– 3-2తో ఇంగ్లాండ్‌పై భారత్ గెలుపు
– సుధిర్మన్ కప్ బ్యాడ్మింటన్ 2025
జియామెన్ (చైనా): సుధిర్మన్ కప్ నుంచి భారత్ విజయంతో నిష్క్రమించింది. గ్రూప్ దశ ఆఖరు మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌పై ఊరట విజయం సాధించిన టీమ్ ఇండియా.. గ్రూప్-డిలో మూడో స్థానంతో ముగించింది. గురువారం ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌కు సింగిల్స్ స్టార్స్ పి.వి సింధు సహా హెచ్.ఎస్ ప్రణరు, లక్ష్యసేన్ దూరంగా ఉన్నారు. డెన్మార్క్, ఇండోనేషియాల చేతిలో 1-4తో పరాజయం పాలైన ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌కు ముందే నాకౌట్ ఆశలు ఆవిరి చేసుకున్న సంగతి తెలిసిందే. తొలుత మహిళల సింగిల్స్‌లో అనుపమ ఉపాధ్యాయ 21-12, 21-16తో లిన్‌పై వరుస గేముల్లో గెలుపొంది శుభారంభం అందించింది. పురుషుల సింగిల్స్‌లో సతీశ్ కుమార్ కరుణాకరన్ 18-21, 22-20, 21-13తో హ్యారీపై విజయం సాధించి భారత్ ఆధిక్యాన్ని 2-0కు మెరుగుపర్చాడు. మహిళల డబుల్స్‌లో తనీశ క్రాస్టో, శృతి మిశ్రా 21-17, 21-17తో 42 నిమిషాల్లోనే లాంఛనం ముగించారు. 3-0తో భారత్ ఎదురులేని ముందంజ వేసి, గెలుపు ఖాయం చేసుకుంది. నామమాత్రపు చివరి రెండు మ్యాచుల్లో ఇంగ్లాండ్ షట్లర్లు మెరిశారు. పురుషుల డబుల్స్‌లో హరిహరన్, రూబెన్ కుమార్‌లు 14-21, 21-11, 13-21తో.. మిక్స్‌డ్ డబుల్స్‌లో సతీశ్ కుమార్, తనీశ క్రాస్టోలు 21-1, 13-21, 22-24తో మూడు గేముల మ్యాచ్‌లో పోరాడి ఓడారు. సుధిర్మన్ కప్‌లో నేటి నుంచి క్వార్టర్‌ఫైనల్స్ షురూ కానుండగా.. గ్రూప్-డి నుంచి ఇండోనేషియా, డెన్మార్క్‌లు క్వార్టర్స్‌కు చేరుకున్నాయి.
ఊరట విజయం
- Advertisement -