నవతెలంగాణ-హైదరాబాద్: అధ్యాపకుల వేధింపులు తట్టుకోలేక నోయిడాలోని శారదవ విశ్వవిద్యాలయంలో బ్యాచిలర్ ఆఫ్ డెంటల్ సర్జన్ రెండో సంవత్సరం విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. గత శుక్రవారం రాత్రి ఆమె క్యాంపస్‌లోని బాలికల హాస్టల్‌లో ఆత్మహత్య పాల్పడింది. గదిలో ఒక సూసైడ్ నోట్ దొరికింది. అందులో డెంటల్ విభాగంలోని ప్రొఫెసర్స్ డాక్టర్ శైరీ వశిష్ట్, డాక్టర్ మహీందర్ సింగ్ చౌహాన్ కలిసి విద్యార్థినిని మానసికంగా వేధించారని ఆమె ఆరోపించింది.

ఈ ఘటన తర్వాత జ్యోతి కుటుంబం, సహవిద్యార్థులు యాజమాన్యానికి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారు. ఈ సమయంలో జ్యోతి తల్లి సునీత డెంటల్ విభాగం హెడ్ ఆఫ్ డిపార్ట్‌మెంట్ (HOD)ని చెంపదెబ్బ కొట్టింది. పరిస్థితి ఉద్రిక్తం కావడంతో.. పోలీసులు, నిరసనకారుల మధ్య చిన్నపాటి ఘర్షణ జరిగింది. పోలీసులు వారిని బలవంతంగా చెదరగొట్టారని కుటుంబం ఆరోపించింది. కాగా పోలీసులు సూసైడ్ నోట్‌లో పేర్కొన్న ఇద్దరు అధ్యాపకులను అరెస్టు చేశారు. విశ్వవిద్యాలయ సిబ్బందితో సహా ఐదుగురిపై ఆత్మహత్యకు ప్రేరేపణ వంటి సెక్షన్ల కింద FIR నమోదు చేశారు. ఇక శారదా విశ్వవిద్యాలయం ఆరోపణలు ఎదుర్కొంటున్న అధ్యాపకులను సస్పెండ్ చేసింది. పరిస్థితులను పరిశీలించడానికి ఉన్నత స్థాయి విచారణ కమిటీని ఏర్పాటు చేసింది.