నవతెలంగాణ-హైదరాబాద్: సీపీఎం జాతీయ నేత, కేరళ మాజీ ముఖ్యమంత్రి వీఎస్ అచ్యుతానందన్ మరణం పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యే హరీష్ రావు సంతాపం ప్రకటించారు. ఈ సందర్భంగా కేటీఆర్ తన X ఖాతాలో ట్వీట్ చేసారు. నిజాయితీగా, ప్రజాహితం కోసం పనిచేసి, ఆదర్శ నేతగా నిలిచిన అచ్యుతానందన్… రాజకీయ జీవితాన్ని ఎంతో స్ఫూర్తివంతంగా గడిపారన్నారు. మూడుసార్లు ప్రతిపక్ష నేతగా, ముఖ్యమంత్రిగా ప్రజలకు అందించిన ఆయన సేవలు చరిత్రలో నిలిచిపోతాయన్నారు. సీపీఎం వ్యవస్థాపక సభ్యుడిగా ప్రజల పక్షాన పోరాడిన ఆయన జీవితం, అనేక తరాలకు ప్రేరణగా నిలుస్తుందన్నారు.
ఉజ్వల రాజకీయ జీవితాన్ని గడిపిన ఆయన మూడుసార్లు ప్రతిపక్ష నేతగా, ముఖ్యమంత్రిగా వీఎస్ అచ్యుతానందన్ ప్రజలకు నిస్వార్థంగా సేవలందించారన్నారు. సీపీఎం వ్యవస్థాపక సభ్యుడిగా, ప్రజాహితానికి పాటుపడిన ఆయన సేవలు చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిపోతాయన్నారు. అచ్యుతానందన్ కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్టు హరీష్ రావు ట్వీట్ చేసారు.