– గాంధీ ఆస్పత్రిలో వసూళ్ల పర్వం
– మార్చురీ వద్ద సిబ్బంది డబ్బుల డిమాండ్
– కల్తీకల్లు మృతదేహాలనూ వదలని వైనం
– నెలకు రూ.20-30 లక్షలు వసూలు..!
నవతెలంగాణ-సిటీబ్యూరో
గాంధీ దవాఖానాలో చనిపోయిన రోగికి పోస్టుమార్టం నిర్వహించాలంటే చేతులు తడపాల్సిందే అంటున్నారు అక్కడున్న కొంతమంది సిబ్బంది. ఒకవైపు వ్యక్తి ప్రాణం పోయి కుటుంబ సభ్యులు రోధిస్తుంటే.. మరోవైపు మా మామూళ్లు మాకివ్వండి.. అంటూ పీడిస్తున్నారు. ఇది అక్కడ షరామామూలైంది. కల్తీ కల్లు తాగి చనిపోయిన మృతుల కుటుంబ సభ్యులనూ వదల్లేదంటే మార్చురీ వద్ద దందా ఎలా సాగుతుందో అర్థం చేసుకోవచ్చు. అధికారులు, పోలీసులూ పట్టించుకున్న దాఖలాలు లేవు.ఆత్మహత్య చేసుకున్నా.. రోడ్డు ప్రమాదంలో మరణించినా.. హత్యకు గురైనా.. అనుమానాస్పదంగా మృతిచెందినా.. ఇంకేదైనా ఘటనలో చనిపోయి అనుమానాలుంటే పోస్టుమార్టం నిర్వహించాల్సి వస్తే ఆ కేసులు ఎక్కువగా సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి వస్తుంటాయి. దీన్ని ఆసరాగా చేసుకుని మార్చురీ వద్ద ఉన్న కొంత మంది ఆస్పత్రి సిబ్బంది డబ్బుల వసూళ్ల పర్వానికి దిగుతున్నారు. ఈ విషయంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తే తమకే ఇబ్బందిగా మారి పోస్ట్‌మార్టం సకాలంలో కానివ్వకుండా నిలిపేస్తారని, ఒకవేళ పోస్ట్‌మార్టం చేసినా రిపోర్టులకు రోజుల తరబడి తిప్పించుకుంటారని మృతుల కుటుంబ సభ్యులు ఆవేదన చెందుతున్నారు. మార్చురీ వద్ద సిబ్బందిని ఎదిరించలేక కొందరు వారు అడిగిన మొత్తం చెల్లిస్తుండగా.. మరికొందరు కాళ్లో వేళ్లో పట్టుకుని ఎంతో కొంత ముట్టజెప్పి మృతదేహాలను తీసుకెళ్లాల్సిన దుస్థితి నెలకొంది.
రూ.10వేలు ఫిక్స్‌డ్ రేటు..!
ఇటీవల కల్తీ కల్లు తాగి ఓ వ్యక్తి మృతిచెందితే పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. మార్చురీ వద్ద సిబ్బంది మృతుడి బంధువులను పక్కకు తీసుకెళ్లి రూ.10వేలు డిమాండ్ చేశారు. అంత ఇవ్వలేమని వారు చెప్పగా.. ఇది ఫిక్స్‌డ్ రేటు అని, తగ్గించేది లేదని దాదాపు 20 నిమిషాల వరకు బేరసారాలు చేశారు. పేదోళ్లమని, తమ వద్ద డబ్బుల్లేవని కాళ్లు పట్టుకోగా.. రూ.2,500 తీసుకుని మృతదేహాన్ని అప్పగించారు. మరో ఘటనలో పోస్టుమార్టం నిమిత్తం శుక్రవారం ఓ మృతదేహం గాంధీ ఆస్పత్రికి రాగా, కుటుంబ సభ్యులను రూ.10వేలు డిమాండ్ చేయడం గమనార్హం. వారు ఆస్పత్రి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని చెప్పడంతో సైలెంట్ అయిపోయారు.
రోజుకు రూ.లక్ష వరకు వసూలు..!
సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో ప్రతి రోజూ 10 నుంచి 15 వరకు పోస్టుమార్టాలు జరుగుతూ ఉంటాయి. ఈ లెక్కన పోస్టుమార్టర్ల కోసం రూ.10వేల చొప్పున రోజుకు రూ.లక్ష నుంచి రూ.1.50 లక్షల వరకు అక్కడి సిబ్బంది వసూలు చేస్తున్నారు. కూకట్‌పల్లి కల్తీ కల్లు మృతదేహాలకు కూడా దాదాపు గాంధీ ఆస్పత్రిలోనే పోస్టుమార్టం నిర్వహించారు. త్వరగా పోస్టుమార్టం చేస్తామని, అదే తరహాలో రిపోర్టులు ఇస్తామని చెప్పి ఒక్కో మృతదేహానికి డబ్బులు తీసుకుంటున్నట్టు బాధితులు కొంతమంది వివరించారు.
ఉన్నతాధికారులకు వాటాలు..!
గాంధీ ఆస్పత్రి మార్చురీ వద్ద డబ్బులు వసూలు చేయడం నిత్యకృత్యమైంది. ఆస్పత్రిలోని కాంట్రాక్టర్లు, ప్రయివేటు మెడికల్ షాపుల వద్ద నుంచి కమీషన్లు వచ్చినట్టుగానే మార్చురీ వద్ద వసూలు చేసి దాంట్లో ఆస్పత్రి ఉన్నతాధికారులకు వాటాలు వెళ్తుండటంతోనే వారు కిమ్మనడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనికితోడు మార్చురీ సిబ్బంది తాము చేస్తున్న తప్పుల్లో సాక్ష్యాలు లేకుండా జాగ్రత్తలు పడుతుండటంతో చర్యలు తీసుకునేందుకు ఆస్పత్రి వర్గాలు వెనకడుగు వేస్తున్నట్టు మరో వాదన కూడా లేకపోలేదు. మనిషి చనిపోయిన బాధలో తాముంటే, శవాన్ని అప్పగించాలంటే డబ్బులు డిమాండ్ చేస్తున్నారని, సంబంధిత అధికారులు దృష్టి సారించి కట్టడి చేయాలని మృతుల కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు.