే ప్రపంచంలో అన్ని దేశాల్లో ఎనిమిది గంటల పనిదినం, కార్మిక సంక్షేమం వర్ధిల్లింది. ఆనాటి కార్మిక వర్గ త్యాగాలతో ఏర్పడిన మేడే స్పూర్తితో నేడు దేశంలో కార్మికులంతా పోరాడాలి.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాల ఫలితంగా శ్రామికవర్గాలకు కనీస వేతనం, ఉపాధి పనికి నిధులు, ఉచితంగా విద్య హక్కు, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు, ఇల్లులేని ప్రతి కుటుంబానికి ఇల్లు, ధరలు పెరుగుతున్న నేపథ్యంలో రేషన్‌కార్డుకు పద్నాలుగు రకాల సరుకులు సాధించుకునేందుకు, కుల వివక్ష, మహిళలమీద దాడులు, లైంగికదాడులు, హత్యలకు వ్యతిరేకంగా, సామాజిక న్యాయం, రాజ్యాంగ హక్కులను భవిష్యత్‌లో శ్రామిక వర్గాలు ఐక్యంగా పోరాడి సాధించుకోవాలి. ఆశా, అంగన్వాడీ, మధ్యాహ్న భోజన కార్మికులు, విద్యుత్‌, మున్సిపల్‌, గ్రామ పంచాయతీ, యూనివర్సిటీ, ఐకేపీ, మెడికల్‌ తదితర రంగాల్లో పలు పోరాటాలు చేస్తున్నారు. ఆర్టీసీ, సింగరేణి సంస్థలను కాపాడుకోవడం, ఉద్యోగుల హక్కుల రక్షణ కోసం చేసే ప్రతి పోరాటం కోసం ఈ మేడేను స్పూర్తిగా తీసుకోవాలి. మే 20న దేశ వ్యాపితంగా కార్మికులు తమ హక్కులకోసం చేస్తున్న సమ్మెకు సంఘీభావంగా మే ఒకటి నుండి ఎనిమిది వరకు రాష్ట్ర వ్యాపితంగా గ్రామగ్రామాన మద్ధతుగా మేడే పోరాట స్పూర్తితో కార్యక్రమాలను నిర్వహించాలి.
జాన్‌వెస్లీ

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img