నవతెలంగాణ-హైదరాబాద్: మాస్కో ప్యోంగ్యాంగ్ మధ్య ప్రత్యక్ష వాణిజ్య సర్వీసును ప్రారంభించినట్లు రష్యా ప్రకటించింది. రష్యా ఎయిర్‌లైన్స్ నార్డ్‌విండ్ నడుపుతున్న మొదటి విమానం 400 మందికి పైగా ప్రయాణికులతో మాస్కోలోని షెరెమెటియేవో విమానాశ్రయం నుండి బయలుదేరినట్లు తెలిపింది. డిమాండ్ దృష్ట్యా నెలకు ఒక విమానం ఉత్తర కొరియాకు ప్రయాణిస్తుందని రష్యా రవాణా మంత్రిత్వ శాఖ తెలిపింది.
ఈ నెల ప్రారంభంలో రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ ఉత్తరకొరియాలోని కొత్త వొన్సాన్-కల్మా బీచ్ రిసార్ట్‌లో ఆ దేశ అధ్యక్షుడు కిమ్‌జోంగ్ ఉన్‌తో సమావేశమైన సంగతి తెలిసిందే. ఆసమయంలో రష్యన్ పర్యాటకులను ఈ రిసార్ట్‌ను సందర్శించేలా ప్రోత్సహిస్తానని హామీ ఇచ్చారు. ఈ రిసార్ట్ సుమారు 20,000 మందికి వసతి కల్పించగలదు. తమ దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేలా పర్యాటకాన్ని మరింతగా ప్రోత్సహించాలని కిమ్ భావిస్తున్నారు.
కొవిడ్ మహమ్మారి సమయంలో విధించిన ఆంక్షలను ఉత్తర కొరియా నెమ్మదిగా సడలిస్తోంది. దశలవారీగా తన దేశ సరిహద్దులను తిరిగి తెరుస్తోంది. అయితే అంతర్జాతీయ పర్యాటకాన్ని పూర్తిగా పునరుద్ధరించనుందా లేదా అనేది స్పష్టం చేయాల్సి వుంది. రష్యా ఓడరేవు నగరం వ్లాడివోస్టాక్ మరియు ప్యోంగ్యాంగ్‌ల మధ్య సాధారణ విమానాలు 2023లో తిరిగి పునరుద్ధరించబడ్డాయి.