వృత్తి విద్యా కోర్సులకూ వర్తింపు :చైర్‌పర్సన్‌గా బాలకిష్టారెడ్డి
ఉత్తర్వులు విడుదల
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో 2025-26 విద్యాసంవత్సరానికి సంబంధించి ఇంజినీరింగ్ సహా వృత్తి విద్యా కోర్సుల ఫీజుల ఖరారు కోసం రాష్ట్ర ప్రభుత్వం అధికారుల కమిటీని నియమించింది. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా శుక్రవారం ఉత్తర్వులు (జీవోనెంబర్ 29) జారీ చేశారు. చైర్‌పర్సన్‌గా ఉన్నత విద్యామండలి చైర్మెన్ వి బాలకిష్టారెడ్డి, సభ్య కార్యదర్శిగా ఉన్నత విద్యామండలి కార్యదర్శి శ్రీరాం వెంకటేశ్, సభ్యులుగా సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ ఎ శ్రీదేవసేన, ఎస్సీ సంక్షేమ అభివృద్ధి శాఖ కమిషనర్ ఎన్ క్షితిజ, స్టేట్ ఆడిట్ శాఖ డైరెక్టర్ ఎం వెంకటేశ్వరరావు, డీటీసీపీ డైర్టెర్ ఎస్ దేవేందర్‌రెడ్డి, జేఎన్టీయూ హైదరాబాద్ రిజిస్ట్రార్ కె వెంకటేశ్వరరావు, ఓయూ ఇంజినీరింగ్ కాలేజీ డీన్ ఎ కృష్ణయ్య, సబ్జెక్టుల నిపుణులను ఇద్దరిని చైర్‌పర్సర్ నియమించేందుకు అవకాశముందని తెలిపారు. 2025-28 వరకు బ్లాక్ పీరియెడ్‌కు సంబంధించిన ఇంజినీరింగ్ సహా వృత్తి విద్యాకోర్సుల ఫీజులకు సంబంధించి తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీజు రెగ్యులేటరీ కమిటీ (టీఏఎఫ్‌ఆర్సీ) ఖరారు చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించిందని వివరించారు. అయితే టీఏఎఫ్‌ఆర్సీ ప్రతిపాదించిన ఫీజుల్లో కొన్ని కాలేజీలకు సంబంధించి అసాధారణంగా పెంచడం పట్ల ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో ఆ ఫీజులను ఆమోదించలేదు. ప్రస్తుత విద్యాసంవత్సరం (2025-26)కు 2022-25 బ్లాక్ పీరియెడ్‌లో ఉన్న ఫీజులే అమల్లో ఉంటాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు, హైకోర్టు మార్గదర్శకాలు, ఇతర రాష్ట్రాల్లో ఫీజులు వంటి అంశాలపై అధ్యయనం చేసేందుకు అధికారుల కమిటీని నియమించింది. కాలేజీలు పాటిస్తున్న ప్రమాణాలు, విద్యార్థులకు కల్పిస్తున్న మౌలిక వసతులు, ఏఐసీటీఈ, విశ్వవిద్యాలయాల నిబంధనలకు అనుగుణంగా అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది వంటి అంశాలను ఆ కమిటీ పరిశీలించనుంది. ఆ కమిటీ అన్ని అంశాలనూ పరిగనణలోకి తీసుకుని నివేదికను రూపొందిస్తుంది. దాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పిస్తుంది. దాని ఆధారంగా ఇంజినీరింగ్, సహా వృత్తి విద్యా కోర్సులకు ఫీజులను ఖరారు చేసే అవకాశమున్నది.
ఇంజినీరింగ్ ఫీజుల ఖరారుకు అధికారుల కమిటీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES