– మావోయిస్టులతో కేంద్రం చర్చలు జరపాలి : మాజీ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి డిమాండ్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆపరేషన్ కగార్‌ను వెంటనే నిలిపేయాలని మాజీ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి డిమాండ్ చేశారు. ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్ర ప్రభుత్వం ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల పేరిట ఆదివాసీలను చంపుతున్నదని బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. కర్రెగుట్టల్లో మావోయిస్టు కీలక నాయకులున్నారనే సమాచారంతో 20 వేల మంది భద్రతా సిబ్బందితో కూంబింగ్ జరుపుతున్నట్టు మీడియాలో వార్తలొస్తున్నాయని పేర్కొన్నారు. మావోయిస్టులు అట్టడుగు స్థానంలో బతుకులీడుస్తున్న భారతీయుల బాగుకోసం ఉద్యమాలు చేస్తున్నారని వివరించారు. ప్రభుత్వంతో చర్చలకు సిద్ధమంటూ వారు లేఖ పంపించారని తెలిపారు. రాజకీయ పార్టీలు కూడా ఆపరేషన్ కగార్‌ను నిలిపేసి, చర్చలను కొనసాగించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశాయని గుర్తు చేశారు. కేంద్రం మాత్రం ‘మావోల అంతం మా పంతం’అనే పద్ధతిలో వ్యవహరిస్తున్నదని విమర్శించారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 77 ఏండ్లు పూర్తయ్యాయని పేర్కొన్నారు. కానీ దేశంలో ప్రజల మధ్య ఉన్న సామాజిక అంతరాలు పోలేదని వివరించారు. ఆర్థిక అంతరాలు మిస్సైళ్ల వేగంతో పెరిగిపోతున్నాయని తెలిపారు. ఆర్థిక, సామాజిక అంతరాలను తగ్గించే విధంగా పాలన చేయలేక, ప్రశ్నించే వారిని చంపటమే లక్ష్యంగా ఆపరేషన్ కగార్‌ను నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తన విధానాలను మార్చుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఆర్థిక, సామాజిక అంతరాలను తగ్గించే పద్ధతిలో పనిచేయాలని సూచించారు. దేశ పౌరులను శత్రువులుగా పరిగణించే వైఖరిని మార్చుకోవాలని కోరారు. కర్రెగుట్టల్లో కూంబింగ్ ఆపి చర్చలను ప్రారంభించాలని డిమాండ్ చేశారు.
ఆపరేషన్ కగార్‌ను నిలిపేయాలి
- Advertisement -
RELATED ARTICLES