చర్చలకు సిద్ధమే : స్పష్టం చేసిన ఇరాన్
టెహ్రాన్ : అణు కార్యక్రమాన్ని ఆపేది లేదని ఇరాన్ స్పష్టం చేసింది. అయితే దానిపై చర్చలకు సిద్ధంగా ఉన్నామని తెలిపింది. అమెరికా, ఇజ్రాయిల్ దాడుల కారణంగా తమ అణు స్థావరాలకు నష్టం వాటిల్లడంతో ప్రస్తుతానికి ఆ కార్యక్రమం నిలిచిపోయిందని, కానీ దానిని వదులుకునే ప్రశ్నే లేదని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ ఆరాగ్చీ తెలిపారు. అణు కార్యక్రమం తమ శాస్త్రవేత్తలు సాధించిన విజయమని, అన్నింటికంటే అది తమకు గర్వకారణమని ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు. పరస్పర ప్రయోజనం కలిగేలా ఉంటే అణు కార్యక్రమంపై అమెరికాతో చర్చలకు సిద్ధమేనని అరాగ్చీ తెలిపారు. గతంలో ఒకసారి అణు కార్యక్రమంపై చర్చలు జరిపామని ఆయన గుర్తు చేశారు. ఇప్పుడు మరోసారీ అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. అణు శుద్ధి కార్యక్రమంపై దాడుల ప్రభావాన్ని అంచనా వేస్తున్నామని, ఆ పని పూర్తయిన తర్వాత అంతర్జాతీయ అణు శక్తి సంస్థ (ఐఏఈఏ)కు నివేదిక అందజేస్తామని అన్నారు. ఐఏఈఏకు తమ సహకారం కొనసాగుతోందని అరాగ్చీ తెలిపారు. కాగా ఈ ఏడాది ప్రారంభంలో అణు కార్యక్రమంపై రెండు దేశాల మధ్య చర్చలు జరిగిన విషయం తెలిసిందే. తన అణు కార్యక్రమం ప్రజా ప్రయోజనాల కోసమేనని ఇరాన్ చాలా కాలంగా చెబుతోంది. అమెరికా, ఇరాన్ మధ్య మేలో ఒప్పందం కుదిరే అవకాశాలు కన్పించినప్పటికీ ఇజ్రాయిల్ ఆకస్మిక దాడుల కారణంగా చర్చలు ఆగిపోయాయి. ఆ తర్వాత అమెరికా కూడా ఇరాన్ అణు స్థావరాలపై బాంబు దాడులు జరిపింది.
అణు కార్యక్రమాన్ని ఆపం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES