ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బంద్
నిర్మానుష్యంగా మారిన రహదారులు
జీఓ నిలుపుదలకు ఉత్తర్వులు
నవతెలంగాణ-ఆదిలాబాద్ ప్రాంతీయ ప్రతినిధి/ విలేకరులు
జీఓ నెంబర్ 49ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆదివాసీ జేఏసీ ఇచ్చిన బంద్ పిలుపు సోమవారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సంపూర్ణంగా జరిగింది. తడోబా టైగర్ రిజర్వు కవ్వాల్ టైగర్ రిజర్వులో కలుపుతూ మధ్యలో ఉన్న కుమురంభీం కన్జర్వేషన్ కారిడార్ ఏర్పాటు చేస్తూ గత నెల 30న ప్రభుత్వం జీవో 49ను విడుదల చేసింది. ఆసిఫాబాద్, కెరమెరి, తిర్యాణి, రెబ్బెన, కాగజ్‌నగర్, కర్జెల్లి, సిర్పూర్, బెజ్జూర్, పెంచికల్‌పేట రేంజ్‌లో లక్షా 49 వేల హెక్టార్లను టైగర్ రిజర్వులోకి మారుస్తూ ఉత్తర్వుల్లో పేర్కొంది. దీనిని నిరసిస్తూ ఆదివాసీ సంఘాలు, వామపక్షాలు ఆందోళన నిర్వహించాయి. ఈ నేపథ్యంలో నిర్వహించిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బంద్‌కు వామపక్ష పార్టీలు, వివిధ ప్రజాసంఘాలు సంపూర్ణ మద్దతు తెలిపాయి. ఉమ్మడి జిల్లాలో బంద్ విజయవంతమైంది. వాణిజ్య సముదాయాలు స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొన్నాయి. రహదారులు నిర్మానుష్యంగా మారాయి. బంద్ విజయవంతానికి ఆదివాసీ సంఘాల నాయకులు ఎక్కడిక్కడ ధర్నాలు, ప్రదర్వనలు నిర్వహించాయి. దీంతో ప్రభుత్వం దిగొచ్చి.. జీవో 49ను నిలుపుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం పట్ల ఆదివాసీలు సంతోషం వ్యక్తం చేశారు. పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఆదివాసీ సంఘాలు, వామపక్ష పార్టీలు, విద్యార్థి, మహిళా తదితర సంఘాల ఆధ్వర్యంలో బస్టాండ్ ఎదుట బైటాయించి నిరసన తెలిపారు. అనంతరం పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తుడుందెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గోడం గణేష్, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్, నాయకులు లంక రాఘవులు, సీపీఐ(ఎంఎల్)న్యూడెమోక్రసీ నాయకులు వెంకట్ నారాయణ పాల్గొన్నారు. మంచిర్యాలలో అంబేద్కర్ చౌరస్తా వద్ద సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో 49 జీఓ పత్రాలను దహనం చేశారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి సంకె రవి, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు గోమాస ప్రకాష్, జిల్లా కమిటీ సభ్యుడు దుంపల రంజిత్ కుమార్, దూలం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఆసిఫాబాద్ జిల్లాలో కేంద్రంలో ఆదివాసీ సంఘాల నాయకులు బస్టాండ్ ఎదుట ధర్నా నిర్వహించి బస్సులు బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారు. ప్రధాన రహదారుల గుండా బైక్ ర్యాలీ నిర్వహించారు.
జీఓ రద్దయ్యే వరకు పోరాడుతాం
ఆదివాసుల అభివృద్ధికి అడ్డంకిగా మారిన జీఓ 49 రద్దయ్యే వరకు పోరాటం ఆపేది లేదని తుడుందెబ్బ జిల్లా అధ్యక్షులు కోవా విజరు కుమార్ స్పష్టం చేశారు. 339 గ్రామాల్లో సర్వే చేశామని అధికారులు చెబుతున్న మాటలు ఒట్టివేనన్నారు. జీఓను రద్దు చేయకుంటే భవిష్యత్‌లో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. పెంచికల్‌పేట్‌లో బంద్ సందర్భంగా దుకాణాలు సంపూర్ణంగా మూసివేశారు. బెజ్జూర్‌లో ఆదివాసులు రోడ్డుపై బైటాయించి రాస్తారోకో నిర్వహించారు. సిర్పూర్(టి)లో అన్ని ప్రధాన వ్యాపార సంస్థలు మూతపడ్డాయి. తిర్యాణిలో ఉదయం నుంచే వ్యాపారస్తులు స్వచ్ఛందంగా దుకాణాలను ముసివేశారు. కుమురం భీం చౌరస్తాలో ఆదివాసీ నాయకులు బైటాయించి నిరసన తెలిపారు.
జీవో 49పై ఆదివాసుల బంద్ సంపూర్ణం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES