Thursday, May 1, 2025
Homeతాజా వార్తలుతెలంగాణ మోడల్‌ను అమ‌లు చేయండి : సీఎం రేవంత్‌

తెలంగాణ మోడల్‌ను అమ‌లు చేయండి : సీఎం రేవంత్‌

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : జన గణనలో కులగణన చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం అభినందనీయమని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. కులగణన కోరుతూ కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ వేల కిలోమీటర్లు పాదయాత్ర చేశారని గుర్తుచేశారు. ఈ విషయంలో మొదటిగా ఆయనకు అభినందనలు చెప్పాలన్నారు. జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రేవంత్‌రెడ్డి మాట్లాడారు.
‘‘కులగణనపై నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు. ఈ విషయంలో దేశానికి మార్గదర్శకంగా నిలిచాం. దేశంలో అనేక పార్టీలు కులగణన కోరుతున్నాయి. దీనిపై ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద ధర్నా చేపట్టాం. కులగణన విషయంలో కేంద్రమంత్రుల కమిటీ ఏర్పాటు చేయాలి. అందులో కేంద్రమంత్రులు, సీనియర్‌ అధికారులను నియమించాలి. తెలంగాణలో బీసీలుగా ఉన్న బోయలు.. కర్ణాటకలో మరో వర్గంలో ఉన్నారు. రాష్ట్రంలో 8వేల పేజీల్లో 57 ప్రశ్నల ద్వారా మేం వివరాలు సేకరించాం.
కులగణన విషయంలో తెలంగాణ అనుభవం కేంద్రానికి ఉపయోగపడుతుంది. ఎన్యుమరేటర్‌ నుంచి సీఎస్‌ వరకు పలుమార్లు సమీక్ష నిర్వహించాం. అనేక సలహాలు, సూచనలు వచ్చాయి. టోల్‌ఫ్రీ నంబర్‌ ఇవ్వడంతో పాటు ఆన్‌లైన్‌లో నమోదుకు అవకాశం కల్పించాం. రాజకీయ పార్టీల ప్రమేయం లేకుండా కులగణన చేపట్టాం. తెలంగాణ మోడల్‌ తీసుకోవాలని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నాం. అన్ని రాష్ట్రాలకు నిపుణుల కమిటీని పంపాలి. ప్రతి రాష్ట్రంతో మాట్లాడి ఆయా ప్రభుత్వాల సూచనలు తీసుకోవాలి. ఈ విషయంలో కేంద్రం, రాష్ట్రాలు కలిసి పనిచేయాలి. స్పష్టమైన మార్గదర్శకాలు రూపొందించాలి. కులగణన పూర్తయ్యాక ఏం చేస్తారో స్పష్టంగా చెప్పాలి’’ అని కేంద్ర ప్రభుత్వానికి రేవంత్‌ సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img