
నవతెలంగాణ-హైదరాబాద్ : మేడే స్పూర్తితో హక్కులు నిలబెట్టుకోవడం కోసం, అదనపు సౌకర్యాల కోసం మరింత ఉధృతంగా ఐక్య పోరాటాలు చేయడమే మన ముందున్న కర్తవ్యం అని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ తెలిపారు. మేడే సందర్భంగా నవతెలంగాణ కార్యాలయంలో ఇన్ చార్జీ ఎడిటర్ రాంపల్లి రమేష్ అద్యక్షతన జరిగిన సమావేశంలో ముఖ్యఅతిథిగా విచ్చేసిన జాన్ వెస్లీ మాట్లాడుతూ ”కార్మిక వర్గం ప్రపంచ వ్యాప్తంగా పోరాటం చేసి ఎనిమిది గంటల పనిదినం సాధించుకున్నది. దీనిని గుర్తుచేస్తూ 1889లో ప్రపంచ కమ్యూనిస్టు ఇంటర్ నేషనల్ ఈ మేడే నిర్వహించాలని నిర్ణయించింది. పనిగంటల తగ్గింపు కోసం చేసే పోరాటం నిజమైన వర్గ పోరాటం అని కారల్‌మార్క్స్ నొక్కిచెప్పారు. అందుకే పెట్టుబడిదారీ వర్గం ఆనాటి నుండి ఈనాటి వరకు పని గంటలు పెంచి కార్మికుల శ్రమను దోచుకుని లాభాలు గడించాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఉత్పత్తిలో శాస్త్ర, సాంకేతిక అభివృద్ధితో మానవ శరీరక శ్రమ తీవ్రత తగ్గిన పరిస్థితులు పని గంటలు, పనిదినాలు తగ్గాలి. అభివృద్ధి చెందిన దేశాల్లో వారానికి ఐదు రోజులు పని గంటలు, రోజుకు ఏడు గంటల పని అమలులో ఉంది. దీనికి భిన్నంగా మనదేశంలో పన్నెండు గంటల పనిదినం ఉండాలని డిమాండ్ ముందుకు తెస్తున్నారు. బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్‌లో పన్నెండు గంటల పనిదినం చట్టం చేసింది. మేడే స్పూర్తితో కోట్లాది కార్మికవర్గం దీన్ని తిప్పి కొట్టాలి. బీజేపీ కేంద్ర ప్రభుత్వం తెచ్చిన రైతు వ్యతిరేక విధానాలు, నల్ల చట్టాలు ఫలితంగా నేషనల్ బీజేపీ పాలనలో లక్ష మందికి పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు.“ అని తెలిపారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ… ”కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాల ఫలితంగా శ్రామికవర్గాలకు కనీస వేతనం, ఉపాధి పనికి నిధులు, ఉచితంగా విద్య హక్కు, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు, ఇల్లులేని ప్రతి కుటుంబానికి ఇల్లు, ధరలు పెరుగుతున్న నేపథ్యంలో రేషన్‌కార్డుకు పద్నాలుగు రకాల సరుకులు సాధించుకునేందుకు, కుల వివక్ష, మహిళలమీద దాడులు, లైంగికదాడులు, హత్యలకు వ్యతిరేకంగా, సామాజిక న్యాయం, రాజ్యాంగ హక్కులను భవిష్యత్‌లో శ్రామిక వర్గాలు ఐక్యంగా పోరాడి సాధించుకోవాలి. కార్మికుల హక్కుల రక్షణ కోసం చేసే ప్రతి పోరాటం కోసం ఈ మేడేను స్పూర్తిగా తీసుకోవాలి. మే 20న దేశ వ్యాపితంగా కార్మికులు తమ హక్కులకోసం చేస్తున్న సమ్మెకు సంఘీభావంగా మే ఒకటి నుండి ఎనిమిది వరకు రాష్ట్ర వ్యాపితంగా గ్రామగ్రామాన మద్ధతుగా మేడే పోరాట స్పూర్తితో కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం.“ అని అన్నారు. ”తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రజలు, కార్మికులు అనేక కష్టాలు ఎదుర్కొంటున్నారు. రోజుకు పన్నెండు గంటలు పనిచేస్తున్నారు. జీత భత్యాలు పెంచడం లేదు. చాలి చాలని జీతాలతో కార్మిక వర్గం, మధ్యతరగతి ఇబ్బందులు పడుతున్నారు. వారికి కనీస వేతనం 26వేలు ఉండాలి. వచ్చే జీతంలో సగం ఇంటి కిరాయిలకే పోతే సామాన్యుడు బతికేది ఎట్లా? కాబట్టే అందరికీ ఇండ్లు ఇవ్వాలని, భూమి పంచాలని సీపీఐ(ఎం) ఇండ్ల సల్థాల పోరాటం చేస్తుంది.“ అని తెలిపారు. నవతెలంగాణ బుక్ హౌస్ ఎడిటర్ కె.ఆనందాచారి మాట్లాడుతూ నేడు కార్మిక దినోత్సవమే కాదు… కార్మిక వర్గ నేత సుందరయ్య జయంతి కూడా అని గుర్తుచేశారు. శ్రీశ్రీ చేపినట్టు శ్రామిక వర్గ సంక్షేమానికి మనందరం పాటుపడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నవతెలంగాణ సీజీఎం పి.ప్రభాకర్ మాట్లాడూ వార్తలు, విశ్లేషణలు, వినూత్న కథనాలు కొత్త కోణంలో అందించడమే కాదు… నిజాల్ని నిర్భయంగా చెప్పడం. ఆ నిజాల వెనుక దాగిన లోగుట్టును బయటపెట్టడం ‘నవతెలంగాణ’ కర్తవ్యం అని గుర్తు చేశారు. ఆ కర్తవ్య నిర్వహణలో భుజంభుజం కలిపి పని చేస్తూ సంస్థ అభివృద్ధికి కృషి చేస్తున్న నవతెలంగాణ సిబ్బంది, విలేకర్లను ఆయన ఈ సందర్భంగా అభినందించారు.
అంతకు ముందు ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా నవతెలంగాణ ప్రధాన కార్యాలయంలో జెండా అవిష్కరణ కార్యక్రమం జరిగింది. నవతెలంగాణలో మిషన్ సెక్షన్ లో పని చేస్తున్న సీనియర్ ఉద్యోగి జంగయ్య కార్మిక జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జనరల్ మేనేజర్లు, మేనేజర్లు, బోర్డు సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు.

