అచ్యుతానందన్‌కు అశ్రునివాళి
దారిపొడవునా జన నీరాజనం
సొంతూరు అలప్పుజకు భౌతికకాయం
నేటి సాయంత్రం 4గంటలకు అంత్యక్రియలు
తిరువనంతపురం : కేరళ మాజీ ముఖ్యమంత్రి, కమ్యూనిస్టు యోధుడు వీఎస్ అచ్యుతానందన్ భౌతిక కాయాన్ని సందర్శిం చేందుకు భారీగా జనం తరలివచ్చారు. కార్మి కులు, మహిళలు, సమాజంలోని అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం జీవితాంతం అవిశ్రాంతంగా పాటుపడిన తమ ప్రియతమ నేతను చివరిసారిగా చూసుకోవడానికి వచ్చిన అభిమానులతో తిరువనంతపురంలోని దర్బార్ హాల్ ప్రాంతమంతా జన సంద్రంగా మారింది. తన స్వస్థలం అలప్పూజకు 155 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాష్ట్ర రాజధాని తిరువనంతపురంలో ఆరు దశాబ్దాలకుపైగా తన రాజకీయ జీవితాన్ని గడిపారు. మంగళవారం ఉదయం 9 గంటలకు బార్దన్ హిల్ సమీపంలోని ఆయన నివాసం నుంచి భౌతిక కాయాన్ని ఎకెజి స్టడీ రీసెర్చ్ సెంటర్‌లో ప్రజల సందర్శనార్థం ఉంచారు. వేలాదిమంది ప్రజలు భార మైన హృదయాలతో తామెంతగానో ప్రేమించే నేతకు ఘనంగా నివాళులర్పించారు. ఆయన అందించిన స్ఫూర్తిని ముందుకు తీసుకెళతామని ప్రతిజ్ఞ చేశారు. అచ్యుతా నందన్‌కు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, గవర్నర్ ఆర్‌వి అర్లేకర్, మంత్రులు, మాజీ మంత్రులు, అసెంబ్లీ స్పీకర్ ఎఎన్ షంసీర్, వివిధ పార్టీల నాయకులు, అధికారులు నివాళులర్పించారు. సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎంఎ బేబీ, కేరళ రాష్ట్ర కార్యదర్శి ఎంవి గోవిందన్, పొలిట్‌బ్యూరో సభ్యులు ఎ విజయ రాఘవన్, అశోక్ ధావలే, విజ్జూ కృష్ణన్, సీనియర్ నాయకులు ప్రకాశ్ కరత్, బృందాకరత్, సీపీఐ ప్రధాన కార్యదర్శి డి రాజా, అన్నీ రాజా, బినోరు విశ్వం, వివిధ మతాల, సాంస్కృతిక నాయకులు, సినీ ప్రముఖులు అచ్యుతానందన్‌కు ఘనంగా నివాళులర్పించారు
దారిపొడవునా అరుణాంజలి
ప్రజల సందర్శన అనంతరం మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రత్యేక వాహనంలో ఆయన భౌతిక కాయం 66వ జాతీయ రహదారి మీదుగా అలప్పూజ బయల్దేరింది. వేల మంది ప్రజానీకం రాకతో ఇక్కడికి రెండు కిలో మీటర్ల దూరంలోని పట్టోంకు వెళ్లడానికే రెండున్నర గంటల సమయం పట్టింది. తిరువనంతపురానికి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న అట్టింగల్ చేరుకోవ డానికే ఏడు గంటల సమయం పట్టింది. రాత్రి 9 గంటలకు ఆయన సొంత ప్రాంతమైన అలప్పూజ చేరుకోవాల్సి ఉండగా, అక్కడికి చేరేటప్పటికి తెల్లవారుజాము అవుతుందని భావిస్తున్నారు. పున్నప్ర-వాయలార్ పోరాటం నుంచి తమకు ఆయనతో గల అనుబంధం వరకూ తలచుకుంటూ ప్రజలు కన్నీటి పర్యంతమయ్యారు. రెడ్ సెల్యూట్ కామ్రేడ్ అంటూ నివాదాలు మార్మోగాయి. అలప్పూజ వరకు సాగే అంతిమయాత్రలో దారిపొడవునా పలు జిల్లాల్లో పలు ప్రాంతాలను నిర్దేశించి, అక్కడ ప్రజలు సందర్శించుకుని, ఆఖరిసారిగా నివాళులు అర్పించడానికి వీలుగా ఏర్పాట్లు చేశారు. తిరువనంతపురం జిల్లాలోనే ప్రజల సందర్శన కోసం 27చోట్ల ఏర్పాట్లు చేశారు. కొల్లాం, అలప్పూజ జిల్లాల్లోనూ పలు ప్రాంతాల్లో ఇదేవిధంగా ఏర్పాట్లు చేశారు. కార్మికులు, ఆటో డ్రైవర్లు, దినసరి కూలీలు, ఇలా ప్రతి ఒక్కరూ తమ నాయకుడిని కడసారి సందర్శించారు. బుధవారం ఉదయం 9గంటలవరకు అక్కడ ప్రజల సందర్శనార్ధం ఉంచుతారు. ఆ తర్వాత పదిగంటల తర్వాత సీపీఐ(ఎం) జిల్లా కార్యాలయంలో కార్యకర్తలు, ప్రజలు చూసేందుకు వీలుగా ఉంచుతారు. అలప్పూజ పట్టణంలోని బీచ్ రిక్రియేషన్ గ్రౌండ్ వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటలవరకు ఉంచుతారు. అనంతరం సాయంత్రం 4గంటల సమయంలో పున్నప్ర వాయిలార్ అమరుల అంత్యక్రియలు జరిగిన వాలియా చుడుకాడ్ క్రియేషన్ గ్రౌండ్ వద్ద పూర్తిస్థాయి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తారు.