నవతెలంగాణ హైదరాబాద్: సికింద్రాబాద్ బోయిన్‌పల్లిలోని వ్యవసాయ మార్కెట్‌ను రైతు కమిషన్ బృందం బుధవారం ఉదయం 6గంటలకు ఆకస్మికంగా తనిఖీ చేసింది. దాదాపు గంటన్నరపాటు మార్కెట్‌లో పర్యటించి అక్కడ సమస్యలను తెలుసుకోవడంతో పాటు అధికారుల నిర్లక్ష్యంపై ఆరా తీసింది. వివిధ రాష్ట్రాల నుంచి మార్కెట్‌కు వచ్చిన వ్యాపారులతో రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, సభ్యులు రాములు నాయక్, భవానీరెడ్డి మాట్లాడారు.
గత నాలుగురోజులుగా మార్కెట్ సెక్రటరీ అందుబాటులో లేడని తెలియడంలో కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మార్కెట్‌లో రైతుల నుంచి కొనుగోళ్లు, అమ్మకాలపై కమిషన్ ఆరా తీసింది. అధికారుల చాంబర్లు, రసీదులు, అటెండెన్స్ రిజిస్టర్, రికార్డులను పరిశీలించింది. అమ్మకాలు, కొనుగోళ్లకు సంబంధించిన డేటాను సైతం కమిషన్ సేకరించింది. బయో గ్యాస్ ప్లాంట్‌ను పరిశీలించారు. ప్లాంట్ పనిచేయకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. మార్కెట్‌కు చెన్నై, నెల్లూరు, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర నుంచి ఉత్పత్తులు వస్తున్నట్టు కమిషన్ సభ్యులకు రైతులు తెలిపారు.