నవతెలంగాణ-హైదరాబాద్ : తొమ్మిదేళ్ల బాలుడు రోడ్డు ప్రమాదంలో మృతిచెందడంతో అమెరికాలో ఉంటున్న ఓ తెలుగు కుటుంబంలో విషాదం నెలకొంది. ఈపూరు మండలం ముప్పాళ్లకు చెందిన తుర్లపాటి శ్రీనివాసరావు ఫ్యామిలీ అమెరికాలోని ముస్సోరి రాష్ట్రం జెఫర్‌సన్ సిటీలో ఉంటోంది. శ్రీనివాసరావు ఈ నెల 24న సాయంత్రం 7 గంటల (అమెరికా కాలమానం ప్రకారం) ప్రాంతంలో తన చిన్నకుమారుడు యత్విక్‌సాయి (09)తో కలిసి సైక్లింగ్‌కు వెళ్లారు.
శ్రీనివాసరావు సైకిల్‌పై ముందు వెళుతుండగా.. వెనుక యత్విక్‌సాయి తన స్నేహితులతో కలిసి సైకిల్ తొక్కుతూ వెళుతున్నాడు. ఆ సమయంలో ఓ రోడ్డు మలుపులో చెట్లు అడ్డుగా ఉండటంతో వెనుక నుంచి వచ్చే వాహనాలు కనిపించలేదు. వేగంగా వచ్చిన ఓ ట్రాలీ ట్రక్కు బాలుడిని ఢీకొట్టి కొంతదూరం ఈడ్చుకెళ్లింది.
ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ యత్విక్‌సాయి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. శుక్రవారం బాలుడికి అంత్యక్రియలు నిర్వహించారు. ఇక, బాలుడి మృతి సమాచారంతో ముప్పాళ్ల గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. మనుమడి మరణవార్త తెలుసుకున్న నాయనమ్మ విజయ గుండెలవిసెలా రోదిస్తున్న తీరు అక్కడి వారిని తీవ్రంగా కలిచివేసింది.