నవతెలంగాణ-హైదరాబాద్: ఇండిగో విమానం ల్యాండింగ్ విషయంలో సమస్య తలెత్తడంతో ప్రయాణీకులంతా బెంబేలెత్తిన వైనం శనివారం ఉదయం జరిగింది. ముంబయి నుంచి నాగ్‌పుర్‌కు వచ్చిన ఇండిగో విమానం, నాగ్‌పుర్ ఎయిర్‌పోర్టులో ల్యాండింగ్‌కి ప్రయత్నించే సమయంలో రన్‌వే మార్గం స్పష్టంగా కనిపించలేదు. దీంతో పైలట్ అప్రమత్తమై, విమానాన్ని తిరిగి గాల్లోకి తీసుకెళ్లారు. దాదాపు 15 నిమిషాల పాటు విమానం గాల్లోనే చక్కర్లు కొట్టింది. దీంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళన చెందారు. ఆ తరువాత పైలట్ విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేయగలిగారు.
విజిబిలిటీ తగ్గిపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని ఎయిర్‌పోర్టు అధికారులు తెలిపారు. అయినప్పటికీ, పైలట్ రెండో ప్రయత్నంలో విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేయగలిగారని అన్నారు. ఈ సంఘటన కారణంగా ఇతర విమానాల రాకపోకలపై కూడా ప్రభావం పడిందని చెప్పారు. ఇక పుణె, నాగ్‌పుర్ సహా మహారాష్ట్రలోని చాలా జిల్లాల్లో గత కొన్ని రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం …. రానున్న రోజులలో అక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది.