నవతెలంగాణ-హైదరాబాద్: ఒడిశాలో లెక్చరర్ లౌంగిక వేధింపులు భరించలేక బీఈడీ చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అదే తరహాలో అధ్యాపకుల వేధింపులు తట్టుకోలేక విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన గ్రేటర్ నోయిడాలో జరిగింది. పోలీసుల కథనం మేరకు …. నోయిడాలోని శారదా విశ్వవిద్యాలయంలో ఓ విద్యార్థిని బ్యాచిలర్ ఆఫ్ డెంటల్ సర్జన్ రెండో సంవత్సరం చదువుతుంది. గత శుక్రవారం రాత్రి ఆమె క్యాంపస్‌లోని బాలికల హాస్టల్‌లో ఆత్మహత్య చేసుకోగా, తోటి విద్యార్థులు సమాచారం ఇవ్వడంతో వెంటనే సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు.
గదిలో ఒక సూసైడ్ నోట్ దొరికింది. అందులో డెంటల్ విభాగంలోని ఒక మహిళా లెక్చరర్, మరో అధ్యాపకుడు కలిసి విద్యార్థినిని మానసికంగా వేధించారని ఆమె ఆరోపించింది. వెంటనే ఆ ఇద్దరినీ పోలీసులు అరెస్టు చేశారు. దీనిపై పూర్తిస్థాయి దర్యాప్తు కొనసాగుతుంది. విద్యార్థిని ఆత్మహత్య యూనివర్సిటీలో సంచలనం రేపింది. నిందితులపై కఠినచర్యలు తీసుకోవాలంటూ … అక్కడి విద్యార్థులు ఆందోళనకు దిగారు. పోలీసులు వారికి నచ్చచెప్పి నిరసనలను విరమింపజేశారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని నోయిడా పోలీసు అధికారి ఒకరు తెలిపారు. బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడామని, నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.