Monday, July 21, 2025
E-PAPER
Homeజాతీయంపార్లమెంటులో ప్రధాని మాట్లాడాలి

పార్లమెంటులో ప్రధాని మాట్లాడాలి

- Advertisement -

ప్రజలకు వాస్తవాలు చెప్పాలి పహల్గాం దాడి, బీహార్‌ ఓటర్ల జాబితాపై చర్చ జరగాలి
ట్రంప్‌ వ్యాఖ్యలు, మణిపూర్‌లో శాంతిపై వివరణ ఇవ్వాలి
అఖిలపక్ష సమావేశంలో ప్రతిపక్షాల డిమాండ్‌
అన్ని అంశాలపై చర్చకు సిద్ధం… సహకరించండి : కేంద్రమంత్రి కిరణ్‌ రిజిజు
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో

ప్రధాని నరేంద్రమోడీ ఈ సారైనా పార్లమెంటులో దేశ ప్రజల సందేహాలకు స్పష్టమైన వివరణ ఇస్తూ మాట్లాడాలని ప్రతిపక్షాలు విజ్ఞప్తి చేశాయి. పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్‌ సింధూర్‌, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ చేసిన ప్రకటన, బీహార్‌ ఓటర్ల జాబితా, మణిపూర్‌లో అశాంతి, నిరుద్యోగం, రైతులు, దేశ విదేశాంగ విధానం తదితర అంశాలపై చర్చ జరగాలనీ, వాటన్నింటికి ప్రధాని మోడీ సమాధానాలు చెప్పాలని కోరాయి. పార్లమెంట్‌ ఉభయ సభలు సోమవారం నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి జేపీ నడ్డా అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం జరిగింది. దీనికి 51 రాజకీయ పార్టీలకు చెందిన 54 మంది నేతలు హాజరయ్యారు. సభలు సజావుగా జరిగేలా సహకరించాలని ప్రభుత్వం ప్రతిపక్షాలకు విజ్ఞప్తి చేసింది. ఆయా అంశాలపై నిర్మాణాత్మక చర్చలు నిర్వహిస్తామని హామీ ఇచ్చింది. సమావేశం అనంతరం కాంగ్రెస్‌ నేతలు ప్రమోద్‌ తివారీ, గౌరవ్‌ గొగోరు మీడియాతో మాట్లాడారు. ఈసారి ప్రధాని నరేంద్ర మోడీ పార్లమెంట్‌ ద్వారా దేశాన్ని ఉద్దేశించి మాట్లాడతారని తాము ఆశిస్తున్నామన్నారు. పహల్గాం ఉగ్రదాడిపై లెఫ్టినెంట్‌ గవర్నర్‌ ఇచ్చిన ప్రకటన తీవ్రమైందనీ, దీనిపై పార్లమెంట్‌లో కేంద్రం వైఖరి స్పష్టంగా తెలపాలని డిమాండ్‌ చేశారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ భారత్‌ గౌరవాన్ని, మన సైన్యం ధైర్యాన్ని ప్రశ్నించే లక్ష్యంగా వ్యాఖ్యలు చేశారనీ, దీనిపై ప్రధాని మాత్రమే సమాధానం చెప్పగలరన్నారు. రాబోయే రాష్ట్ర ఎన్నికలు, ప్రజాస్వామ్య నిర్మాణంపై తీవ్రమైన ప్రశ్నలు తలెత్తుతున్నాయనీ, వీటిపై ప్రతిపక్షాల సందేహాలు తీర్చాల్సిన బాధ్యత ప్రధానిపై ఉందని గుర్తుచేశారు. మణిపూర్‌కు సంబంధించిన అనేక బిల్లుల్ని ప్రభుత్వం తీసుకువస్తోందనీ, కొన్ని నెలల్లో మణిపూర్‌లో శాంతి తిరిగి వస్తుందని ప్రధాని గతంలో చెప్పారని వివరించారు. రెండున్నరేండ్లు గడిచినా అక్కడ అశాంతి కొనసాగుతూనే ఉన్నదనీ, అక్కడ పరిస్థితుల్ని పర్యవేక్షించేందుకు ప్రధాని ఇప్పటి వరకు ఆ రాష్ట్రానికి ఎందుకు వెళ్లలేదో పార్లమెంటుకు చెప్పాల్సిన బాధ్యత ఉందని అన్నారు.
ఆప్‌ ఎంపీ సంజరుసింగ్‌ మాట్లాడుతూ వాణిజ్య ఒప్పందం పేరుతో కాల్పుల విరమణ ప్రకటించేలా చేశానని ట్రంప్‌ చెబుతున్నారనీ, దీనిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని కోరారు. ఢిల్లీలో మురికివాడల కూల్చివేతల అంశంపై కూడా చర్చించాలని కోరామన్నారు. జెఎంఎం ఎంపి మహువా మాంఝీ మాట్లాడుతూ మహిళా రిజర్వేషన్‌ బిల్లును ప్రస్తావించామన్నారు.

అన్ని అంశాలు చర్చిస్తాం : కేంద్రమంత్రి కిరణ్‌ రిజిజు
పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు మాట్లాడుతూ అఖిలపక్ష సమావేశం నిర్మాణాత్మకంగా జరిగిందని, ఫ్లోర్‌ లీడర్లు తమ పార్టీల వైఖరిని, ఈ సమావేశంలో వారు లేవనెత్తాలనుకుంటున్న అంశాలను ముందుకు తెచ్చారని అన్నారు. ఉభయ సభలు సక్రమంగా పనిచేసేలా చూడాలని ప్రభుత్వం ప్రతిపక్షాలను అభ్యర్థించిందని పేర్కొన్నారు. పాలకపక్షం, ప్రతిపక్షం రెండూ మంచి సమన్వయంతో కలిసి పనిచేయాలని విజ్ఞప్తి చేశారు. తాము విశాల హదయంతో చర్చకు సిద్ధంగా ఉన్నామన్నారు. రూల్స్‌, సంప్రదాయం మేరకు పని చేస్తామని చెప్పారు. కేంద్రం పార్లమెంట్‌లో తగిన విధంగా స్పందిస్తుందని తెలిపారు.
ప్రతిపక్షాలు లేవనెత్తిన అంశాలపై మీడియా ఆయనను ప్రశ్నించగా.. పార్లమెంట్‌లో ఆపరేషన్‌ సిందూర్‌ వంటి ముఖ్యమైన అంశాలపై చర్చించేం దుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. కాలి పోయిన రూ.500 నోట్ల కట్టలు దొరికిన తరువాత అభిశంసనను ఎదుర్కొంటున్న ఢిల్లీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ యశ్వంత్‌ వర్మ కేసుపై స్పందిస్తూ… ఆయనను తొలగించేందుకు ఇప్పటికే వంద మంది ఎంపీలు సంతకాలు చేశారన్నారు. జస్టిస్‌ వర్మ కేసులో ఈ ప్రక్రియను అన్ని పార్టీలు కలిసి చేపడుతాయనీ, ఇది ఒక్క ప్రభుత్వం చర్య కాదని వివరణ ఇచ్చారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వ్యాఖ్యలపైనా చర్చిస్తామని చెప్పారు. పార్లమెంటు సమావేశాల్లో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొంటారని స్పష్టం చేశారు.

17 బిల్లులు పెడతాం
ప్రస్తుత వర్ష కాల సమావేశాల్లో పార్లమెంటు ఆమోదం కోసం 17 బిల్లులు ప్రవేశపెడతామని కేంద్రమంత్రి రిజిజూ తెలిపారు. పార్లమెంట్‌ పద్థతులు, విలువలు తగ్గకుండా ఈ సమావేశాల్లో చర్చలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామ న్నారు. సమావేశంలో కేంద్ర మంత్రులు అర్జున్‌ రామ్‌ మేఘ్వాల్‌, ఎల్‌. మురుగన్‌, అనుప్రియ పటేల్‌ (అప్నాదల్‌), రాందాస్‌ అథ్వాలే (ఆర్‌పిఐ), జైరాం రమేష్‌, కె.సురేష్‌ (కాంగ్రెస్‌), సుప్రియా సులే (ఎన్‌సిపి), తిరుచ్చి శివ, టిఆర్‌ బాలు (డిఎంకె), రామ్‌గోపాల్‌ యాదవ్‌ (ఎస్‌పి), సంజరు సింగ్‌ (ఆప్‌), జాన్‌ బ్రిట్టాస్‌ (సిపిఐ(ఎం), లావు శ్రీకష్ణ దేవరాయులు (టిడిపి), పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, మద్దిల గురుమూర్తి, తనుజా రాణి (వైసిపి), బాలశౌరి (జనసేన), కెఆర్‌ సురేష్‌ రెడ్డి (బిఆర్‌ఎస్‌), సస్మిత్‌ పాత్ర (బిజెడి), ఎన్‌కె ప్రేమచంద్రన్‌ (ఆర్‌ఎస్‌పి), మహువా మాఝీ (జెఎంఎం) తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -