నవతెలంగాణ-హైదరాబాద్: ఇండియా కూటమి వర్చువల్ సమావేశం
నవతెలంగాణ-హైదరాబాద్: ఈనెల 21 నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభానున్నాయి. నెల రోజులపాటు సాగే వర్షకాల పార్లమెంట్ సమావేశాల్లో పలు కీలక బిల్లలు ప్రవేశపెట్టి ఆమోదించాలని మోడీ సర్కార్ సన్నాహాలు చేస్తుంది. మరోవైపు అందుకు ప్రతిపక్షం కూడా పార్లమెంట్ సమావేశాలకు సన్నద్ధమవుతుంది. ఈక్రమంలో ఇండియా కూటమి వర్చువల్ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. 24 పార్టీలు ఈ మీటింగ్‌కి హాజరయ్యాయి.
ఉభయ సభల్లో ఐక్యంగా ఉండాలని ఈ సందర్భంగా నిర్ణయించుకున్నట్టు సమాచారం. పహెల్గాం ఉగ్రదాడి , ఆపరేషన్ సిందూర్‌పై డొనాల్డ్ ట్రంప్ కాల్పుల విరమణ వ్యాఖ్యలు, బిహార్ లో ప్రస్తుతం కొనసాగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియ, డీలిమిటేషన్, జమ్మూ కశ్మీర్‌కు పూర్తి రాష్ట్ర హోదా, మహిళలపై పెరుగుతున్న అఘాయిత్యాలు, అహ్మదాబాద్ విమాన ప్రమాదం, నిరుద్యోగం, రైతుల సమస్యలు వంటి అంశాలను పార్లమెంటులో లేవనెత్తేందుకు కూటమిలోని పార్టీలు ఏకాభిప్రాయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఈ సమావేశంలో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, అగ్రనేత సోనియా గాంధీ, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ , సీపీఐఎంఎల్ ప్రధాన కార్యదర్శి దీపాంకర్ భట్టాచార్య సహా సీనియర్ నాయకులు పాల్గొన్నారు.