యూపీకి చెందిన దోపిడీ ముఠాపై పోలీసుల అనుమానాలు
ఎత్తుకెళ్లింది 3 కిలోల బంగారమే.. : ఎస్పీ నర్సింహ
నవతెలంగాణ-సూర్యాపేట
సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సాయి సంతోషి జ్యూవెల్లరీ షాపులో ఆదివారం అర్ధరాత్రి జరిగిన బంగారం దొంగతనం కేసు విచారణను పోలీసులు వేగవంతం చేశారు. దుకాణానికి 100 మీటర్ల దూరంలో మంగళవారం ఓ పాత ఇంటిని గుర్తించారు. ఆ ఇంటిని రెండు నెలల కిందట ఉత్తరప్రదేశ్‌కి చెందిన ఐదుగురు వ్యక్తులు అద్దెకు తీసుకున్నారు. అక్కడే నివాసముంటూ గుట్టుగా రెక్కీ నిర్వహించినట్టు సీసీటీవీ ఫుటేజీలో దృశ్యాలు నమోదైనాయి. ఈ ఐదుగురు పది రోజుల నుంచి ఆ పాత ఇంట్లో కనిపిస్తున్నట్టు స్థానికులు పోలీసులకు తెలిపారు. హైటెక్ బస్టాండ్ వద్ద ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పెట్టినట్టు చెప్పిన వారు.. అర్ధరాత్రి వరకు ఇద్దరు ఇంటి బయట కూర్చోవడం, మరికొందరు షూ వేసుకొని అటు ఇటు తిరగడం స్థానికుల్లో అనుమానాలు రేకెత్తించాయి. ఈ బంగారం దొంగతనం ఘటనతో వీరిపై అనుమానాలు మరింత బలపడ్డాయి. ఆ ఇంటిని పోలీసులు తనిఖీ చేసిన సమయంలో చిన్న చిన్న బంగారం పూసలు లభించాయి. ఇంట్లో ఒక చాప మాత్రమే ఉండగా.. గోడలు, తలుపులపై క్లూస్ టీం, ఫోరెన్సిక్ బృందాలు ఆధారాలు సేకరిస్తున్నాయి. పక్కింటివారి ద్వారా ఉత్తరప్రదేశ్ వ్యక్తుల వివరాలు సేకరించారు. ప్రస్తుతం ఐదుగురు కనిపించకుండా పోయారు. వీరి కోసం ప్రత్యేక పోలీసు బృందాలు గాలింపు చేపట్టాయి.
3 కిలోలే : ఎస్పీ నర్సింహ
బంగారం దుకాణంలో తొలుత రూ.18 కోట్ల విలువైన 18 కిలోల బంగారం పోయిందని భావించినా.. అనంతర దర్యాప్తులో 3 కిలోలు మాత్రమే చోరీ అయినట్టు తేలిందని ఎస్పీ నర్సింహా తెలిపారు. దొంగలు లాకర్ గదిలో ఆరున్నర కిలోల బంగారం అలాగే ఉందన్నారు. వెనుక భాగంలో రెండు బాత్‌రూమ్‌ల మధ్యనున్న గోడను కూల్చి లోపలికి ప్రవేశించిన దొంగలు బంగారాన్ని అపహరించారు. దుకాణం చుట్టుపక్కల నివాసాలు లేకపోవడంతో ఎవరూ గమనించలేదు. ఇతర దుకాణాల వెనుక భాగాన అంతా నిర్మానుష్యంగా ఉండటంతో అక్కడి నుంచి చోరీకి ప్లాన్ వేశారు. లోపలికి ప్రవేశించే ముందు సీసీటీవీ కెమెరాను దొంగలు డిస్‌కనెక్ట్ చేశారు. స్ట్రాంగ్ రూంలో ఉన్న బంగారం, డబ్బును మాత్రమే దొంగిలించారు. షాపులో మరో 6 కిలోల వరకు బంగారం ఉండగా, సీసీటీవీ కెమెరాలు ఉంటాయన్న అనుమానంతో దొంగలు జాగ్రత్త పడ్డారు. దొంగతనం చేశాక గ్యాస్ కట్టర్, సిలిండర్లను అక్కడే వదిలేసి వెళ్లిపోవడంతో ఇది ప్రొఫెషనల్ దొంగల పని కాదని పోలీసులు అనుమానిస్తున్నారు. దుండగులు పారిపోయే క్రమంలో 2 తులాల రింగ్, చెవిదిద్దులు దారిలో పడిపోగా.. వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇదిలావుండగా, అదే రాత్రి 3:25 గంటలకు ఐదుగురు దొంగలు తాము ఉన్న అద్దె ఇంటి నుంచి భుజాలపై బ్యాగ్‌లు మోసుకుంటూ వెళ్తున్న దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీలో రికార్డు అయ్యాయి. ప్రస్తుతానికి యూపీకి పోలీసు బృందాలను పంపినట్టు తెలుస్తోంది.
బంగారం చోరీ కేసులో కీలకంగా పాత ఇల్లు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES