Monday, July 21, 2025
E-PAPER
Homeజాతీయం'పౌరుడు'కి రుజువేది?

‘పౌరుడు’కి రుజువేది?

- Advertisement -

ఇప్పటికీ ఒక చట్టబద్ధమైన పత్రం లేదు ఆధార్‌, ఓటర్‌ ఐడీలనూ గుర్తించని ఈసీఐ
బీహార్‌ ఓటరు జాబితా సమగ్ర సవరణతో
చర్చనీయాంశంగా పౌరసత్వం అంశం
బీహార్‌ :
బీహార్‌ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) చేయాలన్న భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) నిర్ణయం తీవ్ర చర్చనీయాంశంగా మారుతున్నది. కోట్లాది మంది బీహార్‌ ప్రజలు తమ ఓటు హక్కును నిరూపించుకోవటానికి పరీక్షను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ప్రక్రియలో భాగంగా ఆధార్‌, ఓటర్‌ ఐడీలను పరిగణలోకి తీసుకోబోమని ఎన్నికల సంఘం చెప్తున్నది. వాటిని మినహాయిస్తూ 11 పత్రాలను సమర్పించాలని చెప్తున్నది. అయితే, పత్రాలు వ్యక్తుల పౌరసత్వానికి రుజువు కావనీ, కేవలం గుర్తింపు మాత్రమేనని అంటున్నది. దీంతో భారత్‌లో ఒక వ్యక్తి పౌరసత్వాన్ని నిర్ధారించే విషయం చర్చకు దారి తీస్తున్నది.

ఈ నేపథ్యంలో ఒక వ్యక్తి ఈ దేశ పౌరుడే అని చెప్పటానికి ఉన్న ఆధారాలు ఏమిటి? అనే విషయంపై అందరిలోనూ చర్చ నడుస్తున్నది. భారత్‌లో ఒక వ్యక్తి పౌరసత్వాన్ని.. పౌరసత్వ చట్టం, 1955 నిర్ణయిస్తుంది. అయితే ఈ చట్టం కింద ఒక వ్యక్తి భారతదేశ పౌరుడని నిర్ధారించే ఒక స్పష్టమైన డాక్యుమెంట్‌ ఇప్పటికీ లేదని మాజీ ఎన్నికల కమిషనర్‌ అశోక్‌ లావాసా చెప్పారు. చట్టం కింద పుట్టుకతో, వారసత్వంగా, నమోదు ద్వారా, నేచురలైజేషన్‌ ద్వారా ఈ పౌరసత్వం పొందొచ్చు.

పౌరసత్వం లభించే తీరు ఇలా..
భారత్‌ వెలుపల జన్మించిన వ్యక్తికి వంశపారంపర్యంగా పౌరసత్వం లభిస్తుంది. భారత సంతతికి చెందినవారికి, భారత పౌరుడిని వివాహం చేసుకున్నవారికి రిజిస్ట్రేషన్‌ ద్వారా సిటిజన్‌షిప్‌ వస్తుంది. ఇక నేచురలైజేషన్‌ ద్వారా పౌరసత్వం విదేశీయులకు మాత్రమే వర్తిస్తుంది. ”భారత రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పటి నుంచి భారత పౌరులకు ‘సిటిజన్‌షిప్‌ సర్టిఫికెట్‌’ అనేది ఏమీ లేదు. భారత పౌరులకు వారి పౌరసత్వాన్ని నిరూపించుకునే ఒక ప్రత్యేక పత్రం కూడా లేదు” అని గువహతికి చెందిన లాయర్‌ అమన్‌ వదూద్‌ అన్నారు. నేచురలైజేషన్‌, రిజిస్ట్రేషన్‌, వారసత్వంగా భారత పౌరసత్వాన్ని పొందినవారికే సిటిజన్‌షిప్‌ సర్టిఫికెట్‌ ఉంటుంది. వీరికి పౌరసత్వ సవరణ చట్టం కింద సిటిజన్‌షిప్‌ ప్రసాదిస్తారు. జన్మత: పౌరసత్వం వచ్చినవారికి దానిని ధృవీకరించేలా ప్రత్యేకంగా ఎలాంటి సర్టిఫికెట్‌ లేదని న్యాయ నిపుణులు చెప్తున్నారు.

ఆధార్‌పై ఈసీ ద్వంద్వ ప్రమాణాలు
ప్రత్యేక సమగ్ర సవరణలో ఈసీఐ ఆధార్‌ను వద్దనటం పట్ల పలువురు ప్రశ్నిస్తున్నారు. ఈసీఐ ప్రస్తుతం బీహార్‌ విషయంలో వ్యవహరిస్తున్న తీరుకు, గతంలో దాని చర్యలకు మధ్య ఉన్న వైరుధ్యాన్ని పలువురు ఎత్తి చూపుతున్నారు. 2023 మార్చిలో జారీ చేసిన ఓటర్ల జాబితాలపై ఈసీఐ మాన్యువల్‌.. కొత్త ఓటరు నమోదు కోసం ఉపయోగించే అధికార దరఖాస్తు ఫారమ్‌ అయిన ఫారమ్‌ 6తో జతచేయటానికి ఆధార్‌ను ఆమోదయోగ్యమైన పత్రంగా పేర్కొన్నది. ఒక నియోజకవర్గం నుంచి ఇంకో నియోజకవర్గానికి తమ నివాసాన్ని మార్చుకునే ఓటర్లకు ఆధార్‌ను అందించవ్చని పేర్కొన్నది.
వయసు రుజువుగా, సాధారణ నివాస రుజువుగా ఆధార్‌ను సమర్పించొచ్చని వివరించింది. 2015లో.. ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా నేషనల్‌ ఎలక్టోరల్‌ రోల్‌ ప్యూరిఫికేషన్‌ అండ్‌ అథెంటికేషన్‌ ప్రోగ్రామ్‌ (ఎన్‌ఈఆర్‌పీఏపీ)ను ప్రారంభించింది. దీని లక్ష్యం.. ఎలక్టోరల్‌ ఫోటో ఐడెంటిటీ కార్డ్‌ (ఎపిక్‌) డేటాను ఆధార్‌ నెంబర్‌, మొబైల్‌ నంబర్‌, ఈ-మెయిల్‌తో అనుసంధానించటం ద్వారా తప్పులు లేని ఓటరు జాబితాను తీసుకురావటమే అని తెలిపింది. గతంలో చేపట్టిన కార్యక్రమాల్లో ఆధార్‌కు ప్రాధాన్యతనిచ్చిన ఎన్నికల సంఘం.. ఇప్పుడు బీహార్‌ విషయంలో దానిని గుర్తింపు పత్రంగా పరిగణించక పోవటంపై ఆందోళనలను తలెత్తుతున్నాయి. ఆధార్‌ను గుర్తింపు పత్రంగా పరిగణించకపోతే.. చాలా మంది ఓటు హక్కును కోల్పోతారని పిటిషనర్ల ఆందోళనను సైతం సుప్రీంకోర్టు ఇటీవల విచారణ సందర్భంగా గుర్తించింది.

పౌరసత్వంపై ఈసీకి అధికారం లేదు
ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ పేరుతో ఈసీఐ పరోక్షంగా పౌరుల పౌరసత్వాన్ని నిర్ణయించే విషయంలో ప్రవేశిస్తున్నదని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఒక వ్యక్తి పౌరసత్వాన్ని భారత ప్రభుత్వం మాత్రమే సవాలు చేయగలదనీ, ‘ఈసీలోని చిన్న అధికారి’ కాదని ఆర్జేడీ ఎంపీ మనోజ్‌కుమార్‌ ఝా తరఫున సుప్రీంకోర్టులో వాదనలు వినిపించిన సీనియర్‌ అడ్వొకేట్‌ కపిల్‌ సిబల్‌ అన్నారు. పౌరసత్వ అంశంలోకి వెళ్లటం ఈసీ పరిధిలోకి రాదని సుప్రీంకోర్టు పలు సందర్భాల్లో చెప్పిందని లోక్‌సభ మాజీ సెక్రెటరీ జనరల్‌, రాజ్యాంగ నిపుణులు పి.డి.టి ఆచారి అన్నారు.

ఆ 11 పత్రాలు పౌరసత్వానికి రుజువు కావు
బీహార్‌కు సంబంధించి ఓటరు జాబితాల సవరణ కోసం ఈసీ 11 డాక్యుమెంట్లను సూచించింది. ఇందులో జనన ధృవీకరణ పత్రం, పాస్‌పోర్ట్‌, మెట్రిక్యులేషన్‌ సర్టిఫికెట్‌, ప్రభుత్వం జారీ చేసిన శాశ్వత నివాస ధృవీకరణ పత్రం, అటవీ హక్కుల పత్రం, కుల పత్రం, ఎన్‌ఆర్‌సీ (ఉనికిలో ఉన్న చోట), రాష్ట్ర, స్థానిక యంత్రాంగాలు రూపొందించిన ఫ్యామిలీ రిజిస్టర్‌, ప్రభుత్వం అలాట్‌ చేసిన ఏదైనా భూమి లేదా ఇల్లు కేటాయింపు ధృవీకరణ పత్రం.. వంటి 11 ఆమోదయోగ్యమైన పత్రాలను ఎన్నికల సంఘం జాబితా చేసింది. ఇవన్నీ పౌరసత్వానికి గుర్తింపు మాత్రమే కానీ, రుజువు కాదని పేర్కొన్నది. అయితే, ఈ జాబితాలో ఆధార్‌, ఓటర్‌ కార్డులు మాత్రం లేకపోవటం గమనార్హం. సుప్రీంకోర్టులో విచారణ సందర్భంగా ఈసీఐ తరఫున హాజరైన సీనియర్‌ న్యాయవాది రాకేశ్‌ ద్వివేది.. అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటర్ల జాబితాలో ఉన్నారని నిర్ధారించటమే ఈ ప్రక్రియ వెనుక ఉన్న ఏకైక ఉద్దేశమని కోర్టుకు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -