నవతెలంగాణ-హైదరాబాద్ : పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. కనమర్లపూడి గ్రామ సమీపంలో ఆటోను మినీ లారీ ఢీకొన్న ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం పాలయ్యారు, మరో నలుగురు గాయపడ్డారు.
వినుకొండ రూరల్ సీఐ ప్రభాకరరావు తెలిపిన వివరాల ప్రకారం, శావల్యాపురం మండలం కారుమంచి గ్రామానికి చెందిన అన్నదమ్ములు బత్తుల శ్రీనివాసరావు, వెంకట్రావు కుటుంబాల మధ్య భూ తగాదా నడుస్తోంది. ఈ క్రమంలో నిన్న సాయంత్రం ఇరు కుటుంబాల మధ్య గొడవ జరిగింది. ఈ ఘర్షణలో ఒకరికి గాయాలయ్యాయి.
బాధితులు శావల్యాపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, స్వల్పంగా గాయపడిన వ్యక్తిని వినుకొండ ప్రభుత్వ వైద్యశాలకు తీసుకువెళ్లాలని పోలీసులు సూచించారు. దీంతో గాయపడిన వ్యక్తిని ఆటోలో ఎక్కించుకుని వారు వినుకొండ బయలుదేరారు. వారి ఆటో కనమర్లపూడి వద్దకు చేరుకోగానే ఎదురుగా వస్తున్న మినీ లారీ ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో శ్రీనివాసరావు తల్లి ముత్యాలమ్మ (68), భార్య నాగమూర్తమ్మ (48), వారి బంధువులు తల్లీకొడుకులు బత్తుల అంజమ్మ (57), బ్రహ్మయ్య (34) మృతి చెందారు. బత్తుల శ్రీనివాసరావు, యశోధర, ఆటో డ్రైవర్ చల్లా రాంబాబు, ముప్పాళ్ల మండలం కందులవారిపాలెంకు చెందిన మినీ లారీ డ్రైవర్ నరసింహరావు గాయపడ్డారు.
ప్రమాదానికి కారణమైన మినీ లారీ బొప్పాయి మొక్కల లోడుతో యర్రగొండపాలెం నుంచి సత్తెనపల్లి నియోజకవర్గం కందులవారిపాలెం గ్రామానికి వెళుతున్నట్లు సమాచారం. క్షతగాత్రులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో కారుమంచి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.