Monday, July 21, 2025
E-PAPER
Homeజాతీయంమిథున్‌రెడ్డికి 1 వరకు రిమాండ్‌

మిథున్‌రెడ్డికి 1 వరకు రిమాండ్‌

- Advertisement -

రాజమండ్రి జైలుకు తరలింపు
అమరావతి
: లిక్కర్‌ కేసులో వైసిపి ఎంపి పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డికి విజయవాడ ఎసిబి కోర్టు ఆగస్టు ఒకటి వరకు రిమాండ్‌ విధించింది. ఆయనను ఆదివారం సాయంత్రం రాజమండ్రి సెంట్రల్‌ జైలుకు పోలీసులు తరలించారు. తొలుత వైద్య పరీక్షల కోసం విజయవాడలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనంతరం ఆయనను ఎసిబి కోర్టులో ప్రవేశపెట్టారు. మిథున్‌రెడ్డి అరెస్టుకు 29 కారణాలను సిట్‌ అధికారులు కోర్టుకు సమర్పించిన నివేదికలో పేర్కొన్నారు. ఈ కేసులో ఎ-4గా ఉన్న ఆయనపై సెక్షన్లు 409, 420, 120(బి), రెడ్‌విత్‌ 34, 37, ప్రివెన్షన్‌ ఆఫ్‌ కరెప్పన్‌ యాక్ట్‌ 7, 7ఎ, 8, 13(1)(బి), 13(2) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. సిట్‌ తరపున కోటేశ్వరరావు, మిథున్‌రెడ్డి తరపున సీనియర్‌ అడ్వకేట్‌ నాగార్జున రెడ్డి వాదనలు వినిపించారు. సిట్‌ తరపున అడ్వకేట్‌ వాదనలు వినిపిస్తూ.. లిక్కర్‌ స్కామ్‌లో మిథున్‌రెడ్డిది కీలకపాత్ర అని, లిక్కర్‌ స్కామ్‌ మనీ ట్రైల్‌లో ఆయన పాత్రపై స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని అన్నారు. మిథున్‌రెడ్డి తరపున అడ్వకేట్‌ నాగార్జునరెడ్డి వాదనలు వినిపిస్తూ రిమాండ్‌ విధించే పక్షంలో నెల్లూరు జైలుకు పంపాలని, ఆయన వై కేటగిరి భద్రతలో ఉన్నందున ప్రత్యేక బ్యారెక్‌లోకి తరలించా లని కోరారు. అరెస్టు సమాచారాన్ని లోక్‌సభ స్పీకరుకు ముందస్తుగా తెలపలేదని న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. సిట్‌ తరపున అడ్వకేట్‌ గుంటూరు జైలుకు పంపాలని న్యాయస్థానానికి విజ్ఞప్తి చేశారు. చివరికి ఎసిబి కోర్టు రాజమండ్రి జైలుకు తరలించాలని పోలీసులను ఆదేశించింది. ఇదే సందర్భంలో తనకు రక్తం గడ్డకట్టే వ్యాధి (బ్లడ్‌ క్లాట్స్‌) ఉన్న దృష్ట్యా ఆస్పత్రిలో చికిత్స అందించాలని మిథున్‌రెడ్డి.. న్యాయస్థానానికి విన్నవించుకున్నారు.
రాజకీయ కుట్రలో భాగమే :వైసిపి అధినేత వైఎస్‌ జగన్‌
రాజకీయ కుట్రలో భాగంగానే వైసిపి ఎంపి పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డిని తప్పుడు కేసులో ఇరికించి జైలుకు పంపారని వైసిపి అధినేత జగన్‌ ఆరోపిం చారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. మిథున్‌రెడ్డి అరెస్ట్‌ను ఖండిస్తున్నామన్నారు. బెదిరింపులు, హింస, లంచాలు, ప్రలోభాలతోనే ఈ కేసు అని పేర్కొన్నారు. ప్రజల తరపున పోరాడే వారి గొంతు మూయించే కార్యక్రమం తప్ప మరొకటి కాదన్నారు. వరుసగా మూడు సార్లు ఎంపిగా ఎన్నికైన మిథున్‌రెడ్డిని బలవంతపు వాంగ్మూలాల ద్వారా తప్పుడు కేసులో ఇరికించారన్నారు.
కక్ష సాధింపులో భాగంగానే.. :పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
టిడిపి కూటమి ప్రభుత్వం కక్ష సాధింపులో భాగంగానే తన కుమారుడు ఎంపి పెద్దిరెడ్డి మిథున్‌ రెడ్డిని అరెస్టు చేసిందని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. తమ కుటుంబం మీద ఉన్న కక్ష, విద్వేషంతోనే ఇలా కేసులు పెడుతున్నారని ఓ వీడియో సందేశంలో ఆదివారం ఆయన పేర్కొన్నారు. చంద్రబాబు, లోకేష్‌, పవన్‌ ఏ విధంగా ఇబ్బందులు పెడుతున్నారో చూస్తున్నామని, దీనికి తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. గతంలోనూ ఎయిర్‌పోర్ట్‌ మేనేజరును కొట్టారని మిథున్‌రెడ్డిపై కేసు పెట్టారని, అది తప్పుడు కేసుగా తేలిందని గుర్తు చేశారు.
అక్రమ అరెస్టులు : సజ్జల
లిక్కర్‌ స్కామ్‌ పేరుతో అక్రమ అరెస్టులు చేస్తున్నారని వైసిపి రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబుకు ధైర్యం ఉంటే తన హయాంలో జరిగిన లిక్కర్‌ స్కామ్‌పై కేంద్ర దర్యాప్తు కోరాలన్నారు.
భూ కుంభకోణాలపైనా చర్యలు : మంత్రి అనగాని
లిక్కర్‌ స్కామ్‌తోపాటు భూ కుంభకోణాలు, ఇతర అవినీతి వ్యవహారాల్లో భాగమైన ప్రతి ఒక్కరిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారని రెవెన్యూశాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ పేర్కొన్నారు. కల్తీమద్యంతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడి, డిజిటల్‌ పేమెంట్లు లేకుండా రూ.వేల కోట్ల కుంభకోణానికి పాల్పడిన వారిని సిట్‌ అధికారులు విచారణ జరిపి అరెస్టులు చేస్తున్నారని తెలిపారు.
అరెస్టును స్వాగతిస్తున్నాం : పివిఎన్‌ మాధవ్‌
ఎంపి మిథున్‌రెడ్డి అరెస్టును స్వాగతిస్తున్నట్లు బిజెపి రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్‌ మాధవ్‌ వెల్లడించారు. డిజిటల్‌ పేమెంట్‌ లేకుండా లిక్కర్‌ సొమ్మును దోచేశారన్నారు. రాష్ట్ర పోలీసులు దర్యాప్తును సమర్థవంతంగా నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -