Thursday, July 24, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంఆర్టిజన్లు.. ఆధునిక బానిసలు

ఆర్టిజన్లు.. ఆధునిక బానిసలు

- Advertisement -

విద్యుత్‌శాఖలో స్టాండింగ్‌ ఆర్డర్‌ పేరిట శ్రమదోపిడీ
ఒకే సంస్థలో రెండు విరుద్ధ రూల్స్‌
ప్రాణానికి తెగించి పని చేస్తున్నా గుర్తింపు లేదు
సబ్‌స్టేషన్లలో తీవ్ర పని ఒత్తిడి
12 ఏండ్లుగా నియామకాల్లేక ఉన్నవారిపైనే పనిభారం
విద్యార్హతను బట్టి కన్వర్షన్‌ చేయాలని కార్మికుల డిమాండ్‌
నవతెలంగాణ-నిజామాబాద్‌ ప్రాంతీయ ప్రతినిధి

విద్యుత్‌ సబ్‌స్టేషన్‌లలో బ్రేకర్‌ ట్రిప్పింగ్‌ అయినా.. తక్షణం 5-10 నిమిషాల్లో సరిచేయాలి. ఎల్‌సీలు ఇస్తూ.. ప్రతికూల సమయాల్లో కరెంట్‌ సరఫరా ఆన్‌/ఆఫ్‌ చేస్తుండాలి.. ఇలా పనిచేస్తున్న క్రమంలో సబ్‌స్టేషన్‌లలో లింబులు, పీటీలు పేలడం, ఎర్త్‌ ఫాల్ట్‌ల వల్ల ప్రాణాపాయం సైతం జరిగిన ఘటనలు కోకొల్లలు.. ఇలా తమ ప్రాణాన్ని సైతం పణంగా పెట్టి పనిచేస్తున్న ఆర్టిజన్‌ కార్మికుల గోడును ప్రభుత్వంగానీ, విద్యుత్‌ సంస్థగానీ పట్టించుకోవడం లేదు. ఒకే సంస్థలో రెండు విరుద్ధ రూల్స్‌ తీసుకొచ్చి ‘స్టాండింగ్‌ ఆర్డర్స్‌’ పేరుతో తమ శ్రమను దోచుకుంటున్నారన్న ఆవేదన వ్యక్తమవుతోంది. 1946 నాటి బ్రిటిష్‌ రూల్‌ ప్రకారం.. ఆర్టిజన్‌లు అంటే బానిసలని.. ఇప్పటికీ అదే యాక్ట్‌ కింద తమను బానిసలుగానే ట్రీట్‌ చేస్తున్నారని వాపోతున్నారు. కొత్తగా నియామకాలు చేపట్టి.. అర్హతలు ఉన్న ఆర్టిజన్‌లను కన్వర్షన్‌ చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. గత కొన్ని నెలలుగా ఆందోళనలు చేపడుతున్న వీరి సమస్యలపై ‘నవతెలంగాణ’ ప్రత్యేక కథనం.
రాష్ట్రవ్యాప్తంగా 22ఏండ్ల కిందట ఆర్టిజన్‌లను కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన విధుల్లోకి తీసుకున్నారు. టీజీఎన్‌పీడీసీఎల్‌, ఎస్‌పీడీసీఎల్‌, జెన్‌కో, ట్రాన్స్‌కోలో మొత్తం 20,645 మంది ఆర్టిజన్‌ కార్మికులను ఐటీఐ విద్యార్హతతో విధుల్లోకి తీసుకున్నారు. సబ్‌స్టేషన్‌లలో ఆపరేటర్‌గా పని చేస్తూ ఎల్‌సీలు ఇస్తుంటారు. గాలిదుమారం, భారీ వర్షాలు కురిసిన సమయంలో లైన్‌ ఆన్‌/ఆఫ్‌ చేస్తుంటారు. సబ్‌స్టేషన్‌కు పవర్‌ ఎంత వస్తుంది.. ఎంత వెళ్తుందో గంట గంటకు రీడింగ్‌ చేస్తూ ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. ఇందుకు ఒక్క సబ్‌స్టేషన్‌కు నలుగురు ఉండాల్సి ఉండగా ఇద్దరితోనే నడిపిస్తున్నారు.
ఒక్క సంస్థ.. రెండు విరుద్ధ రూల్స్‌
విద్యుత్‌ సంస్థలో ఐటీఐ విద్యార్హతతో నియామకాలు చేపట్టినా.. రెండు విరుద్ధ రూల్స్‌తో తీవ్ర నష్టం వాటిల్లుతోందని ఆర్టిజన్‌ కార్మికులు అంటున్నారు. ఏపీఎస్‌ఈబీ రూల్స్‌ ప్రకారం.. జేఎల్‌ఎం, ఏఎల్‌ఎం, ఎల్‌ఎం, ఎల్‌ఐ, ఎస్‌సీఐ, ఫోర్‌మెన్‌లకు అనేక సౌకర్యాలు ఉన్నాయి. ప్రమాదవశాత్తు చనిపోతే ఆ కుటుంబానికి కోటి రూపాయల వరకు ఎక్స్‌గ్రేషియా చెల్లిస్తూ.. వారి కుటుంబీకులకు కారుణ్య నియామకాల కింద విద్యార్హతను బట్టి జేఎల్‌ఎం, సబ్‌ ఏఈ లాంటి పోస్టులు ఇస్తున్నారు. కానీ ‘స్టాండింగ్‌ ఆర్డర్స్‌’ పేరుతో ఆర్టిజన్‌లకు మాత్రం కనీస వేతనాలు మొదలు.. రిటైర్‌మెంట్‌ బెనిఫిట్స్‌ లాంటి సౌకర్యాలు ఏమీ లేవని వారు అంటున్నారు. ఈ కార్మికులు ప్రమాదవశాత్తు చనిపోయినా ఎలాంటి ఎక్స్‌గ్రేషియా చెల్లించడం లేదు. పైగా కారుణ్య నియామకాల కింద తమ కుటుంబీకులకు విద్యార్హతతో సంబంధం లేకుండా గ్రేడ్‌-4 అటెండర్‌ స్థాయి పోస్టులు ఇస్తున్నట్టు చెబుతున్నారు. ఆదివారాలు, పండుగలకు సెలవులు లేవు. స్టాండింగ్‌ ఆర్డర్స్‌ ప్రకారం ‘ఓటీ’ కట్టి ఇవ్వాల్సి ఉందని, లీవ్‌లు తీసుకోకుండా పని చేస్తే ఎన్‌క్యాష్‌మెంట్‌ కింద బిల్లులు ఇవ్వాల్సి ఉన్నా.. ఏ ఒక్కటీ అమలు చేస్తున్న దాఖలాలు లేవు.
ప్రమాదాల సమయంలో ప్రాణాప్రాయం
ఏదైనా అనుకోని ఘటనలు జరిగి గాయాలపాలైతే కనీసం ఆస్పత్రికి తీసుకెళ్లే దిక్కులేదు. గతంలో వాచ్‌మెన్‌లు ఉన్నప్పటికీ.. ప్రస్తుతం ఏ సబ్‌స్టేషన్‌లోనూ వాచ్‌మెన్‌ లేరు. సబ్‌స్టేషన్‌లలో కొన్ని సందర్భాల్లో లింబులు, పీటీలు పేలిపోతుంటాయి. ఇలాంటి సమయాల్లో ప్రమాదాలు జరిగి ఇప్పటి వరకు సుమారు 2000 మంది కార్మికులు చనిపోయినట్టు వారు తెలిపారు. ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా వ్యాప్తంగా సుమారు 70 కొత్త సబ్‌స్టేషన్‌లు ఏర్పడ్డాయి.
‘స్టాండింగ్‌ ఆర్డర్స్‌’ రద్దు చేయాలి
1946 నాటి స్టాండింగ్‌ ఆర్డర్స్‌ను రద్దు చేసి ఒకే సంస్థలో ఒకే రూల్‌ కింద ఏపీఎస్‌ఈబీని ఇంప్లిమెంట్‌ చేయాలి. ఆర్టిజన్‌ల విద్యార్హతలను బట్టి కన్వర్షన్‌ ఉద్యోగోన్నతులు కల్పించాలి. రిక్రూట్‌మెంట్‌ చేపట్టి శ్రమ దోపిడీ, పని ఒత్తిడి తగ్గించాలి. పనికి తగ్గ వేతనం అమలు చేయాలి. విధుల్లో ఉండగా చనిపోతే ఎక్స్‌గ్రేషియా ప్రకటించి, రిటైర్‌మెంట్‌ బెనిఫిట్స్‌ కల్పించాలి. లేకుంటే మెరుపు సమ్మెకు దిగుతాం.
-ఆర్టిజన్స్‌ నిజామాబాద్‌ జిల్లా జేఏసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ నల్లూరి నరేశ్‌
ఆర్టిజన్‌ కార్మికుల ఆందోళనలకు సంపూర్ణ మద్దతు
ఆర్టిజన్‌ కార్మికుల కన్వర్షన్‌, ఉద్యోగోన్నతుల సాధన కోసం జరిగే పోరాటానికి సీఐటీయూ పూర్తి మద్దతు తెలియజేస్తుంది. వారు భవిష్యత్‌లో సమ్మెకు వెళ్తే వెన్నంటి ఉండి కంటికి రెప్పలా కాపాడుకుంటాం. విద్యుత్‌ సంస్థల్లో సమ్మె నిషేధంపై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడాన్ని ఖండిస్తున్నాం. సమ్మె నిషేధించటమంటే కార్మికులు, ఉద్యోగుల హక్కులను కాలరాయడమే.
– సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్‌

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -