నవతెలంగాణ-హైదరాబాద్: బాలీవుడ్ సినీనటుడు అమిర్ ఖాన్ ఇంటికి 25 మంది ఐపీఎస్ అధికారులు రావడం సినీ పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది. దీని తాలూకు వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అధికారులంతా బస్సు, వ్యాన్‌లలో బాంద్రాలోని ఆమిర్ ఇంటికి వెళ్లారు. వారంతా ఎందుకు వెళ్లారనే విషయంలో స్పష్టత కోసం ఓ ఆంగ్ల మీడియా అమిర్ టీమ్‌ను సంప్రదించింది. కానీ, వారికి కూడా ఈ విషయంలో కచ్చితమైన సమాచారం అందలేదని, తాము కూడా ఇంకా ఆరా తీస్తున్నాం అని బదులిచ్చారు. కేవలం అమిర్‌ను కలవడం కోసమే అధికారులు వచ్చారని మరికొన్ని కథనాలు వెలువడుతున్నాయి.
కాగా, అమిర్ త్వరలోనే ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్‌బోర్న్‌కు చీఫ్ గెస్ట్‌గా హాజరుకానున్న సంగతి విదితమే. ఈ అంతర్జాతీయ వేదికపై ఇటీవల ఆమిర్ నటించిన సితారే జమీన్ పర్ చిత్రాన్ని ప్రదర్శించనున్నారు.