నవతెలంగాణ – రాజన్న సిరిసిల్ల
సిరిసిల్ల పద్మశాలి సంఘం ఎన్నికల నామినేషన్ల ఫీజు పెంపుపై సభ్యుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. కొందరు నాయకులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం సంఘం నిబంధనలకు విరుద్ధంగా ఫీజు పెంచి, సామాన్య సభ్యులు ఎన్నికల్లో నిలబడకుండా అడ్డుకుంటున్నారని ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై అభ్యంతరాలు వ్యక్తం చేసినా, ఫీజు తగ్గించేది లేదని కరాకండిగా చెప్పడం వారి అహంకార ధోరణికి నిదర్శనమని సభ్యులు పేర్కొన్నారు.
సంఘం పెద్దల ఆలోచనలు నియమావళికి విరుద్ధంగా ఉండటం, పద్మశాలి కుల ఔన్నత్యాన్ని దెబ్బతీయడం, కుల బాంధవులను అవమానించడంగా పరిగణించబడుతోందని సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో సిరిసిల్ల పట్టణంలో పద్మశాలి కుల ఔన్నత్యాన్ని, గొప్పదనాన్ని, ఐకమత్యాన్ని చాటే విధంగా మరొక సంఘాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని సభ్యులు భావించారు. దీనికి అనుగుణంగా కొత్త సంఘం ఏర్పాటు దిశగా నిర్ణయం తీసుకున్నారు.
నూతన సంఘం నిర్వహణ కోసం ఆడహాక్ కమిటీని ప్రకటించారు. ఈ కమిటీ కన్వీనర్‌గా కుసుమ విష్ణు ప్రసాద్, కో కన్వీనర్‌గా రిక్కమల్లె మనోజ్ కుమార్ వ్యవహరిస్తారు. సభ్యులుగా చిమ్మని ప్రకాష్, కొండ ప్రతాప్, గుడ్ల విష్ణు, గుజ్జే శివరామ్, ఏలూరు చంద్రకాంత్, గాజర్ల సమ్మయ్య, రాపల్లి రమేష్, తడుక భాను, వెంగళ రవి, వెంగళ వెంకటేశం, సలహాదారుగా సంగీతం సత్యసాయిరాం ఎన్నికయ్యారు.