– ఆగస్టు 15 వరకు సమస్యలు పరిష్కరించకుంటే కార్యాచరణ ప్రకటిస్తాం
– సెప్టెంబర్ 1న పెన్షన్ విద్రోహదినం : ఉద్యోగ జేఏసీ చైర్మెన్ జగదీశ్వర్, సెక్రెటరీ జనరల్ శ్రీనివాసరావు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగులు ఉద్యమబాట పట్టనున్నారు. వచ్చేనెల 15వ తేదీ వరకు రాష్ట్ర ప్రభుత్వం సమస్యలను పరిష్కరించకుంటే ఉద్యమ కార్యాచరణను ప్రకటిస్తామని హెచ్చరించారు. ప్రభుత్వ స్పందనను బట్టి ఉద్యోగ జేఏసీ సమావేశాన్ని నిర్వహించి భవిష్యత్ కార్యాచరణను రూపొందిస్తామని వివరించారు. సెప్టెంబర్ ఒకటో తేదీన పెన్షన్ విద్రోహదినం పాటించాలని నిర్ణయించారు. అదేరోజు జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలను నిర్వహించాలని ప్రకటించారు. శనివారం హైదరాబాద్‌లోని టీఎన్జీవో కార్యాలయంలో తెలంగాణ ఉద్యోగ జేఏసీ సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం జేఏసీ చైర్మెన్ మారం జగదీశ్వర్, సెక్రెటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ అనేక సార్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రివర్గ ఉపసంఘం, అధికారుల కమిటీతో చర్చలు జరిపినా సమస్యలు ఇంకా పెండింగ్‌లోనే ఉండడం శోచనీయమని అన్నారు. పెండింగ్ బిల్లులను నెలకు రూ.700 కోట్లు చెల్లిస్తామంటూ సీఎం హామీ ఇచ్చినా గతనెలలో కేవలం రూ.183 కోట్లు మెడికల్ బిల్లులు విడుదలయ్యాయని వివరించారు. మిగిలిన మొత్తం ఈనెలతో కలిపి రూ.1,217 కోట్లు చెల్లించాల్సిన అవసరముందన్నారు. వాటిని చెల్లించకుండా తాత్సారం చేస్తున్న ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి ఉద్యోగుల గోడును పెడచెవిన పెట్టడాన్ని తీవ్రంగా ఖండించారు. ఉద్యోగుల ఆరోగ్య పథకాన్ని ప్రారంభిస్తామనీ, ఆరోగ్య కార్డులను మంజూరు చేస్తామనీ హామీ ఇచ్చినా వైద్యారోగ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి ఈహెచ్‌ఎస్ అమలుకు మోకాలు అడ్డుపెట్టడాన్ని వ్యతిరేకిస్తున్నామని అన్నారు. బకాయి ఉన్న ఐదు డీఏలను అడిగితే ఒక్క డీఏను మాత్రమే ఇచ్చి ఆర్థిక శాఖ అధికారులు నిర్లక్ష్యం కనిపిస్తున్నదని చెప్పారు. 2023, జులై ఒకటి నుంచి అమలు చేయాల్సిన పీఆర్సీ మాట ఎత్తకపోవడం సరైంది కాదన్నారు. అధికారుల కమిటీ 57 డిమాండ్లకు సంబంధించిన నివేదికను ఇంతకాలం బయట పెట్టకపోవడం వారి నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు. కొన్ని శాఖల్లో ఉద్యోగుల ఖాళీలను తగ్గించడం దుర్మార్గమని అన్నారు. కొత్త పోస్టులను సృష్టించే క్రమంలో ఖాళీలను కొత్త పోస్టులుగా అప్‌గ్రేడ్ చేస్తే సరిపోతుందని సూచించారు. సీఎం, మంత్రిమండలి ఆదేశాలను గౌరవించాల్సిన అధికారులందరూ ఉద్యోగులకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారా?అనే అనుమానం కలుగుతున్నదని చెప్పారు. అలా కలగకుండా ఉండాలంటే ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. క్యాబినెట్‌లో ఆమోదించిన విధంగా నెలకు రూ.700 కోట్ల పెండింగ్ బిల్లులను క్రమం తప్పకుండా చెల్లించాలని కోరారు. గతనెలలో మిగిలిన రూ.517 కోట్లు, ఈనెలలో రూ.700 కోట్లు కలిపి రూ.1,217 కోట్లు బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆరోగ్య రక్షణ పథకాన్ని ఈనెలాఖరులోపు పూర్తిస్థాయిలో నిబంధనలను రూపొందించి అమలు చేయాలని కోరారు. పెండింగ్‌లో ఉన్న ఐదు డీఏలను వెంటనే విడుదల చేయాలని చెప్పారు. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సీపీఎస్)ను రద్దు చేసి పాత పెన్షన్ స్కీం (ఓపీఎస్)ను అమలు చేయాలని అన్నారు. ఏకీకృత సర్వీస్ నిబంధనలను అమలు చేసేందుకు తక్షణమే అధికారులకు ఆదేశాలను జారీ చేయాలన్నారు. డీఎస్సీ-2003 ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కోరారు. పీఆర్సీ నివేదికను వెంటనే తెప్పించుకుని 51 శాం ఫిట్‌మెంట్‌ను అమలు చేయాలని చెప్పారు. వివిధ కారణాలతో సస్పెండ్ అయిన ఉద్యోగులను విధుల్లోకి తీసుకోవాలని అన్నారు. గచ్చిబౌలి స్థలాలను భాగ్యనగర్ టీఎన్జీవోలకు కేటాయించాలని డిమాండ్ చేశారు. స్థానికత ప్రాతిపదికన అదనపు పోస్టులను సృష్టించి 317 జీవో బాధితులకు న్యాయం చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో పదోన్నతుల కమిటీలను సకాలంలో ఏర్పాటు చేసి పదోన్నతులను ఇవ్వాలని సూచించారు. కొత్త మండలాలకు ఎంపీపీ, ఎంఈవో పోస్టులను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగులకు 29 రోజుల సమ్మె కాలపు వేతనాన్ని చెల్లించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగ జేఏసీ అడిషనల్ సెక్రెటరీ జనరల్ పి దామోదర్‌రెడ్డి, నాయకులు ఎ వెంకట్, జి సదానందంగౌడ్, వంగ రవీందర్‌రెడ్డి, పి మధుసూదన్‌రెడ్డి, కటకం రమేష్, ఎ సత్యనారాయణ, సిహెచ్ అనిల్‌కుమార్, ఎన్ తిరుపతి, రాధాకృష్ణ, మణిపాల్‌రెడ్డి, కస్తూరి వెంకటేశ్వర్లు, ఎండీ అబ్దుల్లా తదితరులు పాల్గొన్నారు.
ఉద్యోగుల ఉద్యమబాట
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES