Sunday, July 20, 2025
E-PAPER
Homeజాతీయంరాహుల్‌ వ్యాఖ్యలు హాస్యాస్పదం

రాహుల్‌ వ్యాఖ్యలు హాస్యాస్పదం

- Advertisement -

జాన్‌ బ్రిట్టాస్‌
న్యూఢిల్లీ
: ఆర్‌ఎస్‌ఎస్‌ను, సీపీఐ(ఎం)ను ఒకే గాటున కట్టి కాంగ్రెస్‌ నేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ గత శుక్రవారం కేరళలో చేసిన వ్యాఖ్యలపై సీపీఐ(ఎం) రాజ్యసభ ఎంపీ జాన్‌ బ్రిట్టాస్‌ తీవ్రంగా స్పందించారు. రాహుల్‌ చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదమని, అవాస్తవాలు అని ఆయన తిప్పికొట్టారు. లోక్‌సభ ప్రతిపక్షనేతగా రాహుల్‌ ఏకైక లక్ష్యం లౌకిక శక్తులను ఏకం చేసేదిగా ఉండాలే కానీ..వారిమధ్య గందరగోళం, విభజన సృష్టించేలా ఉండరాదని బ్రిట్టాస్‌ హితవు పలికారు. అయితే రాహుల్‌ వ్యాఖ్యలు పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ప్రతిపక్షాల ఐక్యతపై ప్రభావితం చేయబోవని శనివారం నాడు పీటీఐ వార్తా సంస్థ ప్రతినిధితో బ్రిట్టాస్‌ పేర్కొన్నారు. ‘కేరళకు వెళ్లినప్పుడల్లా ఇలాంటి చెత్త మాటలు మాట్లాడే ప్రవృత్తి రాహుల్‌కు ఉంది. దానికి కేరళ కాంగ్రెస్‌ పార్టీ బాధ్యత వహిస్తుందని భావిస్తున్నాం. ఆర్‌ఎస్‌ఎస్‌ను ఎదుర్కోవడానికి ఆయన కేరళను యుద్ధభూమిగా ఎంచుకున్నారు. అయితే వాస్తవానికి అక్కడ వామపక్షాలు, కాంగ్రెస్‌ మధ్యనే పోరాటం’ అని బ్రిట్టాస్‌ అన్నారు. ప్రతిపక్షనేతగా ఉన్న రాహుల్‌గాంధీ లాంటి నేతలు లౌకిక పార్టీల శ్రేణుల మధ్య గందరగోళం, విభజన సృష్టించడం కంటే లౌకిక శక్తులను ఏకం చేయడమే ఏకైక లక్ష్యంగా ఉండాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. ‘బీజేపీని అధికారం నుంచి దూరంగా ఉంచడానికి మేము 2004లో కాంగ్రెస్‌ పార్టీకి మద్దతు ఇచ్చాము. కాంగ్రెస్‌ ఊగిసలాటలు దేశానికి ఎంత భారీ నష్టాన్ని కలిగించిందో మనకు తెలుసు. రామజన్మభూమి ఉద్యమాన్ని వారు ఎలా ఎదుర్కొన్నారు? బాబ్రీ మసీదు తాళాలు ఎలా తెరిచారు? దాని కూల్చివేతకు కాంగ్రెస్‌ ఎలా అధ్యక్షత వహించిందో మనందరికీ తెలుసు. కాబట్టి లౌకిక శక్తుల మధ్య విభజనను సృష్టించే అంశాలను తీసుకురాకూడదు. ఇప్పుడు ప్రతిపక్షనేతగా రాహుల్‌గాంధీ బీజేపీపై దృష్టి కేంద్రీకరించేలా చూసుకోవాల్సిన బాధ్యత ఆయనపై ఉంది’ అని బ్రిట్టాస్‌ గుర్తు చేశారు. రాబోయే వర్షాకాల సమావేశంలో గాంధీ వ్యాఖ్యలు ప్రతిపక్షాల ఐక్యతపై ప్రభావితం చేస్తుందా అని బ్రిట్టాస్‌ని ప్రశ్నించగా.. ‘ఈ సమస్యల్ని మేము అధిగమిస్తామని విశ్వసిస్తున్నాం. కానీ రాహుల్‌ వంటి నేతలు మరింత పరిణతితో, బాధ్యతాయుతంగా ఉంటారని ఆశిస్తున్నాం. పార్లమెంటులో ప్రతిపక్షాల ఐక్యతకు మేము మద్దతిస్తాం’ అని అన్నారు. కేరళలోని కాంగ్రెస్‌ పార్టీ రాహుల్‌గాంధీని రాజకీయంగా అమాయకంగా ఉంచాలని నిశ్చయించుకున్నట్టు కనిపిస్తోందని బ్రిట్టాస్‌ ఎద్దేవా చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -